రైస్ పుల్లింగ్ మెషీన్ తో మోసం

fraud-with-rice-pulling-machine

రైస్ పుల్లింగ్ మెషీన్ తో డబ్బులు వస్తాయని చెప్పి ఓ వ్యక్తి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాకు చెందిన సభ్యుడిని గచ్చిబౌలి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఏసీపీ శ్యాంప్రసాద్ రావుతో కలిసి రైస్ పుల్లింగ్ ముఠా వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని వెస్ట్ ముంబైలో ఉన్న బాంద్రా ప్రాంతానికి చెందిన జితేశ్​ సోలంకి స్థానికంగా వ్యాపారం చేస్తుంటాడు. జితేశ్​బాంద్రా ప్రాంతానికి చెందిన సమీర్ రాయ్ అనే వ్యక్తికి రూ.10లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులను అడిగేందుకు ఈ ఏడాది జనవరి 7న జితేశ్..సమీర్ దగ్గరికి వెళ్లాడు. ప్రస్తుతం తాను ఓ పెద్ద డీల్ చేపడుతున్నానని..అది పూర్తయితే రూ.300 కోట్లు వస్తాయని ఫిబ్రవరి లోగా నీ డబ్బులు నీకిచ్చేస్తానని సమీర్..జితేశ్​తో చెప్పాడు. దీంతో జితేశ్ ఆ డీల్ వివరాల గురించి సమీర్ ను అడిగాడు. తనకు కలకత్తా ప్రాంతానికి చెందిన రాజ్ ఖాన్ అనే వ్యక్తి తెలుసని..అతడి దగ్గర రైస్ పుల్లింగ్ మెషీన్ ఉందని సమీర్ చెప్పాడు. ఈ మెషీన్ తో తయారు చేసే ప్రొడక్ట్ న అమ్మితే మనకు కోట్ల రూపాయలు వస్తాయన్నాడు.

ఏపీలోని వైజాగ్ లో మాధవదర కలింగనగర్ కు చెందిన సింగంపల్లి వాసు(35) అనే సైంటిస్ట్ రైస్ పుల్లింగ్ మెషీన్ ను  సర్టిఫైడ్  చేస్తున్నాడని..ఈ మెషీన్ ను రొసారం అనే కంపెనీకి అప్పగిస్తే డబ్బులు వస్తాయని జితేశ్​తో సమీర్ చెప్పి అతడిని నమ్మించాడు. అయితే ఈ రైస్ పుల్లింగ్ మెషీన్ రిపేర్లు, టెస్టింగ్ కోసం రూ.3కోట్ల26లక్షల26వేలు ఖర్చువుతుందని సింగం పల్లి వాసు, రాజ్​ఖాన్ తనతో చెప్పారని సమీర్..జితేశ్​కు తెలిపాడు. దీంతో ఇందులో తాను కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తానని సమీర్ తో  జితేశ్​అన్నాడు. డబ్బులు ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనే దానిపై మాట్లాడుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న గోవా రాజధాని పనాజీలోని వివంతా హోటల్ లో జితేశ్, సమీర్, వాసు, రాజ్​ఖాన్ సమావేశమయ్యారు. రైస్ పుల్లింగ్ మెషీన్ రిపేర్ల కోసం రూ.కోటి63లక్షల30వేలు ఇన్వెస్ట్ చేస్తానని వాసు చెప్పగా..తాను రూ.కోటి10లక్షలు పెడతానని రాజ్ ఖాన్ తెలిపాడు. తాను రూ.52లక్షల30వేలు ఇన్వెస్ట్ చేస్తానని జితేశ్​ఒప్పుకున్నాడు.

జితేశ్​నుంచి డబ్బులు తీసుకుని ముగ్గురం కలిసి పంచుకుందామని సమీర్, వాసు, రాజ్​ఖాన్ స్కెచ్ వేశారు. జితేశ్​తాను ఒప్పుకున్న డబ్బులను ఇచ్చేందుకు ఈ నెల1న గచ్చిబౌలిలోని ఆదిత్య రెసిడెన్సీలో సమావేశమై రూ.32లక్షలను రాజ్ ఖాన్ సమక్షంలో వాసుకు అప్పగించాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత తనకు రైస్ పుల్లింగ్ మెషీన్ ను చూపెట్టాలని జితేశ్..సమీర్ ను అడగడం మొదలుపెట్టాడు. మెషీన్ ఎప్పుడు వస్తుంది..డబ్బులు ఎప్పుడొస్తాయని జితేశ్ ప్రశ్నించడంతో రాజ్ ఖాన్ సరైన సమాధానం ఇవ్వలేదు. వీరిపై అనుమానం వచ్చిన జితేశ్​ ఈ నెల 6న గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రైస్ పుల్లింగ్ కేసులో ప్రధాన నిందితుడు వాసును గచ్చిబౌలి పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇతడి దగ్గరి నుంచి రూ.18లక్షలు, ఓ ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు రాజ్ ఖాన్, సమీర్ ను తొందరలోనే పట్టుకుంటామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కేసు చేధనలో ముఖ్య పాత్ర పోషించిన డీఐ సత్యనారాయణ, ఇన్ స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్, సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Latest Updates