సెప్టెంబర్​ 12న గణేశ్ ​నిమజ్జనం

  • ఉత్సవాల ఏర్పాట్లపై  సమీక్ష సమావేశం
  • పారిశుద్ధ్య నిర్వహణకు గణేశ్ ​యాక్షన్​ టీమ్ లు
  • 32 ప్రాంతాల్లో 894 క్రేన్లు ఏర్పాటు
  • మేయర్ బొంతు రామ్మోహన్‌

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్ పరిధిలో జరిగే గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయాలని వివిధ శాఖల అధికారులకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సూచించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మంగళవారం ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్‌, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 12న గణేశ్‌ నిమజ్జనం ఉంటుందని, ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గతం కన్నా అదనపు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ గణేశ్‌ శోభాయాత్ర జరిగే మార్గాలన్నింటిని ముందుగానే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు. పకడ్బందీ పారిశుద్ధ్య నిర్వహణకు గణేష్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్‌, జాతీయ రహదారులు, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు తమ పరిధిలోని రహదారులను మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈసారి 32 ప్రాంతాల్లో 894 క్రేన్‌లను ఏర్పాటు చేయనున్నామన్నారు. వీటితో పాటు స్టాటిక్ క్రేన్‌లు, మొబైల్ క్రేన్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏర్పాట్లపై జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. జలమండలి ఆధ్వర్యంలో 32 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయడంతో పాటు పలు మార్గాల్లో ప్రత్యేక వాటర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

అదనంగా రైళ్లు నడపాలి

హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. నిమజ్జనం రోజున మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ రైళ్లను అదనంగా నడపాలని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లిలలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని కోరనున్నట్టు పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనానికి 56 క్రేన్‌లు ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు. గతేడాది 122 మొబైల్ పోలీసు బృందాలు ఉండగా ఈ సారి 236కు పెంచినట్టు తెలిపారు. శోభాయాత్ర  మార్గాల్లో చెట్ల కొమ్మలు తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారుల్ని కోరారు.

63 చోట్ల స్టాటిక్​ జనరేటర్లు

63 ప్రాంతాల్లో స్టాటిక్ జనరేటర్లను ఏర్పాటు చేయాలని, నిమజ్జనంలో పాల్గొనే ప్రతి వాహనం కండిషన్‌ను ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ధ్రువీకరించాలని అడిషనల్ సీపీ చౌహాన్ పేర్కొన్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూమెట్రో స్టేషన్ల వంతెనల ఎత్తును దృష్టిలో ఉంచుకొని గణేశ్‌ విగ్రహాల ఎత్తును నిర్ధారించాలని పేర్కొన్నారు. తమ పరిధిలోని చెరువుల్లో జరిగే నిమజ్జనానికి అదనపు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సరూర్ నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లోని నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలన్నారు. జోనల్ కమిషనర్లు దాసరి హరిచందన, ముషారఫ్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, మమత, అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, సిక్తా పట్నాయక్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, పోలీసు ఉన్నతాధికారులు ఎల్లేష్ చౌహాన్, విజయ్ కుమార్‌తో పాటు రోడ్లు భవనాల శాఖ, హెచ్ఎండీఏ, ఆర్అండ్‌బీ, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Latest Updates