వ‌చ్చే ఏడాది జూన్ వ‌రకు పేద‌ల‌కు ఉచిత రేష‌న్: మ‌మ‌త‌

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం శ్ర‌మిస్తోంద‌ని చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ‌. సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆమె కోరారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్నింగ్ వాకింగ్ చేసుకునేందుకు ఉద‌యం 5.30 నుంచి 8.30 వ‌ర‌కు అనుమతి ఇస్తున్నామ‌న్నారు. ఈ స‌మ‌యంలో సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని సూచించారు. అలాగే పెళ్లిళ్లు, అంత్య‌క్రియ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 25 మందికి మాత్ర‌మే ఉన్న అనుమ‌తిని 50కి పెంచుతున్న‌ట్లు చెప్పారు. మంగ‌ళ‌వారం ఆమె కోల్‌క‌తాలో మీడియాతో మాట్లాడారు. క‌రోనా నేప‌థ్యంలో పేద‌ల‌ను ఆదుకునేందుకు 2021 జూన్ వ‌ర‌కు రాష్ట్రంలో ఉచిత రేష‌న్ పంపిణీ కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. అయితే అంతర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై జూలై 15 వ‌ర‌కు నిలిపేసినట్లుగానే, దేశంలోనూ డొమెస్టిక్ స‌ర్వీసుల‌పైనా ఆంక్ష‌లు పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు మ‌మ‌తా బెన‌ర్జీ. క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల నుంచి విమానాల‌ను న‌డ‌ప‌క‌పోవ‌డం మేల‌ని అన్నారు. అయితే సిటీల్లో ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసుల కోసం మెట్రో ట్రైన్ స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరారు. విమాన‌, మెట్రో స‌ర్వీసుల గురించి కేంద్ర హోం కార్య‌ద‌ర్శ‌కి త‌మ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేఖ రాసిన‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు.