ఫాస్టాగ్ సిస్టమ్.. టోల్ గేట్ల దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్

నేషనల్  హైవేలపై టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే  ఈ విధానంపై సరైన ప్రచారం లేకపోవడంతో వాహనదారులు ఫాస్టాగ్ ను అమర్చుకోలేదు. దీంతో టోల్ గేట్ల దగ్గర వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పలు టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ లేని వాహనదారులు డబ్బు చెల్లించేందుకు బారులు తీరడంతో రద్దీ ఏర్పడింది. డబ్బు చెల్లించే గేట్ల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్ ప్లాజాలోని 5 గేట్ల ద్వారా ఫాస్టాగ్,  3 గేట్ల ద్వారా నగదు చెల్లించే వాహనాలను పంపుతున్నారు. దీంతో పంతంగి టోల్ గేట్ దగ్గర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో కేంద్రం తీరుపై మండిపడుతున్నారు వాహనదారులు. ఫాస్టాగ్ పై వాహనదారులకు సరైన అవగాహన కల్పించలేదంటున్నారు.

సంగారెడ్డిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జహీరాబాద్ వెళ్లే మార్గంలో టోల్ గేట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడతో జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఫాస్టాగ్ విధానానికి సిద్ధం కానివారికి కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. టోల్ గేట్ల దగ్గర హైబ్రిడ్ లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్యాగ్ లేకుండా ఫాస్టాగ్ లైన్ లో వెళ్లేవారికి జరిమానాగా రెట్టింపు టోల్ వసూలు చేయాలని సూచించింది. హైబ్రిడ్ లైన్లలో ఫాస్టాగ్ తో పాటు ఇతర మార్గాల్లో డబ్బు చెల్లించేవారికి అవకాశం కల్పించారు. కానీ ఈ సదుపాయం నెలరోజులు మాత్రమే ఉండనుంది.

Latest Updates