రిజల్ట్స్ డే స్పెషల్.. లడ్డూలకు భారీ గిరాకీ

రిజల్ట్స్ డే స్పెషల్.. లడ్డూలకు భారీ గిరాకీ

లోక్ సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే విడుదల కాబోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ రేసు గుర్రాల్లాంటి అభ్యర్థులంతా… గెలుపుపై ఎవరి లెక్కల్లో వాళ్లున్నారు. తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉన్నవారు.. సంబరాలకు రెడీ అవుతున్నారు. రేపు దేశమంతటా ఫలితాలు విడుదల కాబోతుండటంతో… రాజకీయ నాయకులకు, వారి అభిమానులకు గెలుపు ఓ పండుగలా మారింది. సంబరాల సందర్భంగా…. చాలా స్వీట్ షాపులకు ఆర్డర్లు భారీగా వస్తున్నాయి.

గెలిచిన వేళ స్వీట్లు పంచడం కామన్. పండగలొస్తే కిలోల లెక్కన ఆర్డర్లొస్తుంటాయి స్వీట్ షాపులకు. కానీ.. ఎన్నికల వేళ.. కిలోలు కాదు.. టన్నుల్లెక్కన్న ఆర్డర్లు వస్తున్నాయట. స్వీట్ షాపులకు వస్తున్న గిరాకీతో… ప్రత్యేకంగా ఒకట్రెండు రోజులకు మనుషులను నియమించుకుని లడ్డాలు, ఇతర స్వీట్లు తయారుచేయిస్తున్నారు.

లూథియానా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్ కతా, చెన్నై నగరాల్లో ఈ కోలాహలం ఎక్కువగా కనిపిస్తోంది. పంజాబ్ లో ఓ షాప్ ఓనర్ తమకు భారీ గిరాకీ వస్తోందని చెప్పాడు. బీజేపీ, శిరోమణి అకాలీదల్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయన్నాడు. తన ఒక్క షాప్ కే ఒక రోజులోనే 10 నుంచి 12 క్వింటాళ్ల లడ్డూల ఆర్డర్ వచ్చిందన్నాడు.

ఎగ్జిట్ పోల్స్ తర్వాత రోజునుంచి స్వీట్ షాపులకు ఆర్డర్లు భారీగా పెరిగాయని షాపు ఓనర్లు చెబుతున్నారు.