వేద గణితంపై ఉచిత నేషనల్ సెమినార్: చుక్కా రామయ్య

భవిష్యత్తులో వేద గణితానికి ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణితం పట్ల పిల్లలు,  యువతలో  పెరుగుతున్న భయాన్ని, ఆందోళనను పోగొట్టాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. ఇందు కోసం ఈనెల 13,14,15 తేదీల్లో    వేద గణితంపై ఉచిత నేషనల్ సెమినార్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  వేద గణిత పద్ధతుల ద్వారా వారికి గణితం అర్థమయ్యేలా చేయడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. గణితాన్ని సరైన పద్ధతిలో నేర్పించడానికి,  ప్రతి విద్యాలయంలో మంచి మార్కులు సాధించే దిశగా శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్ కు చెందిన కొందరు వేదగణిత మేధావులు వేదిక్ మాథ్స్ ఫోరం ఆఫ్ తెలంగాణ స్థాపించారని ఆయన వివరించారు.  ఈ ట్రస్టు ద్వారా ఎంతో మంది పిల్లలకు, యువతకు వేద గణితంపై శిక్షణ ఇచ్చి, వారిని గణిత మేధావులుగా తీర్చిదిద్దాలని సూచించారు.

వేదిక్ మ్యాథ్స్ ఫోరమ్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేత బి సాయి కిరణ్ మాట్లాడుతూ ఈ నెల 13,14,15 తేదీలలో సాయంత్రం అయిదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చిక్కడపల్లి   శ్రీ త్యాగరాయ గాన సభలో వేద గణితంలో ఉచిత నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లితండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441155774 సంప్రదించాలని కోరారు. సమావేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కపు వెంకట రమణ, సీతారామయ్య, వేద గణిత చరణ్, మహమ్మొద్ అజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates