ఐదో రోజుకు చేరిన గాంధీ ఆస్పత్రి నర్సుల సమ్మె

హైదరాబాద్: వెట్టి చాకిరీ నుండి విముక్తి కల్పించాలని.. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. గాంధీ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ నర్సుల సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం డ్యూటీకి వచ్చిన వెంటనే  మూకుమ్మడిగా విధులను బహిష్కరించారు. సామాజిక దూరం పాటిస్తూ..  గ్రౌండ్ లో బైఠాయించిన స్టాఫ్ ప్రజాస్వామ్య బద్దంగా నిరసన నినాదాలతో తమ ఆవేదన తెలియజేశారు.

వియ్ వాంట్ జస్టిస్.. శ్రమ దోపిడీ.. నశించాలి.. అవుట్ సోర్సింగ్ నర్సులను వెంటనే పర్మినెంట్ చేయాలి..  అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ నినదించారు. దాదాపు 14 ఏళ్లుగా పనిచేస్తున్నా తమకు ఎలాంటి ఉద్యోగానికి భద్రత కల్పించకపోవడం సమంజసం కాదన్నారు. ప్రాణాంతక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నా.. ఉద్యోగ భద్రత.. కనీస వేతనాలు… కల్పించే ఆలోచన గాని.. ప్రయత్నం గాని చేయడం లేదన్నారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని ఏడేండ్ల నుంచి ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్నామని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తమకు న్యాయం జరుగుతుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశిస్తే.. ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయిందన్నారు.

కరోనా స్టాఫ్ నర్సుల రిక్రూట్‌లో సినియార్టీ లేనివారికి రూ.28వేల రూపాయలు జీతాలుగా చెల్లిస్తూ… 14 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఇప్పటికీ 15వేలే ఇస్తుండడం సరికాదన్నారు. చాలీ చాలని వేతనాలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని.. పులిమీద పుట్రలా కరోనా డ్యూటీ చేస్తున్నామని గుర్తించి ఇంటి ఓనర్లు తమను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోమంటున్నారని కన్నీరు పెట్టుకుని విలపించారు. ఏపీలో మాదిరిగా తమకు కూడా 35 వేల వేతనం ఇచ్చి న్యాయం చేయాలని గాంధీ నర్సులు డిమాండ్ చేశారు.

Latest Updates