గడ్చిరోలి దాడి వెనక నంబాల

కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న మావోయిస్టులు గడ్చిరోలి దాడితో మరోసారి దేశం ఉలిక్కిపడేలా చేశారు. ఉనికి ప్రశ్నార్థకమవుతున్న ప్రతిసారీ భారీ దాడితో విరుచుకుపడే మావోయిస్టులు ఈసారి మందుపాతర పేల్చడం ద్వారా ఒకేసారి 16 మందిని పొట్టన పెట్టుకుని సంచలనం సృష్టించారు. సీపీఐ(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గుర్రె బసవరాజు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్టు మహారాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. కుర్ ఖేడా వద్ద రోడ్డు నిర్మాణంలో వినియోగించే వాహనాలను కాల్చేస్తే పోలీసుల పెద్దసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుంటారని, అలా వచ్చినవారిని అంతం చేయాలని మావోయిస్టులు వ్యూహం పన్నారు. మావోయిస్టుల అంచనా ప్రకారమే- సంఘటనా స్థలానికి వెళ్తూ మార్గమధ్యలో మందుపాతరకు పోలీసులు బలయ్యారు.

నంబల ఆర్ఈసీ స్టూడెంట్​…

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేటకు చెందిన నంబాల కేశవరావు  వరంగల్ లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ ఓల్డ్​స్టూడెంట్. శ్రీకాకుళంలో ఇంటర్​ పూర్తి చేశారు. వరంగల్ ఆర్ఈసీలో సీటు రావడంతో ఇక్కడకు వచ్చారు. ఇంజినీరింగ్ చదువుతున్న  సమయంలోనే  ఒకప్పటి పీపుల్స్ వార్  కార్యక్రమాల వైపు కేశవరావు ఆకర్షితుడయ్యారు. అంతకుముందు- ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో క్రియాశీలకంగా పని చేసే సమయంలో ఓసారి అరెస్ట్ అయ్యారు. బెయిల్ పై విడుదలైన తర్వాత నక్సల్స్ గ్రూపులో చేరారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలను కొనసాగించారు. 1984లో ఎంటెక్‌‌ చదువుతున్నప్పుడు సీపీఐ (ఎంఎల్‌‌) పీపుల్స్ వార్‌‌ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితుడయ్యారు. ఎంటెక్‌‌ మధ్యలోనే వదిలేసి ఉద్యమంలో చేరారు. 34 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు.

దంతెవాడ జిల్లాలో ఎన్‌‌కౌంటర్‌….‌

భద్రాచలం, వెలుగు : చత్తీస్‍గఢ్‌‌ పోలీసులు గురువారం మావోయిస్టు కీలక నేతను ఎన్‍కౌంటర్లో హతమార్చారు. దంతెవాడ జిల్లా కిరండోల్‌‌ దగ్గర కూంబింగ్ చేస్తుండగా పెరపా- మర్కోమిరాస్ గ్రామాల శివారులోని అడవుల్లో ఎదురుకాల్పులు జరిగాయి.  ఈ కాల్పుల్లో మడవి ముయ్యా చనిపోగా మిగతావారు పారిపోయారు. 24వ ప్లాటూన్‍ కమాండర్‌‌ అయిన మడవి ముయ్యా అలియాస్‌‌ రోషన్, జోగా కుంజా (29) తలపై  రూ. 8 లక్షల రివార్డుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో మందుపాతర పేల్చి  బీజేపీ ఎమ్మెల్యే బీమా మండావిని చంపిన ఘటన,  బుర్కపాల్‍, నీలవాయి అడవుల్లో దూరదర్శన్‍ కెమెరామెన్‍తో పాటు పోలీసులను హత్య చేసిన ఘటనలకు అతనే సూత్రధారి. ఎన్‌‌కౌంటర్‌‌ స్థలంలో ఆరు రౌండ్ల 304 రైఫిల్‍  తూటాలు, భారీగా  పేలుడు పదార్థాలు దొరికాయని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. ఈ ఆపరేషన్‌‌లో పాల్గొన్న జవాన్లను నక్సల్స్‌‌ ఆపరేషన్స్ డీజీపీ డీఎం అవస్థి అభినందించారు.

బీజాపూర్‍లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు…

బీజాపూర్‍ జిల్లా బైరంగఢ్‍ పోలీస్‍స్టేషన్‍ పరిధిలోని ఇతాంపార, బిరయాభూమి గ్రామాలకు చెందిన ఇద్దరిని మావోయిస్టులు హత్య చేశారు. ఆరురోజుల కిందట ఈ హత్యలు జరగ్గా గురువారం నాడే బయటకొచ్చాయి. కాకా కచ్చు, పొడియం ముత్తాలను ఆరు రోజుల కింద పట్టుకుపోయి అటవీప్రాంతంలో హత్య చేశారు. పోలీసులకు చెప్పొద్దని బెదిరించడంతో గ్రామస్తులు నోరు మెదపలేదు. మృతుల్లో ఒకరు బైరంగఢ్‌‌ పీఎస్‌‌లో పనిచేసే కానిస్టేబుల్‌‌కు బంధువు.  ఈ ఘటన తమ దృష్టికి రాలేదని బీజాపూర్‍ ఎస్పీ గోవర్థన్‍ ఠాగూర్‍ చెప్పారు.

నడిపిస్తోంది కేశవరావే…

ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన తర్వాత  కేశవరావు ఆ పదవిలో నియమితుడయ్యాడు. గత ఏడాది నవంబర్ లోనే మావోయిస్టు గ్రూప్ చీఫ్ గా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి మావోయిస్టులు క్రియాశీలకంగా మారారని పోలీసులు అంటున్నారు. విశాఖపట్నం జిల్లా అరకు తెలుగుదేశం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యల వెనుక కూడా కేశవరావు స్కెచ్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోపాటు ఎన్నికలకు కొన్నిరోజుల ముందు చత్తీస్ గఢ్ దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే మండావి హత్య  వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కేశవరావేనని తెలుస్తోంది.  మావోయిస్టు ప్రధాన కార్యదర్శి పగ్గాలను అందుకున్న తరువాత పోలీసులు, భద్రతా బలగాల కన్ను కేశవరావుపై పడింది. ఆయన కోసం ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. కేశవరావు తలపై భారీ రివార్డును ప్రకటించింది. కేశవరావు ఆచూకీని తెలియజేసిన వారికి రూ.19 లక్షలను ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.  ఈ జాబితాలో ముప్పాళ్ల లక్ష్మణరావు కూడా ఉన్నారు. లక్ష్మణరావు ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ.24 లక్షల  బహుమతిని ప్రకటించింది.

Latest Updates