ప్రైవేటు డయాగ్నస్టిక్​ సెంటర్ల లోనూ ఉచిత వైద్య పరీక్షలు

  • డయాగ్నస్టిక్​ సెంటర్లతో ప్రభుత్వ చర్చలు

సర్కారు దవాఖానలకు రోగుల తాకిడి పెరగడం, వైద్య పరీక్షలకు గంటలకొద్దీ సమయం పడుతుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయం కోసం ఆలోచన చేస్తోంది. ప్రైవేటు డయాగ్నస్టిక్​ సెంటర్ల యాజమాన్యాలతో మాట్లాడి వీలైతే ఉచితంగా లేదంటే నామమాత్రపు చార్జీలకు సేవలు అందించాల్సిందిగా కోరనున్నట్లు సమాచారం. ఈమేరకు మంగళవారం అధికారులతో జరిపిన చర్చలో మంత్రి ఈటల ఈ విషయాన్ని ప్రస్తావించారు. సేవా సంస్థలకు చెందిన డయాగ్నస్టిక్​ సెంటర్ల సాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే బోధనాసుపత్రులు, ఫీవర్​హాస్పిటల్, ఐపీఎం సెంటర్లలో రోగులకు ఉచితంగా డెంగీ పరీక్ష చేస్తున్నారు. ఈ సీజన్​లో వ్యాధులు విజృంభిస్తుండడంతో సర్కారు ఆస్పత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ సీజనల్‌‌‌‌ ఇప్పటివరకూ 2600 మంది డెంగీ, 1100 మంది మలేరియా, 350 చికెన్ గున్యా బారిన పడగా, లక్షల మంది వైరల్ ఫీవర్‌‌‌‌తో ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రైవేటు దోపిడి తట్టుకోలేక, సర్కారు దవాఖాన్లకు వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది.‌‌‌‌ రోగుల తాకిడి నేపథ్యంలో దవాఖాన్ల ఆవరణల్లోనే ప్రైవేటు డయాగ్నస్టిక్‌‌‌‌ సెంటర్ల కౌంటర్లు ఏర్పాటుచేసి వారి సేవలను ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ డయాగ్నస్టిక్‌‌‌‌ సెంటర్లతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం.

Latest Updates