భారీ మోసం: ఇండ్లు కట్టిస్తామని రూ.8 కోట్లు కొట్టేశారు

తక్కువ డబ్బులతో ఇల్లు కట్టిస్తామంటూ పేదల నుంచి రూ. కోట్లలో వసూలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జోన్​ డీసీసీ నారాయణరెడ్డి శనివారం భువనగిరిలోని డీసీపీ క్యాంప్​ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్​మీర్​పేట్​కు చెందిన భార్యభర్తలు కొండ కృష్ణమ్మ, కొండ రమేష్​, కర్మన్​ఘాట్​కు చెందిన కట్టా మహేంద్రనాథ్, ఖమ్మం జిల్లా కూసుమంచి జిల్లచెరువుకు చెందిన కొండ వెంకటనారాయణ, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన కొత్త రాజిరెడ్డి, జడ్చర్లకు చెందిన జాజర్ల సాయిచరణ్​కలిసి ‘మళ్యావి కరుణోదయ సొసైటీ ఫర్​ పీపుల్​ ఆఫ్​ ఓల్డ్​ఏజ్​అండ్​ ఫిజికల్లీ హ్యాండిక్యాప్​డ్’​ సంస్థను 2004లో హైదరాబాద్​ కర్మన్​ఘాట్​ కేంద్రంగా ఏర్పాటు చేశారు.  2018లో కృష్ణమ్మ, రమేష్​ మిగతా సభ్యులతో కలిసి పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి వారి నుంచి డబ్బులు లాగడానికి ప్లాన్​వేశారు. దీని కోసం యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. ప్రజలను నమ్మించడానికి ముందుగా ఆయా గ్రామాల్లోని కొంతమంది యువకులను కోఆర్డినేటర్స్ గా జీతానికి పెట్టుకున్నారు. వీరి సంస్థలో ఇండ్లు కట్టుకుంటే ఎలా ఉంటుందనే బ్రోచర్లను ఆకర్షణీయంగా తయారుచేశారు. మూడు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఇండ్లు లేనివారు, పేద ప్రజలకు బ్రోచర్​చూపించి ఇళ్ల గురించి వారికి వివరించేవాళ్లు.

ముందు రూ. 30 వేలివ్వండి…

తమ సంస్థ ద్వారా ఇండ్లు లేనివారికి, నిరుపేదలకు రూ. 7.50 లక్షలతో ఇండ్లు కట్టిస్తామని, దీనికోసం మొదట రూ. 30 వేలు చెల్లించాలని, పూర్తయిన తరువాత మరో రూ.2.20 లక్షలు ఇవ్వాలని ప్రజలను నమ్మించారు. మిగతా రూ. 5 లక్షలు ఎన్ఆర్ఐ ఫండ్స్​ ద్వారా లేదా ఐరన్​, సిమెంట్​ ఇతరత్రా కంపెనీలు దాతలాగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు నమ్మించారు. ఇలా మొదట కొద్దిమంది దగ్గర రూ. 30 వేల చొప్పున వసూలు చేసి వారు నమ్మే విధంగా ఇంటి పని ప్రారంభించారు. తీసుకున్న నగదుకు రిసీప్ట్​కూడా ఇచ్చేవారు. ఇలా మొదలుపెట్టిన ఇండ్ల ఫోటోలు, వీడియోలు తీసుకుని చాలామంది దగ్గరకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. సుమారు మూడు జిల్లాల్లో కలిపి 2700 మంది వరకు బాధితులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆరు నెలల్లో ఇల్లు పూర్తి చేస్తామంటూ ఇలా అందరి దగ్గర రూ. 30 వేలు తీసుకున్నారు. ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఆలేరు మండలం టంగుటూరు, కొలనుపాక, యాదగిరిగుట్ట మండలం కాచారం, రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామాల్లో కొన్ని ఇండ్లను కట్టించారు. మోటకొండూరు మండలంలో కొన్ని ఇండ్లకు మెటీరియల్​పంపించారు.

మహిళ ఫిర్యాదుతో…

ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన వడ్డేపల్లి విజయ వద్ద ఆరు నెలల క్రితం ఇల్లు కట్టిస్తామని రూ. 30 వేలు వసూలు చేశారు. ఆరు నెలలు దాటుతున్నా ఎంతకూ ఇంటి నిర్మాణం ప్రారంభించకపోవడంతో విజయం 2019 మార్చిలో ఆలేరు పోలీస్​స్టేషన్​లో ఈ సంస్థపై ఫిర్యాదు చేసింది. కేసు గురించి ఆరా తీసిన పై ఆఫీసర్లు రంగంలోకి ఎస్వోటీ పోలీసులను దింపారు. యాదగిరిగుట్ట ఏసీపీ మనోహర్​రెడ్డి, ఎస్వోటీ పోలీసులు అప్పటినుంచి సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. వీరు ఇప్పటివరకు చేసిన మోసాలు అన్నింటిని రికార్డు చేసి వీరిని నిందితులుగా నిర్ధారించుకున్నారు. శనివారం వీరంతా కర్మన్​ఘాట్​లోని కార్యాలయంలో ఉండగా అదుపులోకి
తీసుకున్నారు.

పరారీలో ఇద్దరు…

ఇండ్లు కట్టిస్తామని చెప్పి ప్రజల నుంచి రూ. 8.01 కోట్ల వరకు వీరు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ. 12,22,000 నగదు, రెండు ల్యాప్​టాప్స్​, మూడు మొబైల్​ ఫోన్స్​, 8 బిల్​బుక్స్, 29 క్యాష్​ రిసీప్ట్స్, మళ్యావి కరుణోదయ సొసైటీ లెటర్​హెడ్స్, అప్లికేషన్​ఫామ్స్, సొసైటీ స్టాంపులు, బ్రోచర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఇందులో సొసైటీ ఎండీ కొండ కృష్ణమ్మ, జనరల్​ సెక్రటరీ కొండ రమేష్​, వైస్​ ప్రెసిడెంట్​ కొండ వెంకటనారాయణ, మేనేజర్​ కట్టా మహేంద్రనాథ్​ను అదుపులోకి తీసుకోగా సొసైటీ కో ఆర్డినేటర్​ కొత్త రాజిరెడ్డి, అడ్మిన్​ మేనేజర్​ జాజర్ల సాయిచరణ్​పరారీలో ఉన్నారు. కృష్ణమ్మ గతంలో కుట్టుమిషన్లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్​లో పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. వీరి ద్వారా మోసపోయిన బాధితులు సంబంధిత పత్రాలను తీసుకువచ్చి న్యాయస్థానం ద్వారా నగదు పొందవచ్చునని డీసీపీ తెలిపారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సమావేశంలో ఎస్వోటీ అడిషనల్​డీసీపీ సురేందర్​రెడ్డి, యాదాద్రి ఏసీపీ మనోహర్​రెడ్డి, ఎస్వోటీ సీఐ రాజువర్మ, ఎస్సై లక్ష్మీనారాయణ , యాదగిరిగుట్ట రూరల్​ సీఐ ఆంజనేయులు, ఆలేరు ఎస్సై వెంకట్​రెడ్డి పాల్గొన్నారు.

Latest Updates