అందం పేరిట లక్షల్లో దోపిడి

హైదరాబాద్, వెలుగుఆకట్టుకునే శారీరక ఆకృతి, అందరిలో తళుక్కుమనేలా మారాలనుకుంటున్నారా? బట్టతల, తెల్ల వెంట్రుకలు వంటి ఎన్నో రుగ్మతలకు దూరంగా ఉండాలని చూస్తున్నారా? అయితే దగ్గర్లో ఉన్న ఫలానా సెంటర్లో సంప్రదించండి. తక్కువ ఖర్చు, సౌకర్యవంతంగా బరువు తగ్గించుకోవడమే కాదు, నాజూకైన శరీర ఆకృతిని సొంతం చేసుకోవచ్చంటూ వచ్చే ప్రకటనలను చూస్తూనే ఉంటాం. కానీ కాస్మోటిక్, వెయిట్ లాస్ పేరిట నగరంలో బిజినెస్​చేస్తున్న హాస్పిటళ్లపై ఆదాయ పన్నుశాఖ ఫోకస్​చేసింది. బ్యూటీ పేరిట వేలల్లో దోచేస్తున్నట్లు బయటపడినట్లు సమాచారం.

అందం, ఆరోగ్యానికి సిటీ జనాలు ప్రాధాన్యం ఇస్తున్నారు. సంపాదించే మొత్తంలో అధిక భాగం వీటికే ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా హైప్రొఫైల్ లైఫ్ స్టయిల్, సంపన్నులు, సెలబ్రిటీలు మాత్రమే ఈ తరహా వైద్యానికి ఆసక్తి చూపువారు. కానీ మారిన జీవన శైలికి అనుగుణంగా అందం, ఆరోగ్యంతోపాటు ఎలాంటి రుగ్మతలు లేని జీవితాన్ని గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. జనాల బలహీనతలు బ్యూటీ, వెల్ నెస్ సెంటర్లుకు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.  అందినకాడికి దోచుకొంటూ వినియోగదారుల జేబుకు చిల్లుపెట్టే కంపెనీలు, సంస్థలు, సెంటర్లు సిటీలో వందల సంఖ్యలో పెరిగి పోతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖల అనుమతులే కాకుండా మినిస్ట్రీ ఆఫ్​ కార్పొరేట్ అఫైర్స్ గుర్తింపు ఉందని, అంతర్జాతీయ ప్రమాణాలతో బరువు తగ్గించడం, బట్టతల రాకుండా చేయడం, యాంటీ ఏజింగ్, చర్మ సంబంధిత సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతామంటూ ఊదరగొట్టే ప్రచారాలతో బాధితులను ఆకర్షిస్తున్నాయి.

ఆపేయ్యలే.. చేయించుకోలేక

వినియోగదారులను ఆకర్షించేందుకు తొలుత ఉచిత కన్సల్టేషన్ అనే గాలాన్ని విసురుతాయి. ఒకసారి బాధితుడు చిక్కాడనుకో.. ఇక బరువు తగ్గడం దేవుడెరుగు, పర్సు పలచన కావడం తథ్యం. ఇందులోనూ సర్జరీ లేని చికిత్సలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటూనే అనుకున్న దానికంటే ఎక్కువ బరువు తగ్గడం, స్కీన్ టోన్ పెంచుకోవడం, బట్టతలపై వెంట్రుకలు వచ్చేలా ట్రీట్ మెంట్ చేస్తామంటూ ఆకర్షిస్తాయి. ఒకసారి ఆయా సంస్థల్లో జాయిన్ కాగానే విడతల వారీగా ట్రీట్​మెంట్ ఉంటుందని, ఆర్గానిక్ ట్రీట్ మెంట్, సర్జరీ లెస్ వంటి సదుపాయాలను కల్పిస్తామని చెప్పగానే దాచుకున్న మొత్తాన్ని ఖర్చు చేసేవారు నగరంలో వేలల్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.

రూ.25వేల నుంచి మొదలు

సాధారణం కంటే బరువు పెరిగినవారు ఎక్కువే ఉంటారు. ఇలాంటి వారు ఆయా సంస్థలకు చిక్కితే అధిక బరువుతో బాధపడేవారి నుంచి కనీసం రూ.25వేల నుంచి దాదాపు రూ.1.5లక్షన్నర వరకు వసూలు చేస్తున్నాయి. అదనంగా ప్యాకేజీలు, ఆర్గానిక్ ట్రీట్ మెంట్ వంటి ఆధునిక సౌకర్యాల పేరిట పిండేస్తున్నాయి. దీంతో ట్రీట్ మెంట్ ను మధ్యలోనే ఆపేయలేక, పూర్తిస్థాయిలో చేయించుకోలేక ఆర్థిక భారాన్ని భరించలేని ఎంతో మంది సతమతం అవుతున్నారు. దీంతోపాటు స్కిన్ కేర్, హెయిర్ కేర్ కోసం లక్షల్లో చార్జీలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు స్వయంగా ఫుడ్ ప్రోడక్టులను తయారు చేసి బాధితులకు కట్టబెడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని విదేశీ ప్రోడక్టులను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుని, ఇక్కడి వారికి ట్రీట్ మెంట్ రూపంలో అందజేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కలర్స్ సంస్థపై ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా 49 బ్రాంచులు, 10 లక్షల కస్టమర్లు

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కలర్స్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థపై బుధవారం జరిగిన ఆదాయపన్ను దాడులతో ఈ తరహా వ్యాపారం చేసే కంపెనీలు ఏ స్థాయిలో లాభాలు ఆర్జిస్తున్నాయో తెలుస్తోంది. చిన్న సంస్థగా మొదలై దాదాపు 10లక్షల కస్టమర్లు, 49 బ్రాంచులుగా కలర్స్ హెల్త్ కేర్ బ్యూటీ సంస్థ విస్తరించింది. తాజాగా కలర్స్ ఫుడ్ ప్రొడక్టులను విక్రయిస్తోంది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న బ్రాంచ్​లో బరువు తగ్గేందుకు చికిత్స పొందిన ఓ మహిళ నుంచి రూ.70వేల వసూలు చేయగా… ప్రకటించిన గడువులోగా ఏమాత్రం బరువు తగ్గకపోవడంతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన కోర్టు రూ.2లక్షల జరిమానాతోపాటు చికిత్స పేరిట ఆమెను మోసగించినందుకు రూ.70వేల ఫీజుకు అదనంగా 9% చెల్లించాలని తీర్పునిచ్చింది.

Latest Updates