కోర్టులో ఉండగానే.. కోట్ల ప్రాపర్టీని కొట్టేస్తున్రు

మొన్న మున్సిపల్ జాగా… ఇప్పుడు పీఏసీఎస్​ స్థలం

కోర్టులో కేసు ఉండంగా డీటీసీపీ అప్రూవల్

అక్రమార్కులకు ఆఫీసర్లు, పొలిటికల్​ లీడర్ల అండ?

గద్వాల, వెలుగు: కోర్టులో ఉండంగానే కోట్ల ప్రాపర్టీని కొందరు అక్రమార్కులు అప్పనంగా కొట్టేస్తున్నారు. ఏకంగా 10 కోట్లకు పైగా విలువ చేసే పీఏసీఎస్ ప్రాపర్టీని ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. మొన్న మున్సిపల్ స్థలాన్ని ట్యాక్స్​ కట్టించుకుని కోట్ల ప్రాపర్టీని వదులుకున్న సంఘటన మరువకముందే.. టౌన్ నడిబొడ్డున కృష్ణవేణి చౌరస్తా లో ఉన్న 39 గుంటల సర్కార్ స్థలాన్ని అన్యాక్రాంతం చేసేశారు. ఈ రెండు స్థలాల విలువ దాదాపు 20 కోట్లకు పైగా పలుకుతోంది. కోర్టులో కేసు ఉండంగానే డీటీసీపీ అప్రూవల్ వచ్చిందంటూ గత శనివారం 30 గుంటల పీఏసీఎస్​ జాగాను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

డీటీసీపీ అప్రూవల్​ ఎలా?

గద్వాల నడిబొడ్డున పీఏసీఎస్​కు కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉంది. ప్రస్తుతం స్థలంలో గోదాం, పీఏసీఎస్​ ఆఫీస్ ఉన్నాయి. వెనుక భాగంలో కట్టెల మండితో పాటు మరో సెంటర్​లో షాపులు ఉన్నాయి. ఆ స్థలాన్ని కాజేయాలని చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి కొందరు దానిని ఇటీవల రిజిస్ట్రేషన్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. కొంత కాలంగా పీఏసీఎస్​ స్థలంపై కోర్టులో కేసు నడుస్తోంది. రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్ 688లో 39 గుంటల స్థలం పీఏసీఎస్​ గద్వాల పేరుపై ఉంది. కానీ ఇది తమ స్థలమంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఇంకా కోర్టులో కేసు నడుస్తోంది. అప్పుడే మళ్లీ డీటీసీపీ(డైరెక్టర్​ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) అప్రూవల్ తెప్పించుకొని ఎవరికి తెలియకుండా పీఏసీఎస్​కు  6 గుంటల స్థలాన్ని వదిలి.. మిగతా స్థలాన్ని ఇతర వ్యక్తులపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఆ స్థలంపై డీటీసీపీ అప్రూవల్ ఎలా వచ్చిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తతంగమంతా మున్సిపాల్టీలోనే జరిగిందా?

డీటీపీసీ రావడానికి సూత్రధారులు, పాత్రధారులంతా మున్సిపాలిటీలోనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అప్పటి పీఏసీఎస్​ చైర్మన్ అక్రమార్కులను అడ్డుకొని కోర్టులో కేసు కూడా వేశారు. కానీ మున్సిపాలిటీలోని కొందరు.. ఆర్డీవో ఆఫీస్ లో పనిచేసే ఒక ఆఫీసరు మిలాఖత్ అయ్యి డీటీసీపీ అప్రూవల్ తెప్పించుకొని దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. అక్రమార్కులకు పొలిటికల్​ లీడర్ల  అండ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆఫీసర్ల మౌనంపై అనుమానాలు..

సర్కార్ కు సంబంధించిన కోట్ల ప్రాపర్టీ అన్యాక్రాంతం అవుతున్నా ఆఫీసర్లు మౌనంగా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్​ జాగా కబ్జాపై పేపర్లలో రావడంతో దానిపై విచారణ జరపాలని కిందిస్థాయి ఆఫీసర్లకు ఆదేశాలు అందాయి. ఆ రిపోర్టులను కొందరు ఆఫీసర్లు తొక్కి పెట్టి.. వాస్తవాలకు విరుద్ధంగా రిపోర్ట్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అప్రూవల్ ఉన్నందుకే రిజిస్ట్రేషన్ చేశాం

డీటీసీపీ అప్రూవల్ ఉన్నందు వల్లే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశాం. ఇక్కడ కూడా ఆ స్థలంపై రికార్డుల్లో ఎలాంటి వివాదాలు లేవు. అంతా క్లియర్​గా ఉన్నందుకే  రిజిస్ట్రేషన్ చేశాం. – రాజేశ్​, జిల్లా రిజిస్ట్రార్

కోర్టులో కొట్లాడిన

పీఏసీఎస్​ స్థలంపై కోర్టులో కొట్లాడిన. ఇప్పుడు మళ్లీ రిజిస్ట్రేషన్ అయిందని చెబుతున్నారు. రికార్డులన్నీ వ్యవసాయ సహకార సంఘం గద్వాల పేరు మీదే ఉన్నాయి. – వెంకట్ రెడ్డి, పీఏసీఎస్​ మాజీ చైర్మన్.

మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ యారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ

నడిసొచ్చిన దారిలో నలుగురికి సాయం చేస్తున్నారు

పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం

Latest Updates