‘లేబర్​ బీమా’ పేరుతో వాటాల దందా

    చనిపోయిన వ్యక్తులకు లేబర్​     కార్డుల జారీ

    తర్వాత ఇన్సూరెన్స్​ క్లెయిమ్​తో రూ. లక్షల్లో చోరీ

    ప్రతి మండలానికో బ్రోకర్

    పేపర్​లో చావు వార్తలే ఆధారం

    50-50 సెటిల్​మెంట్​తో ముందుగానే అగ్రిమెంట్

వరంగల్​ అర్బన్​జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన దేవి(పేరు మార్చాం) అనే మహిళా రైతు 2018 ఆగస్టు మొదటివారంలో చనిపోయింది. అంతకుముందు ఆమె పేరున లేబర్​ కార్డు లేదు. ఆమె చనిపోయిన వార్తను పేపర్​లో చూసి, రెండుమూడు రోజులకు అదే మండలానికి చెందిన ఓ వ్యక్తి వాళ్లింటికి  వెళ్లి పరిచయం చేసుకున్నాడు. లేబర్​ ఇన్సూరెన్సు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి డాక్యుమెంట్లు తీసుకొని ప్రాసెస్ మొత్తం పూర్తి చేశాడు. ముందుగానే 50-50 షేర్​ మాట్లాడుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో రూ.6 లక్షల అమౌంట్​ రావడంతో తన వాటాగా రూ.3 లక్షలు తీసుకున్నాడు.

ఇదే మండలంలోని ముల్కనూర్​కు చెందిన చిన్నయ్య(పేరు మార్చాం) ఈ ఏడాది మేలో చనిపోయాడు. ఈయనకూ ఎలాంటి లేబర్​ కార్డు లేదు. వెంటనే మీడియేటర్​ రంగంలోకి దిగి చిన్నయ్య కుటుంబసభ్యులను సంప్రదించాడు. ప్లాన్​ ప్రకారం చిన్నయ్య బతికి ఉన్నప్పటి తేదీతో లేబర్​ కార్డు ఇష్యూ చేయించాడు. అనుకున్నట్లే ఈ ఏడాది ఆగస్టులో ఇన్సూరెన్సు రూ.6 లక్షలు క్లెయిమ్​ కావడంతో తన వాటాగా  రూ.3 లక్షలు పట్టుకెళ్లాడు. ఉత్త పుణ్యానికే రూ.3లక్షలు రావడంతో లబ్ధిదారులు కూడా సైలెంట్​గా ఉండిపోయారు.

పేపర్​లో చావు వార్తలు కనిపిస్తే చాలామంది చదివి వదిలేస్తారు.  మహా అయితే అయ్యో పాపం అని నిట్టూరుస్తారు. కానీ ఇవే చావు వార్తలు కొందరికి చెప్పలేనంత సంతోషం కలిగిస్తున్నాయి.  అందులోనూ యాక్సిడెంటల్​ డెత్​ అయిందంటే ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. ఎందుకంటే చావు వార్తలే వారికి ఆదాయ మార్గాలు. మృతుల పేరు గతంలో లేబర్​ కార్డు తీసుకున్న వారి పేరుతో  మ్యాచ్​ అయితే చాలు, వారి పంట పండినట్లే.

ఇదో నయా దందా..

లేబర్​ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ప్రభుత్వం ఇన్సూరెన్సు కింద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. సాధారణ మరణమైతే రూ.1.30 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6.30 లక్షలు చెల్లిస్తోంది. అమౌంట్​ ఎక్కువగా ఉండడంతో హన్మకొండలోని జిల్లా లేబర్​ ఆఫీస్​లోని కొందరు​ సిబ్బంది వీటిపై కన్నేశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని తమ జేబులో వేసుకునేలా ప్లాన్​ రచించారు.  ఇందుకు బయట ఒక్కో మండలానికి ఒక్కో బ్రోకర్​ను ఏర్పాటు చేసుకున్నారు.  మృతులకు లేబర్​ కార్డులు ఉన్నా.. లేకున్నా అన్నీ తామై చూసుకుంటూ 50-–50 పర్సంటేజీతో ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.  ఎక్కువగా కార్డులు లేనివారినే ఎంపిక చేసుకుని దందాకు పాల్పడుతున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు.. గతంలో కార్డు పొందిన వ్యక్తి పేరు మ్యాచ్​అయిందంటే నకిలీ కార్డు తయారు చేసి రూ.లక్షలు దోచుకుంటున్నారు.

ఆఫీస్​లో ఆయనే రారాజు

లేబర్​ ఆఫీస్​లో రారాజుగా వ్యవహరిస్తున్న సిబ్బంది ఒకరు కార్యాలయంలో పనులను అన్నీ తానై చక్కబెడుతున్నాడు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అందరు ఆఫీసర్లకు దగ్గరగా మెదులుతూ ప్రతి పనికీ వాటాలు సమకూరుస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలాల్లోని బ్రోకర్లు ఏదైనా డెత్​ కేసు తీసుకుని వస్తే గతంలో ఆ పేరుతో ఎవరెవరు  కార్డులు తీసుకున్నారో చూసి ఆ వివరాలను ఇతగాడు బ్రోకర్లకు అందజేస్తాడు. ఆ వివరాలతో బ్రోకర్లు నకిలీ కార్డు తీసుకొని వచ్చాక  అన్నీ ఆయనే చక్కబెట్టి ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేయిస్తుంటాడన్నమాట. చివరకు లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాక అందులోంచి సగం మొత్తాన్ని బ్రోకర్​, కార్యాలయ సిబ్బంది ఒకరు, ఇతర ఆఫీసర్లకు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నకిలీ కార్డుల తయారీ ఇలా..

ఎవరికైనా లేబర్​ కార్డు కావాలంటే ముందుగా ఆఫీస్​ పేరున మీసేవాలో రూ.110 చలానా కట్టాలి. సంబంధిత చలానాతో అవసరమైన సర్టిఫికెట్లను లేబర్​ ఆఫీస్​లో అందించిన తరువాత ఆఫీసర్లు వాటిని వెరిఫై చేసి లేబర్​ కార్డు ఇష్యూ చేస్తారు. ఈ కార్డు ఐదేళ్ల వరకు చెల్లుతుంది. కార్డు జారీ అయిన రోజు నుంచే ఇన్సూరెన్సు కూడా వర్తిస్తుంది. అయితే చనిపోయిన వ్యక్తి పేరు మీద ఆఫీస్​కు చలానా చెల్లించి గతంలో అదే పేరుతో ఉన్న వేరే వ్యక్తి చలానా వివరాలతో నకిలీ కార్డు తయారు చేస్తున్నారు. రికార్డులు మాన్యువల్​గా జరిగిన సమయంలో బ్రోకర్లు, సిబ్బంది కలిసి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టినట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం వరకు లేబర్​ కార్డుల జారీ కేవలం మాన్యువల్​గానే జరిగేది. ప్రభుత్వం కొత్తగా ఆన్​లైన్​ సిస్టం తీసుకొచ్చినా అది సరిగా వర్క్​ చేయకపోవడంతో రెండు నెలల క్రితం వరకూ కార్డులు మాన్యువల్​గానే ఇష్యూ చేశారు. ఆన్​లైన్​ సిస్టం మొరాయింపు కూడా ఈ అక్రమార్కులకు కలిసివస్తోంది.

థర్డ్​ పార్టీ ఎంక్వైరీతోనే బయటకు..

ఈ అక్రమ దందా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మండలానికో బ్రోకర్​ను ఏర్పాటు చేసుకొని ఆఫీస్​లో సిబ్బంది ఒకరు రూ.లక్షలు కూడబెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ బాగోతంలో పలువురు పైఆఫీసర్లు కూడా వాటా తీసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో థర్డ్​ పార్టీ విచారణ చేయిస్తేనే అసలు బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది. గత మూడేండ్లలో క్లెయిమ్​అయిన ప్రతి లబ్ధిదారుడి ఖాతా నుంచి ఎవరెవరి ఖాతాకు రూ.3లక్షలు, ఆపైన ట్రాన్సాక్షన్స్​ జరిగాయో విచారిస్తే అసలు విషయం బయటపడుతుంది. ఈ మేరకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఖజానా పదిలంగా ఉండే అవకాశం ఉంటుంది.
మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates