ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఫ్రీగా బైక్ సర్వీస్

ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఫ్రీగా బైక్ సర్వీస్
  • ప్రైవేటు స్కూల్ టీచర్లకు ఇది నావంతు సహాయం అంటున్న శ్రీపతి కుమార్
  • గ్యారేజీ ముందు బోర్డు పెట్టి మరీ సర్వీస్ చేస్తున్న శ్రీపతి కుమార్

‘‘ఇచ్చట ప్రైవేటు టీచర్ల బైక్‌‌లకు ఉచితంగా సర్వీసింగ్ చేయబడును’’ అని బోర్డు పెట్టి  ప్రైవేట్‌‌ టీచర్ల బైక్‌‌లకు ఫ్రీగా సర్వీసింగ్ చేస్తున్నాడు ఒక మెకానిక్‌‌. కరోనా తగ్గి మామూలు పరిస్థితులు వచ్చేవరకు వాళ్లకు చేతనైన సాయం చేస్తానంటున్నాడు. 

గుర్రం శ్రీపతి కుమార్ గౌడ్‌‌ది సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్. ఆయన ఎల్లారెడ్డిపేటలో  ఏడాదిగా ‘స్మార్ట్ ఆటో మొబైల్ సర్వీసింగ్ సెంటర్’ నడుపుతున్నాడు. కొన్నాళ్ల నుంచి ప్రైవేట్‌‌ స్కూల్‌‌ టీచర్లు పడుతున్న ఇబ్బందులను  చూసి చలించిపోయాడు. తనవంతు సాయంగా ఏదైనా చేయాలనుకున్నాడు. తను చేయగలిగిందేమైనా ఉందా? అని ఆలోచించాడు. చివరకు ఇలా ప్రైవేట్‌‌ టీచర్ల బైక్‌‌లకు ఫ్రీగా సర్వీసింగ్‌‌ చేయడం  మొదలుపెట్టాడు. ‘సంవత్సరం నుంచి ప్రైవేటు బడి పంతుళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వాళ్ల పాలిట శాపంగా మారింది. చాలామంది ప్రైవేటు టీచర్లు రోడ్డున పడ్డారు. ఇన్నాళ్లు గౌరవంగా బతికి ఇప్పుడు పనిలేక, దొరికిన చిన్నా చితక పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటున్నాడు శ్రీపతి కుమార్. 
500 వరకు ఉచితం 
ఉచితంగా సర్వీసింగ్ చేస్తామని షాప్‌‌ ముందు ఒక బోర్డు కూడా పెట్టాడు కుమార్‌‌‌‌. ఆ బోర్డును చూసి చాలామంది ఆయన షాప్‌‌కు వస్తున్నారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అవుతోంది. నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రైవేటు టీచర్ల బైక్‌‌ సర్వీసింగ్‌‌కు 500 రూపాయల బిల్లు వరకు ఫ్రీగా చేస్తున్నాడు. అంతకంటే దాటితే మాత్రం బిల్లు వసూలు చేస్తాడు. సర్వీసింగ్‌‌తో పాటు స్పేర్ పార్ట్స్ అవసరమున్నా ఫ్రీగానే ఇస్తున్నాడు. కరోనా ఉన్నన్ని రోజులు ఈ  స్కీమ్‌‌ ఉంచుతానని చెప్తున్నాడు కుమార్‌‌‌‌.
భరోసా అనిపిస్తుంది
ఇంతకుముందు ప్రైవేట్‌‌ స్కూల్‌‌లో టీచింగ్‌‌ చేసేవాడిని. కొవిడ్ వల్ల సంవత్సర కాలంగా ఖాళీగా ఉంటున్నా. దాంతో బతుకు భారమయ్యింది. కుమార్‌‌‌‌ లాంటి వాళ్లు మాకు సాయం చేసినప్పుడు భరోసా ఇచ్చినట్టు అనిపిస్తుంది. కుమార్‌‌‌‌ దగ్గర బైక్ సర్వీసింగ్ చేయించుకున్నా. నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. -మల్యాల బాబు, ప్రైవేటు టీచర్

చలించిపోయా...
ప్రైవేటు టీచర్ల పరిస్థితి చూసి చలించిపోయా. వాళ్ల బైక్‌‌లకు ఫ్రీగా సర్వీసింగ్‌‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సర్వీస్ మొదలుపెట్టినప్పటి నుంచి నన్ను చాలామంది మెచ్చుకున్నారు. అందుకే మరింత ఉత్సాహంతో పని చేస్తున్నా. మూడు రోజుల నుంచి దాదాపు 20 బైక్‌‌లకు ఫ్రీ సర్వీసింగ్ చేశా. రానున్న రోజుల్లో ఇలాంటి సేవలు మరిన్ని చేస్తా. - శ్రీపతి కుమార్ గౌడ్‌‌.