ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌పై సింధు గురి

  • నేటి నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ
  •  బరిలో శ్రీకాంత్‌, ప్రణీత్‌, సమీర్‌

పారిస్‌‌: ఇటీవల పలు టోర్నీల్లో నిరాశపరిచిన  ప్రపంచ చాంపియన్‌‌ పీవీ సింధు.. మంగళవారం మొదలయ్యే ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్ట్‌‌ టూర్‌‌ సూపర్‌‌ 750 బ్యాడ్మింటన్‌‌ టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆగస్టులో వరల్డ్‌‌ చాంపియన్‌‌గా ఆవిర్భవించాక సింధు తర్వాత అనూహ్యంగా ఫామ్‌‌ కోల్పోయింది. చైనా ఓపెన్‌‌లో తొలిరౌండ్‌‌లో ఓడిన ఇండియన్‌‌ స్టార్‌‌.. కొరియా ఓపెన్‌‌, డెన్మార్క్ ఓపెన్‌‌లో రెండోరౌండ్‌‌లోనే ఇంటిముఖం పట్టింది.

రెండేళ్ల కిందట ఫ్రెంచ్​ ఓపెన్​లో సెమీస్‌‌కు చేరిన సింధు.. ఈసారి విజేతగా నిలిచి సీజన్‌‌లో తొలి సూపర్ సిరీస్‌‌ టైటిల్‌‌ దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. ఐదోసీడ్‌‌గా బరిలోకి దిగుతున్న తెలుగు స్టార్‌‌కు..తొలిరౌండ్‌‌లో వరల్డ్‌‌ నం.9 మిషెల్లీ లీ (కెనడా) రూపంలో పెద్ద సవాలు ఎదురవుతోంది. గతంలో రెండుసార్లు సింధును లీ ఓడించింది. ఈ గండం గట్టెక్కితే క్వార్టర్స్‌‌లో టాప్‌‌సీడ్‌‌ తై జు యింగ్‌‌ (చైనీస్‌‌తైపీ) ఎదురవనుంది. గాయం నుంచి కోలుకున్న మరో స్టార్‌‌ ప్లేయర్‌‌ సైనా నెహ్వాల్‌‌ కూడా ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

గత మూడు టోర్నీల్లో తొలిరౌండ్‌‌ల్లోనే ఓటమిపాలైన సైనా.. ఈసారి మాత్రం స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలని భావిస్తోంది. తొలిరౌండ్‌‌లో చెయూంగ్‌‌ ఎంగన్‌‌ యి (హాంకాంగ్‌‌)తో పోటీపడనుంది. పురుషుల విభాగంలో 2017 చాంపియన్‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌ ఈ టోర్నీ ద్వారా మళ్లీ లయను దొరకబుచ్చుకోవాలని భావిస్తున్నాడు. తొలిరౌండ్‌‌లో సెకండ్‌‌ సీడ్‌‌ చౌ టిన్‌‌ చెన్‌‌ (చైనీస్‌‌ తైపీ)తో పోటీపడుతున్నాడు. కశ్యప్‌‌.. తొలిరౌండ్‌‌లో ఎన్జీ కా లాంగ్‌‌ అంగూస్‌‌ (హాంకాంగ్‌‌)తో తలపడనున్నాడు. వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ బ్రాంజ్‌‌ మెడలిస్ట్‌‌ సాయిప్రణీత్‌‌.. లెజెండరీ ప్లేయర్‌‌ లిన్‌‌ డాన్‌‌ (చైనా)తో, కెంటా నిషిమొటో (జపాన్‌‌)తో సమీర్‌‌ అమీతుమీ తేల్చుకోనున్నారు.

French Open: PV Sindhu looking to win 1st title since World Championship

Latest Updates