ఫ్రీ వాటర్​ స్కీమ్‎కు కొత్త రూల్స్

ఫ్రీ వాటర్​ స్కీమ్‎కు కొత్త రూల్స్
  • ఎప్పటికప్పుడు రూల్స్​ మార్చుతున్న వాటర్​బోర్డు
  • గతంలో ప్రతి ఇంటికి ఉచిత నీరు ఇస్తామన్న ప్రభుత్వం
  • తాజాగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఆధారంగా స్కీం అమలు
  • ఇప్పటికే 70–80వేల ఇండ్లపై అనర్హత వేటు

హైదరాబాద్, వెలుగు: ఫ్రీ వాటర్​ స్కీమ్​ రూల్స్​ను వాటర్​బోర్డు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుండగా అమలుపై అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికీ 3.5 లక్షల కనెక్షన్లకు సీడింగ్​కాలేదు. సీడింగ్​అయిన 6.8లక్షల కనెక్షన్లపై మళ్లీ వడపోత మొదలుపెట్టారు. రూల్స్​పేరిట ఆక్యుపెన్సీ, పీటీఐఎన్, ప్లాన్​మేరకు ఇంటి నిర్మాణం లేదని ఇప్పటివరకు 70 వేల ఇండ్లకు స్కీమ్ లో కోత పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ నెలాఖరు నుంచి గ్రేటర్ లో వాటర్ బోర్డు ఫ్రీ వాటర్ స్కీమ్​అమల్లోకి తెచ్చింది. నల్లా కనెక్షన్​కు ఆధార్ సీడింగ్ చేసుకుంటే ఫ్రీగా 20వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తారు. మొత్తం 10.8లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, ఇందులో 6.8లక్షలకే సీడింగ్​పూర్తైంది. స్కీమ్​9 నెలలుగా నడుస్తుండగా, ఇప్పటికీ కంప్లీట్​చేయకపోగా 3.5లక్షల నల్లా కనెక్షన్లకు సీడింగ్​ చేయలేదు. సీడింగ్​ అయిన కనెక్షన్లకు వాటర్ బోర్డు పెట్టే కండీషన్లతో  మరికొంత మంది దూరమయ్యేలా ఉంది. 

స్కీమ్​లో మార్పులు చేస్తుండగా..  
నల్లా కనెక్షన్లలో సగానికి కంటే ఎక్కువ వాటికి మీటర్లు లేవని అధికారులు గుర్తించారు. స్లమ్ డొమెస్టిక్ ఏరియాల్లోని 1.97లక్షలకు మీటర్లు లేకున్నా ఆధార్ సీడింగ్ చేసుకుని లబ్ధి పొందుతున్నారు. మిగిలిన డొమెస్టిక్ 7.87లక్షల కనెక్షన్లలో  కేవలం 2.20లక్షలకు మాత్రమే మీటర్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి మస్ట్​ చేసేందుకు  మీటరు ఉంటేనే స్కీమ్​ వర్తిస్తుందనే రూల్​ను కొత్తగా అమలైనప్పుడు తెచ్చారు. రెండోసారి మీటర్ తోపాటు, ఆధార్ సీడింగ్ వివరాలు క్యాన్ నెంబర్లతో సరిపోతేనే వర్తిస్తుందని రూల్స్ మార్చారు.   క్యాన్ నెంబర్ ప్రతి ఇంటికి పీటీఐ నెంబర్ ఉంటేనే ఫ్రీ వాటర్ వస్తుందని, లేదంటే బిల్లు చెల్లించాలని మూడోసారి ప్రకటించారు. తాజాగా ఆక్యుపెన్సీ, రూల్​ ప్రకారం బిల్డింగ్ ఉంటే తప్పా స్కీమ్​కు అర్హులు కాదని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. దీంతో  70వేల కనెక్షన్లపై అనర్హత వేటు పడినట్లుగా తెలిసింది. ప్రతి ఇంటికి ఫ్రీ వాటర్ స్కీమ్​పై ప్రభుత్వం హామీ అధికారుల తీరుతో ఫెయిల్​అవుతుందని విమర్శలు వస్తున్నాయి.

అపార్టుమెంట్లకు మరో రూల్
ఫ్రీ వాటర్ కోసం అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కు చెందిన ఒక్కరి ఆధార్ వివరాలు సీడింగ్​ చేసినా సరిపోతుందని మొదట్లో అధికారులు చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓనర్ కచ్చితంగా ఆధార్ సీడింగ్ చేస్తేనే స్కీమ్​వర్తిస్తుందని స్పష్టం చేయడమే కాకుండా, చేసుకోని వారు బిల్లు మొత్తం కట్టాలని ఆదేశాలిచ్చారు. దీంతో ఆధార్ సీడింగ్ పూర్తి స్థాయిలో జరగకపోగా అపార్టుమెంట్ వాసులు స్కీమ్​పై ఇంట్రెస్ట్​ చూపలేదు.  చాలా అపార్టుమెంట్లలో ఫ్లాట్లు ఓనర్ల పేరిట ఉండగా.. టెన్నెంట్లకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇకనుంచి ప్రతి ప్లాట్ పీటీఐఎన్ నమోదు చేయాలనే టార్గెట్​తో రూల్స్​ మార్చగా స్కీమ్​కు చాలా మంది దూరంగా ఉండిపోయారు. దీంతో 14లక్షలకు పైగా అపార్టుమెంట్లలో లక్షన్నర కనెక్షన్లకు పైనే ఎన్ రోల్ కాలేదు.