మాస్కులు, శానిటైజర్ల కొనుగోళ్లలో అవకతవకలు!

ఒక్క కంపెనీ నుంచి ఒక్కో రేటుకు ఆర్డర్
లక్షల్లో అదనంగా వెచ్చించారనే ఆరోపణలు
హైలెవల్ కమిటీ సూచనల మేరకే కొన్నామన్న ఆఫీసర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా కట్టడి కోసం రాష్ట్ర సర్కారు చేస్తున్న సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నయి. తక్కువ ధరకు సప్లై చేస్తామన్న కంపెనీలను కాదని.. ఎక్కువ రేట్లకు కొనడంపై విమర్శలొస్తున్నాయి. ఒకే వస్తువును ఒక్కో కంపెనీ వద్ద వేర్వేరు రేట్లకు కొనుగోలు చేస్తుండడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. రాష్ట్రంలో మార్చి రెండున తొలి కేసు నమోదైంది. దీంతో సర్కారు.. పెద్ద ఎత్తున మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ గన్స్, పీపీఈ కిట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. సాధారణంగా సర్కారీ హాస్పిటళ్లకు అవసరమయ్యే మందులు, ఇతర వస్తువులన్నీ టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్‌‌సర్వీసెస్‌‌అండ్‌‌ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌) ద్వారానే కొనుగోలు చేస్తారు. గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. కానీ ఎమర్జెన్సీ టైం కావడంతో టెండర్లు లేకుండానే కొనుగోళ్లకు సర్కారు పర్మిషన్​ ఇచ్చింది. ఆ ప్రకారం మార్చిలో పెద్ద ఎత్తున మాస్కులు, శానిటైజర్లకు ఆర్డర్లు ఇచ్చారు.

ఒకే రోజు వేర్వేరు రేట్లు

50 వేల లీటర్ల ఆల్కాహాల్ బేస్డ్​ హ్యాండ్ శానిటైజర్‌‌‌‌సప్లై కోసం మార్చి 21న సెంచురీ ఫార్మా ల్యాబ్స్‌‌ప్రైవేటు లిమిటెడ్‌‌కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. ఒక్కో లీటర్‌‌‌‌కు రూ.392 చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజున నాన్జ్‌‌మెడిసైన్స్‌‌ఫార్మా ప్రైవేటు లిమిటెడ్‌‌అనే కంపెనీ నుంచి 50 వేల లీటర్ల శానిటైజర్‌‌, ది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్  లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మరో 50 వేల లీటర్ల శానిటైజర్‌‌ సప్లైకి ఆర్డర్‌‌‌‌చేశారు. ఈ కంపెనీలకు అర లీటర్‌‌(500 ఎంఎల్)‌‌కు రూ.224 చొప్పున చెల్లించేందుకు అగ్రిమెంట్​చేసుకున్నారు. అంటే లీటర్‌‌‌‌కు రూ.448 అవుతోంది. ఈ రెండు కంపెనీలకు కలిపి రూ.56 లక్షలు ఎక్కువగా చెల్లించారు.

మాస్కుల్లోనూ..

డాక్టర్లు వాడే ఎన్‌‌95 మాస్కులతో పాటు, త్రీ లేయర్ మాస్కులు భారీగా కొనుగోలు చేశారు. మార్చి 27న కన్వీజినీయస్‌‌ఎడు సొల్యూషన్ ప్రైవేటు లిమిటెడ్‌‌అనే కంపెనీకి 20 లక్షల త్రీలేయర్ మాస్కుల కోసం ఆర్డర్ చేశారు. ఒక్కో మాస్క్‌‌కు రూ.10 చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చి 20న రుద్రాన్ష్‌‌విజ్‌‌ఆగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌‌కంపెనీకి పది లక్షల త్రీ లేయర్ మాస్కులకు ఆర్డర్ ఇచ్చారు. వాళ్ల నుంచి రూ.16.8 రేటుతో కొన్నారు. అంటే ఒక్కో మాస్క్‌‌కు రూ.6.8 చొప్పున రూ. 68 లక్షలు అదనంగా చెల్లించారు. ఇక శరీర టెంపరేచర్​ను కొలిచే థర్మల్‌‌గన్స్‌‌ను మార్చి 21న ఓ కంపెనీ వద్ద రూ.14,750కి కొంటే.. మూడు రోజుల తర్వాత మరో కంపెనీ వద్ద రూ.9,794 రేటుకే కొనుగోలు చేశారు. అంటే ఒక్కో థర్మల్​ గన్‌‌కు రూ.4,956 అదనంగా వెచ్చించారు. ఎన్‌‌95 మాస్కులను ఓ కంపెనీ వద్ద రూ.155 కి ఒకటి కొంటే.. మరో కంపెనీ వద్ద రూ.210 కి, ఇంకో కంపెనీ వద్ద రూ. 308కి కొన్నారు. అయితే అత్యవసర పరిస్థితి, కొరత వల్లే ఒక్కో కంపెనీకి ఒక్కో ధర చెల్లించాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇస్తున్నారు.

ఉన్నత స్థాయి కమిటీ సూచనలతోనే..

శానిటైజర్లు, మాస్కులు, థర్మల్‌ గన్స్‌ఒక్కో కంపెనీ వద్ద ఒక్కో ధరకు కొనుగోలు చేసిన మాట వాస్తవమే. కానీ అందులో ఎక్కడా అవకతవకలు జరగలేదు. మార్చిలో ఆ వస్తువుల ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువగా ఉంది. కొరత ఏర్పడింది. అత్యవసరం కావడంతో సప్లై చేయడానికి ముందుకొచ్చినవారిలో తక్కువ ధరకు ఇచ్చినవాళ్ల దగ్గర కొనుగోలు చేశాం. ప్రభుత్వం వేసిన ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకే కొనుగోళ్లు జరిగాయి.

– చంద్రశేఖర్‌‌రెడ్డి, ఎండీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ

For More News..

షూటింగ్‌లలో 40 మంది దాటొద్దు

ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ చేసేవారికి నిరాశ

కరోనా దెబ్బకు జాడ లేకుండా పోయిన జాబులు

కరోనా టెన్షన్.. పుకార్లతో పరేషాన్

Latest Updates