ప్రాణాలు తీసిన సరదా ఆట

ఇంటి పక్కన ఉండే చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తూ ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కిందపడి ఇద్దరూ మృతిచెందిన సంఘటన హయత్​నగర్​పీఎస్​పరిధిలో చోటుచేసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన జెల్ల వెంకటేష్ పెయింటర్. హయత్​నగర్​పీఎస్​పరిధిలోని మునుగనూరులో భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. వీళ్లు ఉండేది రెండో అంతస్తులో. వీళ్ల పక్క పోర్షన్​లో కర్నూలుకు చెందిన రవి భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. అయితే వెంకటేష్​ తన పిల్లలు, రవి పిల్లలతో కలిసి అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉండేవాడు. మంగళవారం రవి కూతురు దీపిక(8)ను ఎత్తుకొని వెంకటేష్​ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి ఇద్దరూ కిందపడిపోయారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో బిల్డింగ్​లో ఉంటున్న వారితోపాటు చుట్టు పక్కల ఉంటున్నవారు బయటికి వచ్చి చూశారు. తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే108 సహాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బతుకుతెరువు కోసం సిటీకి వచ్చిన వెంకటేష్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. అలాగే రవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కూతుళ్లలో ఒకరు చనిపోవడంతో కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరవుతోంది. బిల్డింగ్ రెయిలింగ్ ఎత్తు తక్కువగా ఉండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Latest Updates