క‌రోనా కేసులు భారీ‌గా ఉన్న 4 జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్: 19 నుంచి 30 వ‌ర‌కు..

కొద్ది రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా పెరుగుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భారీగా స‌డ‌లించిన లాక్‌డౌన్‌ను మ‌ళ్లీ క‌ఠిన‌త‌రం చేయాల‌ని నిర్ణ‌యించింది. వైర‌స్ విజృంభ‌ణ తీవ్రంగా ఉన్న చెన్నై, కాంచీపురం, చెంగ‌ల్‌ప‌ట్టు, తిరువ‌ల్లూర్ జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వ‌ర‌కు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమ‌లు చేయ‌బోతున్నట్లు సీఎం ప‌ళ‌నిస్వామి ప్ర‌క‌టించారు. వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌ను నియంత్రించ‌డ‌మే ఉత్త‌మ మార్గ‌మ‌ని, మ‌ళ్లీ కొన్నాళ్లు ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు. ఇటీవ‌ల కొద్ది రోజులుగా మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్ డౌన్ అమ‌లులోకి రాబోతోందని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో ఆ దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్న తొలి రాష్ట్రంగా త‌మిళ‌నాడు నిలిచింది. ఈ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 44,661 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అందులో 24,547 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా, 435 మంది మ‌ర‌ణించారు. ఇటీవ‌ల కొద్ది రోజులుగా త‌మిళ‌నాడులో రోజూ 1500 నుంచి దాదాపు 2 వేల వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో భారీగా కేసులు వ‌స్తున్న నాలుగు జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ పెట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు సంబంధించిన మార్గద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. అన్ని ర‌కాల వైద్య స‌ర్వీసుల‌కు 24 గంట‌ల అనుమ‌తి ఉంద‌ని చెప్పింది. నిత్య‌స‌రాల‌కు స‌డ‌లింపులు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే కిరాణా షాపులు, కూర‌గాయ‌ల మార్కెట్లు వంటివి ఉద‌యం ఆరు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే తెర‌వాల‌ని సూచించింది. ఆటోలు, క్యాబ్ స‌ర్వీసుల‌ను మ‌ళ్లీ నిలిపేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో 33 శాతం ఉద్యోగుల‌తో మాత్ర‌మే ప‌నులు నిర్వ‌హించాల‌ని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్ల‌తో నివ‌సించే ఉద్యోగులు ఆఫీసుల‌కు రాన‌వ‌స‌రం లేద‌ని స్ఫ‌ష్టం చేసింది. బ్యాంకులు జూన్ 29, 30 తేదీల్లో మాత్ర‌మే ఓపెన్ చేయాల‌ని సూచించింది.

హోట‌ళ్లు, రెస్టారెంట్లు ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఓపెన్ చేయొచ్చని చెప్పిన ప్ర‌భుత్వం.. కేవ‌లం పార్శిల్ స‌ర్వీసుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్లు పేర్కొంది. రేష‌న్ షాపులు ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే తెర‌వాల‌ని చెప్పింది. నిత్యావ‌స‌ర వ‌స్తువులు, మొబైల్ షాపులు వంటివి ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఓపెన్ చేసుకోవ‌చ్చని పేర్కొంది. ఏ వ‌స్తువుల కొనుగోలుకైనా రెండుకిలోమీట‌ర్ల ప‌రిధి దాటి వెళ్ల‌డానికి లేద‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. టీ షాపులు క్లోజ్ చేయాల్సిందేన‌ని తెలిపింది. అమ్మా క్యాంటీన్లు, క‌మ్యూనిటీ కిచెన్లు య‌థావిధిగా ప‌నిచేస్తాయ‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చెప్పింది. మీడియాపై ఎటువంటి ఆంక్ష‌లు ఉండ‌వ‌ని తెలిపింది. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని, సోస‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని సూచించింది.

Latest Updates