ఇయర్ ఫోన్స్ కొంటే.. కారు గెలిచారని ఫోన్

రూ.69 వేలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
పోలీసులకు మహిళ ఫిర్యాదు

హైదరాబాద్ , వెలుగు: ఇయర్ ఫోన్స్ కొన్నందుకు కార్ గెలుచుకున్నారంటూ ఓ మహిళ వద్ద రూ.69 వేలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఆమె మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసు వివరాలను సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ వెల్లడించారు. సికింద్రాబాద్ తుకారాం గేట్‌కు చెందిన సుధ అనే మహిళ షాప్ క్లూస్‌లో ఈ నెల 2న రూ.500 పెట్టి ఇయర్ ఫోన్స్‌ను ఆర్డర్ చేశారు. 4వ తేదీన షాప్ క్లూస్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఆమెకు కేటుగాళ్లు ఫోన్ చేశారు. ఇయర్ ఫోన్స్ కొన్న వివరాలను చెప్పారు. రెండు రోజుల పాటు ఆమెకు ఫోన్ చేసిన సైబర్ చోర్‌లు.. రూ.12.6 లక్షల విలువైన కారు గెలుచుకున్నారంటూ ఆమెను నమ్మించారు. కారు కావాలంటే కారు, లేదంటే డబ్బు డిపాజిట్ చేస్తామన్నారు. కారుగానీ, డబ్బు గానీ రావాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.7,500 చెల్లించాలని ఆమెకు చెప్పారు. రెండు బ్యాంక్ అకౌంట్లను ఆమెకు ఇచ్చారు. దీంతో సుధ ఆ డబ్బును డిపాజిట్ చేశారు. తర్వాత జీఎస్టీ, ఆర్టీవో, ఇన్సూరెన్స్ పేరిట మొత్తంగా రూ.68,900 ఆమె నుంచి దొంగలు దోచేశారు. తర్వాత ఫోన్‌ను స్విచాఫ్ చేశారు. మళ్లీ ఆ నంబర్లకు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో మోసపోయానని సుధ గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కెవీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ వెంకట రామిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేటుగాళ్లు కాల్ చేసిన ఫోన్ నంబర్లతో పాటు బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఆ బ్యాంక్ అకౌంట్లు కోల్‌కతాకు చెందినవిగా తేల్చారు. ఇలాంటి ఫోన్ కాల్స్‌పట్ల జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా లేకపోతే మోసపోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల అకౌంట్‌లు బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని, వాళ్లను వెంటనే పట్టుకోవచ్చని చెప్పారు.

For More News..

ఈసారైనా ఫీజులు తగ్గేనా?

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

కేటీఆర్ క్లాస్ తీసుకోలేదు: ఎమ్మెల్యే హరిప్రియ

Latest Updates