ఎస్సీ, ఎస్టీ  ఫండ్​లో లెక్కల మాయ

క్యారీ ఫార్వర్డ్​ కానివ్వకుండా బడ్జెట్​లో జిమ్మిక్కులు

ఇరిగేషన్​, రోడ్లకూ ఇదే ముసుగు

హైదరాబాద్, వెలుగు: పేరు.. ఎస్సీ, ఎస్టీ స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్ (ఎస్డీఎఫ్​). దానిలోని మొత్తం డబ్బును ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పథకాల కోసం, ప్రత్యేక కార్యక్రమాల కోసం ఖర్చు చేయాల్సి ఉండగా.. అట్ల ఖర్చు చేస్తున్నది నామమాత్రమే. అన్నివర్గాలకు అమలు చేసే స్కీమ్​లనే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా అమలు చేస్తున్నట్టు చెబుతూ.. వాటికి కూడా ఎస్డీఎఫ్​ నుంచి ఖర్చు పెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం  లెక్కలు చూపిస్తోంది. ఆరేండ్ల రాష్ట్ర బడ్జెట్లను చూస్తే.. ఎస్డీఎఫ్​ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1.09 లక్షల కోట్లు కేటాయించగా, అందులో రూ. 59 వేల కోట్లు మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేరిట ఖర్చు చేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.  మిగతా రూ. 50వేల కోట్లకుపైగా నిధులు ఇతర పనులకు ప్రభుత్వం మళ్లించింది. ఇరిగేషన్​ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి పెట్టిన ఖర్చులను కూడా ఎస్డీఎఫ్​ ఖాతాలోనే చూపించింది.

క్యారీ ఫార్వర్డ్‌కు చిక్కకుండా

ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు 10 శాతం ఉన్నారు. జనాభా వాటాను అనుసరించి రాష్ట్ర బడ్జెట్​లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నారు. సబ్​ ప్లాన్​ ప్రకారం.. ఆ ఏడాదిలో ఖర్చు చేయలేకపోతే తర్వాత ఏడాదికి నిధులు క్యారీ ఫార్వర్డ్‌ చేయాలి. కానీ.. గడిచిన ఆరేండ్లలో ఒక్క ఏడాది కూడా ఈ నిధులు మిగిలిన దాఖలాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. క్వారీ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుందని నూటికి నూరు శాతం ఖర్చు చేసినట్లు చూపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.

కామన్​ స్కీముల్లో వాళ్లున్నారంటూ..!

ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక నిధిని ఆ వర్గాలకే నిర్దేశించిన స్కీమ్​లకు ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. కానీ, అందరికీ అమలవుతున్న  కామన్​ స్కీమ్​లనే చూపి.. అందులో ఎస్సీ, ఎస్టీల వాటా కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేస్తోంది.

‘రైతు బంధు, రైతు బీమా, ఆరోగ్య శ్రీ, కల్యాణలక్ష్మి, ఫ్రీ కరెంట్​, ఆసరా పెన్షన్లు.. ఇలా అన్నింటా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులున్నారు కదా! అందుకే వాళ్ల కోటా నుంచి ఖర్చు చేస్తున్నం’’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతి ఏడాది ఎస్సీ, ఎస్టీ  ఫండ్​ మానిటరింగ్​ కమిటీ మీటింగ్​లో చెబుతోంది.  ఎస్డీఎఫ్​ నిధులను ఏ ఏడాదికాయేడు సంపూర్ణంగా ఖర్చు చేసినట్లు చూపించేందుకు ప్రభుత్వం అన్ని స్కీమ్​లకు తమ నిధిని పంచి పెడుతోందని ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాటా నిధులన్నీ ఖర్చవుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించటం లేదని ఎస్సీ, ఎస్టీ సంఘాలు
మండిపడుతున్నాయి.

ఇరిగేషన్​, రోడ్లకూ ఎస్డీఎఫ్ నిధులే!

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న ఇరిగేషన్​ ప్రాజెక్టులకు కూడా ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్​ నుంచి రూ. 8,678 కోట్లు ఖర్చు చేసింది. రోడ్ల నిర్మాణం, డెవెలప్​మెంట్​కు మరో రూ.1,557 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించింది. ఈ రెండు పద్దులకు ఎస్సీ, ఎస్సీల ఫండ్​కు ఉన్న సంబంధమేమిటని, వాటికి ఈ ఫండ్​ నుంచి ఖర్చు పెట్టడం ఏమిటన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర పనుల నిధులన్నింటినీ ఇదే తీరుగా ప్రభుత్వం తమ కోటాలో చూపిస్తోందని ఎస్సీ, ఎస్టీ బడ్జెట్​ మానిటరింగ్​ కమిటీ సభ్యులు ఇటీవలే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుకు, చీఫ్​ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు. ఇతరత్రా పనులకు వెచ్చించే నిధుల కోసం ఎస్డీఎఫ్​ నుంచి మళ్లించొద్దని, అలా దారి మళ్లించిన నిధులను 2020-–21 బడ్జెట్ లో కేటాయించాలని కోరారు.

కాగితాలపైనే లెక్కలు దిద్దుడు

2014 నుంచి ఇప్పటివరకు అంటే ఆరేండ్ల కాలంలో ఎస్సీల అభివృద్ధికి ఎస్డీఎఫ్​ కింద  రూ. 69,479 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఎస్సీ డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో అలమయ్యే దళితులకు మూడెకరాల భూ పంపిణీ, స్వయం ఉపాధి, రెసిడెన్షియల్​ స్కూళ్లు, హాస్టళ్లు, ప్రీ మెట్రిక్​ స్కాలర్​షిప్స్, పోస్ట్ మెట్రిక్​ స్కాలర్​షిప్స్, ఓవర్​సీస్​ స్కీమ్​, ఫ్రీ పవర్, స్కిల్​ డెవలప్​మెంట్, అట్రాసిటీ పరిహారం వంటి స్కీమ్​లకు  రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది.  రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం కొత్తగా ఎస్సీ, ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ గురుకులాలు కొన్ని అదనంగా అందుబాటులోకి వచ్చాయి. వీటి కోసం ఖర్చు చేసిన నిధులను కూడా  స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం లెక్క గట్టింది. ఈ తీరుపై అధికార వర్గాల్లోనూ అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ, మైనార్టీలకు మాదిరిగానే ఎస్సీ, ఎస్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశారని, ఇందుకోసం చేసిన ఖర్చును  ప్రత్యేక ఫండ్  లెక్కల్లో చూపెట్టడమేందని  ఓ సీనియర్ ఆఫీసర్​ అన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసమే స్పెషల్​గా కేటాయించిన నిధులను ఆ వర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా ఇతర వాటికి డైవర్ట్ చేస్తున్నారంటూ ఆరు నెలలకోసారి జరిగే మానిటరింగ్​ కమిటీ సమావేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూసినా ఆరేండ్లలో ఎస్సీలకు స్పెషల్​గా కేటాయించిన రూ. 69,479 కోట్లల్లో వారి కోసం ఖర్చు చేసింది  రూ. 40,039 కోట్లయితే.. మిగతా 29,440 కోట్లను ఇతర పనులకు మళ్లించారు. కానీ అన్ని నిధులు ఖర్చయిపోయినట్లు ఏ ఏడాదికాఏడాది బడ్జెట్​ లెక్కల్లో చూపిస్తున్నారు.

3లక్షల మందిలో  6,414 మందికే భూ పంపిణీ

దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకానికి బ్రేకులు పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నవంబర్​ చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 350 మందికి మాత్రమే భూ పంపిణీ  చేశారు. భూమి లేని దళిత కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూమిని ఉచితంగా పంపిణీ చేసే ఈ స్కీమ్​కు.. అధిక ఖర్చు అవుతోందనే ప్రభుత్వం పక్కనపెట్టింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ పథకంపై హడావుడి చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది దళితులు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదటి ఏడాది పథకం అమలుపై ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఆ తర్వాత అనేక కారణాలతో దృష్టి మళ్లించింది. అందుబాటులో ప్రభుత్వ భూములు లేవని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడానికి అధిక ఖర్చవుతోందని చెబుతూ వస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు భూ పంపిణీ కోసం రూ. 633 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దీంతో 16,182 ఎకరాలను 6,414 మందికి పంపిణీ చేశారు.

ఎస్టీలకు ప్రత్యేక పథకమే లేదు

రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఎస్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పథకమేదీ అమలు చేయలేదు. ఐటీడీఏలకు ఇచ్చే నిధులు, ఎస్టీ హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్, ప్రీ మెట్రిక్​ స్కూల్స్​, పోస్ట్ మెట్రిక్ స్కూల్స్ ను ఈ కోటాలో చూపిస్తోంది. మేడారం జాతర మొదలు కేసీఆర్ కిట్స్, ఆరోగ్య శ్రీ,104 సర్వీస్ లాంటి ఇతర సాధారణ పథకాలను ఎస్టీ డెవలప్​మెంట్​ ఫండ్ కింద చూపించింది. మేడారం జాతరకు 200 కోట్లు ప్రకటించి చివరికి 75 కోట్లతో హడావుడిగా పనులు చేయించారు. అయినా జాతర టైంలో ఎక్సైజ్, ట్రాన్స్​పోర్టు ఇతర రూపాల్లో ప్రభుత్వానికే మంచి ఆదాయం వచ్చింది.

ఖర్చు చేయకపోవడం సరికాదు: మంత్రి సత్యవతి

ఎస్టీ నిధులను ఖర్చు చేయకపోవడంపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మరో నెల రోజుల సమయం ఉన్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. నాలుగురోజుల క్రితం మంత్రి ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల ఖర్చుపై వివిధ శాఖల అధికారులతో రివ్యూ జరిపారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్చి చివరి నాటికి ఎస్టీ స్పెషల్​ ఫండ్​ కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయాలని ఆదేశించారు.

మానిటరింగ్ లేదు: ఎస్సీ ఆఫీసర్లు

ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్ కింద జరిగే ఖర్చుపై మానిటరింగ్ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వంలోని ఎస్సీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎస్​డీఎఫ్​ అమలుపై వారు ప్రభుత్వానికి ఓ రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. నిధులను దారి మళ్లించొద్దని, నోడల్ ఏజెన్సీని బలోపేతం చేయాలని, పథకాల తయారీ– అమలు కోసం ఎస్సీ, ఎస్టీ శాఖలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని, మానిటరింగ్​ కమిటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్జీవోలకు చోటు కల్పించాలని ఆ రిపోర్టులో సూచించారు.

Latest Updates