ఫర్నీచర్​షాప్ : డిస్కౌంట్ పేరుతో జనాలకు టోపీ

  • 40 % డిస్కౌంట్.. ఆర్డరిస్తే పది రోజుల్లో ఐటమ్స్​
  • పరిగిలో ‘ఫర్నీచర్​షాప్’ ​భారీ మోసం
  • వందల సంఖ్యలో బాధితులు

పరిగి, వెలుగు: డిస్కౌంట్ ​ధరకు ఫర్నీచర్ ​సప్లై చేస్తామంటూ రూ. కోటికి పైగా వసూలు చేసి ఉడాయించిన ఘటన వికారాబాద్​జిల్లా పరిగిలో జరిగింది. తమిళనాడుకు చెందిన తాజొద్దీన్, మరో ముగ్గురు కలసి పరిగిలో నెల క్రితం హైవే పక్కన రోజా ట్రేడర్స్​ఫర్నీచర్​అండ్​ఎలక్ట్రానిక్​ దుకాణం ఓపెన్​ చేశారు. దుకాణంలో బీరువాలు, మంచాలు, సోఫాసెట్లు, డైనింగ్​టేబుల్స్, కుర్చీలు, ఫ్రిజ్ లు, కూలర్లు, ఫ్యాన్లు ఇలా అన్నీ అమ్ముతామంటూ శాంపిల్​ఐటమ్స్​ప్రదర్శనకు పెట్టారు. అసలు ధరలో 40 శాతం డిస్కౌంట్​ఇస్తున్నామంటూ ప్రచారం చేశారు. 40 శాతం డిస్కౌంట్​పోగా మిగిలిన మొత్తంలో సగం డబ్బులు కట్టి నచ్చిన ఐటమ్​ఆర్డర్​చేస్తే పది రోజుల్లో తెచ్చి ఇస్తామంటూ నమ్మబలికారు. ఇలా మొదటిసారి ఆర్డర్​ఇచ్చిన ఒకరిద్దరికి తెచ్చిఇచ్చారు. దీంతో వందల  సంఖ్యలో ప్రజలు ఆర్డర్లు ఇచ్చారు.

ఒక్కొక్కరి దగ్గర రూ. 4 వేల నుంచి రూ. 80 వేల వరకు అడ్వాన్సులు తీసుకున్నారు. మంగళవారం ఉదయం డెలివరీ అందాల్సినవారు దుకాణానికి వచ్చి చూస్తే మూసి ఉంది. ఫోన్​ చేస్తే ఎత్తకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆనోటా ఈ నోటా రోజా ట్రేడర్స్​దుకాణం వారు బిచాణ ఎత్తేశారని తెలియడంతో బాధితులు వందల సంఖ్యలో అక్కడకు చేరున్నారు. పెళ్లిళ్ల కోసం కూడా ఐటమ్స్​ బుక్​ చేశామంటూ చాలామంది బాధితులు వాపోయారు. పరిగి సీఐ మొగులయ్య, ఎస్సై వెంకటేశ్వరులు  సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణ యజమానులకు ఫోన్​చేయగ ఎత్తలేదు. కాసేపటికి స్విచ్​ఆఫ్​చేశారు. బాధితులు ఇచ్చిన ఆర్డర్​ఫారాలను జిరాక్స్​తీసి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. దీంతో పోలీస్​స్టేషన్​కు బాధితులు బారులు తీరారు. పరిగితోపాటు దోమ, పూడూరు, కుల్కచర్ల, వికారాబాద్​ప్రాంతాల వారి నుంచి సుమారు కోటి రూపాయలకు పైగా వసూలు చేసి ఉడాయించినట్లు అంచనా వేస్తున్నారు.

రూ. 63,200 కట్టా

రాయల్​ సోఫాసెట్, వుడ్​అండ్​గ్లాస్​టేబుల్, ఆరు కుర్చీలతో డైనింగ్​టేబుల్, ఎంఐ స్మార్ట్​ఎల్ఈడీ టీవీ, రాయల్​బెడ్స్, జీబ్రానిక్​ హోం థియేటర్, లాంగ్​ టేబుల్​ఈ ఏడు ఐటమ్స్​కోసం రూ.63,200 ఇచ్చి బుక్​ చేశా. బుక్​ చేసిన మూడు రోజులకే దుకాణం ఎత్తేశారు.– యాదయ్య, బాధితుడు, -పరిగి

బాధితులకు న్యాయం చేస్తాం

రోజా ట్రేడర్స్​లో ఆర్డర్​ చేసి తాము తీవ్రంగా నష్టపోయామంటూ బాధితులు మాకు ఫిర్యాదు చేశారు. చాలా మంది ఆర్డర్లు చేసినట్లు తెలుస్తోంది. దుకాణ యజమాని తాజొద్దీన్​ఆధార్​కార్డుపై తమిళనాడు అడ్రస్​ఉంది. త్వరలో వారిని పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తాం. ఇలా తక్కువ డబ్బులకు ఆర్డర్​పై ఇస్తామంటూ నమ్మి మోసపోవద్దు. – సీఐ మొగులయ్య

Latest Updates