హైదరాబాద్​ నుంచి  ICC  వరకు

జి. సువర్ణ లక్ష్మి.. తెలుగు క్రికెటర్‌‌‌‌.1999లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌ నుంచి ఇండియా జట్టుకు ఎంపికైన మీడియం పేసర్‌‌‌‌. ఇన్నాళ్లు ఆమె గురించి చాలా మందికి తెలియదు. అయితే ఐసీసీ మ్యాచ్‌‌‌‌ రెఫరీ ప్యానల్‌‌‌‌కు లక్ష్మి మంగళవారం ఎంపికయ్యారు. దీంతో ఒక్కసారిగా ఎందరో మహిళా క్రికెటర్లకు మార్గదర్శకురాలిగా మారారు. క్రికెటర్‌‌‌‌గా రిటైర్‌‌‌‌ అయ్యాక నచ్చిన ఆటతో అనుబంధాన్ని ఎలా కొనసాగించాలి అనేది లక్ష్మి చూపించారు. ఐసీసీ రెఫరీల ప్యానల్‌‌‌‌కు ఎంపికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన లక్ష్మిని త్వరలో పురుషుల మ్యాచ్‌‌‌‌లకు అధికారిగా చూసే అవకాశం కూడా ఉంది. ఐసీసీ దాకా చేరిన లక్ష్మికి భాగ్యనగరానికి విడదీయలేని బంధం ఉంది. క్రీడాకారిణిగా ఆమె ప్రయాణంలో అంబర్‌‌‌‌పేట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌ రైల్వే క్రికెట్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది.

బీహార్‌‌‌‌ నుంచి భాగ్యనగరానికి..

లక్ష్మీ తండ్రి బిహార్‌‌‌‌లోని టాటా ఇంజనీరింగ్‌‌‌‌ సంస్థలో పని చేసేవారు. బీహార్‌‌‌‌లోనే ఆమె క్రికెట్‌‌‌‌ తొలి పాఠాలు నేర్చుకున్నారు. సౌత్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ రైల్వేలో ఉద్యోగం రావడంతో 1989లో హైదరాబాద్‌‌‌‌కు మకాం మార్చారు. అంబర్‌‌‌‌పేట్‌‌‌‌లోని గ్రౌండ్‌‌‌‌లో కొన్ని లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఆడినలక్ష్మి, సికింద్రాబాద్‌‌‌‌ రైల్వే రిక్రియేషన్‌‌‌‌ క్లబ్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌లో కొన్ని రాష్ట్ర స్థాయి మ్యాచ్‌‌‌‌ల్లో ఆడారు. కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌‌‌‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కొంతకాలం సౌత్‌‌‌‌ జోన్‌‌‌‌ నాయకత్వం వహించిన లక్ష్మీ, ఇండియన్‌‌‌‌ రైల్వ్సే టీమ్‌‌‌‌కు ఆడారు.1995లో నేషనల్‌‌‌‌ టైటిల్‌‌‌‌ గెలిచిన సౌత్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ రైల్వే జట్టులో లక్ష్మి సభ్యురాలు. ఆ తర్వాత 1999లో జాతీయ జట్టుకు సెలెక్ట్‌‌‌‌ అయ్యారు.అయితే ఇండియాకు ఎంపికయ్యే నాటికి లక్ష్మి కెరీర్‌‌‌‌ చివరి దశలో ఉంది. అప్పట్లో జట్టులో పోటీ ఎక్కువుగా ఉండడంతో తుది జట్టులో చాన్స్‌‌‌‌ ఆమెకు చాలా అరుదుగా వచ్చేది. అయితే శాంతా రామస్వామి, డయానా ఎడుల్జీ, శుభాంగి కులకర్ణి, సుధా షా, పూర్ణిమ రౌ, రజనీ వేణుగోపాల్‌‌‌‌, మిథాలీ రాజ్‌‌‌‌ వంటి గొప్ప క్రీడాకారిణులతో లక్ష్మి డ్రెస్సింగ్‌‌‌‌రూమ్‌‌‌‌ పంచుకుంది.

రెఫరీగా ప్రయాణం….

ప్లేయర్‌‌‌‌గా మైదానానికి దూరమైన ఆటపై మక్కువ చంపుకోలేకపోయినా జీఎస్‌‌‌‌ లక్ష్మి 2008–09 సీజన్‌‌‌‌లో దేశవాళీ మహిళల మ్యాచ్‌‌‌‌కు తొలిసారి రెఫరీగా వ్యవహరించారు. మూడు విమెన్స్‌‌‌‌ వన్డేలతో పాటు, మూడు టీ20 మ్యాచ్‌‌‌‌లకు రెఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. పలు మెన్స్‌‌‌‌ టోర్నీల్లో కూడా లక్ష్మి రెఫరీగా పని చేశారు. మెన్స్‌‌‌‌ అండర్‌‌‌‌–16(విజయ్‌‌‌‌ మర్చంట్‌‌‌‌ ట్రోఫీ), అండర్–19(కూచ్‌‌‌‌ బెహార్‌‌‌‌ ట్రోఫీ) దేశవాళీ మ్యాచ్‌‌‌‌లకు రెఫరీగా ఉన్నారు. తొలిసారి రెఫరీగా వ్యహరించినప్పటీ సంగతులను ఆమె గుర్తు చేసుకుంటూ.. ‘2014లో పంజాబ్‌‌‌‌, హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌ మధ్య పాటియాలలో జరిగిన అండర్‌‌‌‌–16 మ్యాచ్‌‌‌‌లో తొలిసారిగా బాయ్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు రెఫరీగా పని చేశా. ఆ మ్యాచ్‌‌‌‌లో శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ సెంచరీ చేశాడు. అతని ఆట చూసి అప్పుడే అనుకున్నా అతని ప్రయాణం చాలా దూరం వెళుతుందని, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌‌‌‌తో నా నమ్మకాన్ని నిజం చేశాడు’అని లక్ష్మి చెప్పారు. అంతేకాక రెఫరీగా జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌, రాధా యాదవ్‌‌‌‌ లాంటి యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ ఆటను చాలా దగ్గర నుంచి చూసిన లక్ష్మి వారికి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.

Latest Updates