ఇవాళ్టి నుంచి ఏసీ, కారు, బైక్​ షోరూమ్‌‌లు ఓపెన్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏసీలు అమ్మే షాపులు, ఆటోమొబైల్ షో రూములు, వెహికిల్స్ స్పేర్ పార్టులు అమ్మే షాపులు తెరిచేందుకు సర్కారు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. మిగతా అంశాలకు సంబంధించి ఈ నెల 17 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్​లైన్స్​ ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు, సీజనల్ వ్యాధుల అంశాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, వైరస్​ సోకినా కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉన్నారని సీఎం కేసీఆర్​ అన్నారు. కరోనా మరణాలు రేటు కేవలం 2.38 శాతమేనని, దేశ సగటు 3.5 శాతమని చెప్పారు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కాబట్టి కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదన్నారు. విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

నాలుగు జోన్లలోనే యాక్టివ్​ కేసులు..

రాష్ట్రంలో కరోనా వైరస్ యాక్టివ్​ కేసులు కేవలం హైదరాబాద్ లోని ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లకే పరిమితమయ్యాయని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఆయా ఏరియాల్లో కఠినంగా లాక్​డౌన్​ నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. యాదాద్రి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కరోనా సోకినట్టు తేలిందని, అయితే వాళ్లు వైరస్​ సోకిన తర్వాతే రాష్ట్రానికి రావడం వల్ల ఈ జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఉన్నట్టు పరిగణించలేమని తెలిపారు.

సీజనల్‌‌ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలె..

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘‘సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయాలి. దోమలు రాకుండా ఫాగింగ్‌‌ చేయాలి. చెత్తా చెదారం తొలగించాలి. పట్టణాల్లో మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్ పర్సన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రజలను చైతన్యం చేయాలి. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టణాలు, గ్రామాల పారిశుధ్య పనులపై తగిన సూచనలు చేయాలి’’అని ఆదేశించారు. హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని, మరో 45 దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఈటల, కేటీఆర్​లను ఆదేశించారు.

వానాకాలం మక్కలొద్దు

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. వర్షాకాలంలో మక్కల సాగు ఏమాత్రం లాభసాటి కాదని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పత్తి సాగు బెటరని తేల్చి చెప్పారు. వానాకాలం పంటగా 10– 15 లక్షల ఎకరాల్లో కందులు వేయాలని పేర్కొన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిపుణులు సర్కారుకు పలు సూచనలు చేశారు. ఈ సూచనలపై రెండు రోజుల పాటు చర్చించి.. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానాన్ని ఖరారు చేయనున్నారు. తర్వాత సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో సీఎం కేసీఆర్  18వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారు.

నిపుణుల సూచనలివీ..

  • కరోనా వల్ల రైతులు నష్టపోవద్దనే ప్రభుత్వం అన్ని పంటలు కొన్నది. ప్రతిసారి ప్రభుత్వం పంటలను కొనడం సాధ్యం కాదు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి.
  • వరి ఎక్కువగా వేయొద్దు. రాష్ట్ర అవసరాలు, బియ్యం మార్కెట్ ను పరిగణనలోకి తీసుకుంటే.. సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 25 లక్షల ఎకరాలు సాగు చేయాలి.
  • వరితో పోల్చితే పత్తి సాగు లాభదాయకం. సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో ఎక్కువ దిగుబడితో నాణ్యమైన పత్తి వస్తుంది. వరిలో ఎకరానికి 30 వేలు వస్తే.. పత్తికి 50 వేల వరకు ఆదాయం వస్తుంది. రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల వరకు పత్తి వేయడం మంచిది.
  • కందులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వానాకాలంలో 10 లక్షల నుంచి 15 లక్షల ఎకరాల్లో కంది వేయాలి.
  • వానాకాలంలో మక్కలు వద్దు. ఆ టైంలో ఎకరానికి 20–25 క్వింటాళ్లు వస్తే.. యాసంగిలో 40–45 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది.

రైతుకు దేశమంతా మార్కెట్టే..పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు

Latest Updates