అల్​ఖైదా చీఫ్​ అబ్దెల్ మాలిక్ హతం

ప్యారిస్(ఫ్రాన్స్): టెర్రరిస్ట్ గ్రూప్ అల్​ఖైదాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నార్త్ ఆఫ్రికా అల్​ ఖైదా చీఫ్​ అబ్దెల్ మాలిక్ డ్రౌక్ డెల్ ను ఫ్రెంచ్ బలగాలు మట్టుబెట్టాయి. గురువారం ఫ్రాన్స్ దేశంలోని ఉత్తర మాలిలోని అల్జీరియన్ పర్వతాల్లో దాక్కున్న మాలిక్ డ్రౌక్‌డెల్ ను సెక్యూరిటీ హతమార్చిందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ప్రకటించారు. మాలిక్ కు చెందిన అనుచరులు కూడా మరణించారని ఆమె శనివారం మీడియాకు వెల్లడించారు. మే 19 న చేపట్టిన మరో ఆపరేషన్ లో ప్రముఖ జిహాదిస్ట్ అల్​ ఖైదా కేడర్ కమాండర్ మహమ్మద్ ఎల్ మ్రాబాత్ ను ఫ్రెంచ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు.

1971 లో నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అల్జీరియాలో జన్మించిన అబ్దెల్ మాలిక్ ఉత్తరమాలి, నైజర్, మౌరిటానియా, అల్జీరియా ప్రాంతాల్లో టెర్రరిస్టు కార్యకలాపాలు సాగించాడు. ఇస్లామిక్ మాగ్రెబ్ లోని అల్-ఖైదా గ్రూప్​ను 1990 ల చివరలో అల్జీరియన్ ఇస్లాంవాదులు ప్రారంభించారు. దానికి అనుబంధంగా అల్జీరియాలో సలాఫిస్ట్ గ్రూప్ ఫర్ ప్రీచింగ్ అండ్ కంబాట్ (జీఎస్​పీసీ) టెర్రరిస్ట్ గ్రూప్ ను మాలిక్ స్థాపించాడు. 2006లో అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌తోనూ సంబంధాలు పెట్టుకుని.. ఆ మరుసటి ఏడాది తన గ్రూపును అల్​ఖైదా ఇస్లామిక్ మాగ్రెబ్ గా మార్చి అల్జీర్స్ లో బాంబుల దాడులకు పాల్పడ్డాడు. అల్జీరియా జిహాదిస్ట్ గా పేరుమోసిన అబ్దెల్ మాలిక్ గ్రూప్ ను మట్టుబెట్టేందు ఫ్రెంచ్ ప్రభుత్వం ఏడేండ్లుగా శ్రమిస్తోంది. 5,000 మందికి పైగా సైనికులను రంగంలోకి దించింది. ఫ్రెంచ్ దళాలు మాలిక్ గ్రూప్ లో ఇప్పటివరకు 500 మందికి పైగా జిహాదిస్టులను మట్టుబెట్టాయి.

Latest Updates