కుక్కపిల్ల కళేబరం..18,000 ఏళ్లైనా చెక్కుచెదరలేదు

రష్యాకు తూర్పున సైబీరియన్ మంచుకొండల్లో దొరికిన కుక్కపిల్ల కళేబరమిది. ఇది దాదాపు18 వేల ఏండ్ల కిందట మంచులో కూరుకుపోయి చనిపోయిందట. ఇన్నేళ్ల తర్వాత ఇటీవలే ఇది మంచు కరిగి బయటపడగా, స్వీడన్ సైంటిస్టులు తీసుకొచ్చిండ్రు. దీనికి డాగోర్ అనే పేరు పెట్టిండ్రు. అయితే, ఇది తోడేళ్లు, కుక్కలకు మధ్య చుట్టంలాంటిదట! అంటే.. తోడేళ్ల నుంచి కుక్కలు ఏర్పడటానికి మధ్య జరిగిన ఎవల్యూషన్ కు ఇది సాక్షిగా నిలుస్తుందని, అందుకే దీనిని తోడేళ్లు, కుక్కలకు మధ్య మిస్సింగ్ లింక్ గా చెప్పవచ్చని అంటున్నారు. కొంచెం వివరంగా చూస్తే.. వేల ఏండ్లుగా మనకు విశ్వాసంగా ఉంటూ వస్తున్న శునకాలు.. ఒకప్పుడు తోడేళ్లేనట! అడవుల్లో మనుషులకు దగ్గరైన కొన్ని తోడేళ్లు, వాటి సంతతే కాలక్రమంలో ఇప్పటి మనం పెంచుకునే కుక్కల మాదిరిగా పరిణామం చెందాయని చెప్తుంటారు. అయితే, ఈ విషయాన్ని నిరూపించే గట్టి రుజువు తమకు డాగోర్ రూపంలో దొరికిందంటున్నారు స్వీడన్ సైంటిస్టులు. ఇన్నేండ్లూ మంచులోనే ఉండటం వల్ల డాగోర్ చర్మం, వెంట్రుకలు, నోరు, దంతాలు, చిగుళ్లతో సహా చాలా భాగాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంతేకాదు.. దీని నోట్లో అటు తోడేళ్ల మాదిరిగా రెండు కోర పళ్లు, ఇటు కుక్కల మాదిరిగా మామూలు పళ్లు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది తోడేళ్లు కుక్కలుగా మారి, మనుషులకు దగ్గరైన కాలం ఇదే కావచ్చని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

Latest Updates