తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్​లే బెట్టింగ్​లు

full-betting-on-lokhsabh-election-results

‘ఆ పార్టీకి ఇన్ని సీట్లొస్తే లక్షకు రెండు లక్షలు..ఆ స్థానంలో అభ్యర్థి గెలిస్తే ఎంత కట్టడానికైనా రెడీ..ఆ సీటులో 5 లక్షల మెజార్టీ వస్తే ఐదు రెట్లు ఆ నాయకుడు ఓడితే మూడు లక్షలు..ఆ పార్టీ అధికారంలోకి వస్తే రెండింతలు..’’ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల బెట్టింగ్​ బేరం ఇలా జోరుగా నడుస్తోంది. ఎగ్జిట్​ పోల్స్​ విడుదలై.. రిజల్ట్స్​ డేట్​ దగ్గర పడటంతో పందేల జోరు పీక్‌ స్టేజ్​కు చేరింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. భవనాలు, బంగారం, పొలాలు, స్థలాలు కూడా పందేనికి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్​సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాష్ట్రంలో కంటే పందెంరాయుళ్ల ఫుల్​ ఫోకస్​ అక్కడే ఉంది.

ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో..

ఈసారి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ పందేలు కాస్తున్నారు. బెట్టింగ్​లో కీలకమైన బుకీలకు సొంత ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఉంటుంది. దీన్ని ద్వారా రాజకీయ పరిణామాలను అంచనా వేస్తుంటారు. సోషల్‌ మీడియాలో రహస్యంగా గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలుస్తోంది. బడా పారిశ్రామిక వేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బుకీల అవతారం ఎత్తి బెట్టింగ్‌లు కాస్తున్నట్లు సమాచారం. ఇదంతా కోడ్ భాషలో సాగుతోంది. బెట్టింగురాయుళ్ల ప్రలోభాలతో పార్టీ నేతలు, కార్యకర్తలు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో కొద్ది మంది అప్పులు చేసి మరి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తెలుగు వారు పందేలు కాస్తున్నట్లు సమాచారం.

లక్షల నుంచి కోట్ల వరకు..

తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేల నుంచి మొదలుకొని లక్షలు, కోట్ల వరకు బెట్టింగ్‌లుకాస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల టీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి రావడంతో మరోసారి అధికార పార్టీపై ఎక్కువగా బెట్టింగ్‌‌ నడుస్తోంది. ఆ పార్టీకి 16 ఎంపీ సీట్లు వస్తాయని కొందరు, రావని మరికొందరు పందేలు కాస్తున్నారు. రాష్ట్రంలో బెట్టింగ్​ రాయుళ్ల దృష్టి సీఎం కేసీఆర్​ కూతురు, సీట్టింగ్​ ఎంపీ కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్‌‌ సెగ్మెంట్​పైనే ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోని జూదరులు ఈ స్థానంపై బెట్టింగ్‌‌ కాస్తున్నారు. ఉత్తమ్‌‌ పోటీ చేస్తున్న నల్గొండ, డీకే అరుణ బరిలో ఉన్న మహబూబ్‌‌నగర్‌‌, రేవంత్‌‌రెడ్డి పోటీ చేస్తున్న మల్కాజ్‌‌గిరి, కిషన్‌‌ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్‌‌, కొండా విశ్వేశర్‌‌రెడ్డి పోటీ చేస్తున్న చేవెళ్లపై బెట్టింగ్‌‌లు ఎక్కువగా నడుస్తున్నాయి. అత్యధిక మెజారిటీకి సంబంధించి మెదక్‌‌, హైదరాబాద్‌‌, వరంగల్‌‌ స్థానాలపై పందేలు కడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌‌ కేంద్రంగా రాజకీయ బెట్టింగ్‌‌లు సాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఖమ్మం, మహబూబ్‌‌నగర్‌‌, సూర్యాపేట, మెదక్‌‌, కరీంనగర్‌‌, నల్గొండ, వరంగల్‌‌, మహబూబ్‌‌నగర్‌‌, ఆదిలాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కూడా పందేలు జోరుగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఎక్కడా బెట్టింగ్​కు సంబంధించి ఇప్పటిదాకా కేసులు మాత్రం నమోదుకాలేదు.

ఏపీలో క్రికెట్​ను మించి..

ఏపీలో ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా బెట్టింగ్‌‌ కడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్​ పోటీ చేసిన మంగళగిరి స్థానం, జనసేన అధినేత పవన్‌‌ కల్యాణ్‌‌ పోటీ చేసిన రెండు సీట్లు, నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం, బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం, రోజా బరిలో ఉన్న నగరిపై బెట్టింగ్‌‌లు ఎక్కువగా కడుతున్నారు. వైఎస్​ జగన్‌‌, చంద్రబాబు మెజారిటీపైనా పందేలు కాస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బెట్టింగ్​లు భారీగా నడుస్తున్నాయి. ఎగ్జిట్‌‌ పోల్స్‌‌ వెలువడటంతో బెట్టింగ్‌‌లు మరింత ఊపందుకున్నాయి.

Latest Updates