ఎండు మిర్చికి ఫుల్ డిమాండ్.. క్వింటాల్‌కు రూ. 20,500

  • సీజన్​ ప్రారంభంలోనే ఫుల్ డిమాండ్​
  • వండర్ హాట్‌‌, యూఎస్ 341, తేజ రకాలకు గిరాకీ
  • వరంగల్, ఖమ్మం, మలక్ పేట్ మార్కెట్ లలో జోరుగా సేల్స్
  • మార్కెట్‌‌కు రోజూ 6 వేల క్వింటాళ్లకు పైగా మిర్చి

హైదరాబాద్‌‌, వెలుగు: ఎండు మిర్చికి డిమాండ్​ పెరుగుతోంది. సీజన్‌‌ ప్రారంభంలోనే ధర భారీగా పలుకుతోంది. ఈ నెల మొదటి వారం నుంచి మలక్‌‌పేట్‌‌, వరంగల్‌‌, ఖమ్మం మార్కెట్‌‌లలో అమ్మకాలు జోరందుకున్నాయి.  ఫైన్‌‌ క్వాలిటీ మిర్చి క్వింటాల్‌‌ రూ.20 వేలకు పైగా అమ్ముడవుతోంది. ఖమ్మం జిల్లాలో మిర్చిపంట మార్కెట్‌‌కు పెద్దమొత్తంలో వస్తోంది.

అన్ని రకాలకూ హైరేట్​

రాష్ట్రంలోని వివిధ మార్కెట్‌‌లకు రోజూ సగటున ఆరు  వేల క్వింటాళ్ల మిర్చి వస్తోంది. సోమవారం 11,227 క్వింటాళ్ల ఎండు మిర్చి మార్కెట్‌‌కు వచ్చింది. వరంగల్‌‌ మార్కెట్‌‌లో వండర్‌‌ హాట్‌‌ రకం మిర్చి రూ.20,500 పలికింది. దీపిక రకానికి రూ.20,021, యూఎస్‌‌ 341 రకానికి  రూ.18,000 ధర పెట్టారు. మలక్‌‌పేట్‌‌ మార్కెట్‌‌లో నంబర్‌‌ వన్‌‌ మిర్చి  క్వింటాల్‌‌ రూ.17 వేలు పలికింది. ఖమ్మం మార్కెట్‌‌లో తేజ రకానికి క్వింటాల్‌‌ రూ.15,850, వరంగల్‌‌లో 15,500 హై రేట్‌‌ పలికింది. రాష్ట్రంలో అత్యధికంగా రూ.20,500 ధర పలుకగా, మోడల్‌‌ రేటు ఒక్కో మార్కెట్‌‌లో రూ.20,021, రూ.17వేలు, 16 వేల చొప్పున ధర పలుకుతోంది. తేజ రకానికి  రూ.15,500 వేల నుంచి రూ.15,850 వరకు ధర పలికింది.

అంచనా మేర పండక..

ఈఏడాది సాధారణం కంటే 50 వేల ఎకరాల్లో  మిరప అదనంగా సాగైంది. కానీ వర్షాల ఎఫెక్ట్‌‌ తో భారీగా పంట నష్టం జరిగింది. మొత్తంగా రెండున్నర లక్షల ఎకరాల్లో మిర్చి సాగవగా.. దిగుబడి 4.16 లక్షల టన్నులు వస్తుందని తొలుత అంచనా వేశారు. కానీ నవంబర్‌‌లో వర్షాలకు పంట నష్టం జరగడంతో ప్రస్తుతం 3 లక్షల టన్నుల వరకు దిగుబడి రావొచ్చని స్పైసెస్‌‌ డిపార్ట్‌‌ మెంట్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

కూలీలు దొరకట్లే

మార్కెట్‌‌లకు రోజూ ఆరు వేల క్వింటాళ్లకు పైగా మిర్చి వస్తోంది. సోమవారం అధికంగా ఖమ్మం మార్కెట్‌‌కు 6,640 క్వింటాళ్ల మిర్చి రాగా, వరంగల్‌‌, మలక్‌‌పేట్‌‌ గంజ్‌‌లకు 4,587 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. తేజ మిర్చి ఎక్కువగా మార్కెట్‌‌కు వస్తోంది. మిర్చికి మంచి ధర ఉండడంతో మిరప తోటలు ఏరడం కూడా జోరందుకుంది.  రూ.250 నుంచి రూ.300 చొప్పున కూలి ఇస్తూ తోటలు ఏరిస్తున్నారు. అయినా కూలీలు దొరకడం లేదని రైతులు అంటున్నారు.

ఖమ్మం మార్కెట్​లో దళారులు

ఖమ్మం మార్కెట్‌‌లో రేటు దక్కకుండా దళారులు అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లోకల్​ వ్యాపారులు గుంటూరు మార్కెట్‌‌ వ్యాపారులతో కుమ్మక్కై ధర తగ్గిస్తున్నారని చెబుతున్నారు. గుంటూరు నుంచే ఇంటర్నేషనల్‌‌ మార్కెట్‌‌కు మిర్చి ఎక్స్‌‌ పోర్ట్​  అవుతుంది. దీంతో వాళ్లు చెప్పిందే రేటుగా నడుస్తోంది. అక్కడి మూలాలున్నవారే ఇక్కడ తక్కువ ధరకు కొంటున్నారని రైతులు అంటున్నారు. కాంటాల్లోనూ మోసాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For More News..

రైతులు అమ్ముకున్నంక.. రేటు పెంచిన్రు.. రూ. 2500 నుంచి 5900కి పెంపు

స్కూల్ వంటమనిషికి పద్మశ్రీ అవార్డ్

రాష్ట్రంలో నిలిచిపోయిన డయాలసిస్ సేవలు!

Latest Updates