
అమెరికా ఎట్ల ఉంటది? అక్కడికిపోయిన మనోళ్లు ఏం చేస్తరు? ఏం తింటరు? పండుగలు ఎట్ల జరుపుకుంటరు అని అందరికీ తెలుసుకోవాలనే
ఉంటది. కానీ, మనకు చెప్పేటోళ్లు ఎవరు? అమెరికా మొత్తం అర్థమయ్యెటట్టు, అక్కడి జీవితాల్ని అద్దంలో చూపించేటట్టు యూ ట్యూబ్ వీడియోలు చేస్తున్నది మన తెలంగాణ అమ్మాయి కళ్యాణి బొప్ప. కళ్యాణి అంటే శానామందికి తెల్వకపోవచ్చు కానీ, ‘అమెరికాలో అమ్మ కుట్టి’ అంటే టక్కున గుర్తుకొస్తది. వేములవాడ నుంచి అమెరికా దాంక సాగిన ఆమె జర్నీ లైఫ్‌తో ఇట్ల పంచుకున్నది.
పుట్టి పెరిగింది వేములవాడ. నువ్వు లైఫ్‌లో బెటర్ స్టేజ్‌కి వెళ్లాలంటే చదువొక్కటే మార్గమని చెప్పేది అమ్మ. అందుకే చదువులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేదాన్ని. వేముల వాడ పక్కన మల్యాల అనే ఊళ్లో పదోతరగతి, కరీంనగర్‌లోని ట్రినిటీ కాలేజీలో ఇంటర్ చదివా. జేఎన్టీయూ కొండగట్టులో బీటెక్ చేశా. క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే జాబ్ తెచ్చుకున్నా. ఆ తర్వాత పెళ్లి కావడంతో యూఎస్ షిఫ్ట్ అయ్యా. సాదాసీదా అమ్మాయికి యూఎస్‌లో ‘జర్నీ’ అంటే ఓ స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్. ఆ అనుభవాల్ని, యూఎస్ గురించి నాకు తెలిసిన సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోవాలనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశా.
ఐడియా ఆయనది
యూఎస్‌కి వచ్చిన కొత్తలో ఇక్కడివాళ్ల లైఫ్ స్టయిల్ని, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ , సిస్టమ్‌ని మన ఇండియాతో పోల్చుకునేదాన్ని. ‘ఇండియాలో ఇట్లుంటది ఇక్కడ అట్లలేదు. ఇక్కడ ఇట్లుంది మనదగ్గరైతే అది అలా ఉండేది’ అని రోజూ నా హజ్బెండ్ కార్తీక్‌కి చెప్తుండేదాన్ని. ‘‘ఇదంతా నాకు చెప్పే బదులు యూట్యూబ్‌లో అందరికీ చెప్పొచ్చు కదా’’ అన్నారు ఒకసారి. చిన్నప్పట్నించీ నేను మాటల పిట్టనే.. స్టేజ్ ఫియర్ లేదు. కానీ, యూట్యూబ్ అనే సరికి మనకెందుకులే అనిపించింది మొదట. కానీ, ఇక్కడ జాబ్‌లో చేరాక ఛానెల్ పెడితే బాగుంటదని నన్ను నేను కన్విన్స్ చేసుకున్నా. కార్తీక్ సపోర్ట్‌తో అమెరికాలో అమ్మకుట్టి ఛానెల్ మొదలుపెట్టా.
ఎక్స్పెక్ట్ చేయలేదు
ఛానెల్ స్టార్టింగ్‌లో పది, ఇరవై వేల వ్యూస్ మా టార్గెట్. అంతకు మించి వస్తే హ్యాపీ.. రాకపోయినా పర్లేదు అనుకున్నం. కానీ, షార్ట్ టైంలోనే సబ్‌స్ర్కైబర్స్ సంఖ్య పెరుగుతూ పోయింది. వేలల్లో లైక్స్, మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ ట్రెండింగ్లోనూ నా వీడియోలు కనిపించాయి. ఒక్కోసారి ఇదంతా కలా, నిజమా అనిపిస్తుంటుంది నాకు.
అదే స్పెషాలిటీ
అమెరికాలో ఉంటున్న చాలామంది తెలుగువాళ్లు డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు. కానీ, వాళ్లలో చాలామందికి రాని గుర్తింపు నాకు వచ్చింది. దానికి కారణం నా వీడియోల కాన్సెప్ట్సే. రొటీన్ వీడియోలు నేను ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. అమెరికాలో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే? సొంతంగా కొనాలంటే? ఉద్యోగం చేయాలంటే ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. మన సిస్టమ్‌కి.. ఇక్కడ సిస్టమ్‌కి డిఫరెన్స్ ఏంటి? అమెరికాలో మన ఫెస్టివల్స్ సెలెబ్రేషన్స్.. లాంటి విషయాల్నే వీడియోల్లో చెప్తా. ప్రతీ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండేలా చూసుకుంటా. అలాగే నా వీడియోల్లో చూసే థింగ్స్ అన్నీ అమెరికాలో నా ఫస్ట్ ఎక్స్పీరియెన్స్లే. అందుకనే ఇండియాలో ఉన్నవాళ్లు పర్స్పెక్టివ్లోనే నేనూ చూస్తా. వీడియోల్లోనూ అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందుకే జనాలు అంతలా కనెక్ట్ అయ్యారని నా నమ్మకం.
ఐయామ్ సో హ్యాపీ
చాలామంది తమ ఇంట్లో అమ్మాయిలాగే నన్ను చూస్తుంటారు. మన దేశంలోనే కాదు ఇక్కడుంటున్న తెలుగు వాళ్లు కూడా నన్ను గుర్తుపడతారు. ‘భలే చేస్తున్నావ్’ అంటూ మెచ్చుకుంటారు. అమెరికాలో బతుకమ్మ, సంక్రాంతి లాంటి ఈవెంట్స్‌కి వెళ్లినప్పుడు దగ్గరికొచ్చి పలకరిస్తారు. ‘వీలు చూసుకుని మా ఇంటికి రా అమ్మా’అని పిలుస్తుంటారు. కరోనా వల్ల మాస్క్ పెట్టుకుని బయటికి వెళ్తున్నా గొంతు విని గుర్తుపడుతున్నరు. ఇగ సోషల్ మీడియాలో అయితే కుప్పలుకుప్పలు మెసేజ్‌లు వస్తుంటయ్. చాలామంది ‘అక్కా’ అని పిలుస్తుంటరు నన్ను. ఇంతమంది ప్రేమ దక్కడం నిజంగా అదృష్టమే.
పట్టించుకోను
నెగెటివిటీని పట్టించుకుంటే ఏ ప్రొఫెషన్లో అయినా సర్వైవ్ అవ్వలేం. అందుకే ఛానెల్ అనుకున్నప్పుడే నెగెటివ్ కామెంట్లని పట్టించుకోకూడదని డిసైడ్ అయినం. నిజం చెప్పాలంటే మార్నింగ్ టు ఈవెనింగ్ ఉద్యోగం.. వచ్చాక నెక్స్ట్ వీడియో ప్లానింగ్.. పర్సనల్ లైఫ్ ఇన్నింటి మధ్య కామెంట్లు చదవడానికి టైం ఉండదు.
బాగా మిస్సవుతున్నా
మేముండే న్యూజెర్సీ స్టేట్‌లో తెలుగువాళ్లు ఎక్కువ. చుట్టూ మనవాళ్లే ఉండటం వల్ల వేరే దేశంలో ఉంటున్నామన్న ఫీల్ రాదు. మన ఇండియన్ రెస్టారెంట్లు, గ్రోసరీ స్టోర్లు కూడా ఉంటాయ్. పానీపూరితో సహా మన ఇండియాలో దొరికే స్ట్రీట్ ఫుడ్ అంతా దొరుకుతుంది. కానీ, ఎన్ని ఉన్నా ఫ్యామిలీని బాగా మిస్ అవుతాం. లాస్ట్ ఇయర్ ఇండియా రావాల్సింది కానీ, కరోనా వల్ల బ్రేక్ పడింది. రెండున్నరేళ్లు అయింది ఇండియాకి వచ్చి. దాంతో హోం సిక్ మొదలైంది.
డిజైనింగ్ మొదలుపెట్టా
నాకు ఊహ తెలిసినప్పట్నించీ అమ్మ స్టిచింగ్ చేస్తుండేది. అమ్మ దగ్గర ఓ పదీ ఇరవై మంది స్టిచ్చింగ్ నేర్చుకునేటోళ్లు. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల నాకూ స్టిచ్చింగ్, డ్రెస్ డిజైనింగ్ గురించి తెలిసింది. చిన్నప్పట్నించీ అమ్మ హెల్ప్‌తో నా డ్రెస్‌లన్నీ నేనే డిజైన్ చేసుకునేదాన్ని. సర్ప్రైజింగ్గా నా వీడియోల్లో ఆ డ్రెస్లన్నింటికీ మంచి కాంప్లిమెంట్స్ వచ్చేవి. మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది.. ఇదెక్కడ కొన్నారు అంటూ చాలామంది అడగడం మొదలుపెట్టారు. ఇంతమందికి నచ్చుతున్నాయి కదా! ఈ డిజైన్స్‌నే మార్కెట్లోకి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. దాంతో లాస్ట్ ఇయర్ డ్రెస్ డిజైనింగ్ స్టార్ట్ చేశా. ఇక్కడ డిజైన్స్ చేసి ఇండియాలోని మా టీమ్ ద్వారా స్టిచ్చింగ్, డెలివరీ చేయిస్తున్నా. ఆన్లైన్ వర్క్ నేను చూసుకుంటా, ఆఫ్‌లైన్ వర్క్ మా టీమ్ చూసుకుంటుంది.
పెద్దలు కుదిర్చిన పెళ్లి
చాలామంది వీడియోల్లో కార్తీక్‌కి, నాకు మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చూసి ‘లవ్ మ్యారేజా?’ అని అడుగుతుంటారు. కానీ, మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మొదట పెళ్లి తర్వాత యూఎస్ వెళ్లాలంటే చాలా భయపడ్డా. కానీ, కార్తీక్ ఆ భయాన్ని పోగొట్టి నాలో కాన్ఫిడెన్స్ నింపాడు. కమ్యూనికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసి యూఎస్‌లో ఉద్యోగం సంపాదించేలా చేశాడు. అంత సపోర్టివ్ భర్త దొరకడం చాలా లక్కీ.
అది చాలు
సిచ్యుయేషన్ ఏదైనా సరే నా ముఖంలో స్మైల్ఎప్పుడూ ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ కూడా ఎక్కువ నాకు . అల్లరి పిల్లని కూడా. డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎదుటి వాళ్లకి మేలు చేయకపోయినా పర్లేదు. కానీ, హాని చేయకూడదనేది నా ఫిలాసఫి. ఇండిపెండెంట్ అమ్మాయిగా ఉండటం నాకు చాలా ఇష్టం.
మా పేరెంట్స్, అత్తమామలు అందరూ నన్ను చూసి గర్వపడాలని నేను కోరుకుంటా.