స్కీమ్ల పేరిట బురిడీ

స్కీమ్​ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న మూఠా గుట్టును  సైబర్​ క్రైమ్​ పోలీసులు రట్టుచేశారు.  మూఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు. సైబర్​ క్రైమ్​ పోలీసుల తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.   మేడ్చల్​  ప్రాంతానికి చెందిన శివరామకృష్ణ ప్రైవేటు ఉద్యోగి. మూడు నెలల క్రితం  ఒక ఫోన్​ రిసీవ్​ చేసుకున్నాడు. అవతలి వ్యక్తి తన పేరు  వివేక్​ అగర్వాల్​అని గణేశ్​​ ట్రేడర్స్​ కంపెనీలో సీనియర్​ ఎగ్జిగ్యూటివ్​  ఇన్వెస్ట్​మెంట్​ అడ్వైజర్​గా పనిచేస్తున్నాను అంటూ పరిచయం చేసుకున్నాడు.   దీపావళి పండుగ సందర్భంగా కొత్త స్కీమ్​ స్టార్ట్​ చేశామని దానికి సంబంధించి info@ganeshtraders.co.in  మెయిల్​ను  శివరామకృష్ణకు పంపించారు. ఈ స్కీమ్​లో బంగారంపై  పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని   శివరామకృష్ణను   నమ్మించాడు. ఆ తర్వాత వివేక్​ తమ కంపెనీలో బంగారం స్కీమ్​పై రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే పెట్టిన డబ్బుకు రూ. 27లక్షల తిరిగి 45 రోజుల్లో మీకు చెల్లిస్తామని నమ్మబలికాడు.  వివేక్​ మాటలు నమ్మిన రామకృష్ణ రూ. 10,11,111లు  గణేష్​ ట్రేడర్స్  పేరిట బ్యాంకులో  డబ్బులు చెల్లించాడు. 45 రోజులు గడిచిన కూడా తనకు డబ్బులు రాక ఎన్నిసార్లు ఫోన్​ చేసిన  స్విచ్ఛాఫ్​ రావడంతో తాను మోసాపోయానని గ్రహించి సైబర్​ క్రైమ్​ పోలీసులను అశ్రయించాడు. తానను బంగారంపై పెట్టుబడులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న సైబర్​ క్రైమ్​ సీఐ రామయ్య దర్యాప్తును ప్రారంభించాడు.

బ్యాంక్​వివరాల అధారంగా దొరికిన నిందితులు..

శివరామకృష్ణ నిందితులకు  బ్యాంకు ద్వారా చెల్లించిన డబ్బుల అధారంగా సైబర్​ క్రైమ్స్​ పోలీసులు దర్యాప్తును చేపట్టారు. బ్యాంక్​ వివరాలు, సెల్​ఫోన్​ అధారంగా నిందితులు  గుజరాత్​లోనిఅహ్మదాబాద్​కు చెందిన వారిగా గుర్తించి అక్కడికి వెళ్లి  గుజరాత్​ పోలీసుల సహకారంతో ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు.

గ్రూప్​గా ఏర్పడి  మోసాలు..

అహ్మదాబాద్​లోని  మిగానినగర్ జీహెచ్​బీసీ కాలనీకి చెందిన  నాగరాజు(35) ప్రొప్రైటర్​గా, అదే ప్రాంతానికి చెందిన రవికుమార్​(30), తరుణ్​(36) మేనేజర్లుగా ఓ ఫేక్​ కంపెనీ పేరుతో ముగ్గురు కలిసి గ్రూప్​గా ఏర్పడి పెట్టుబడి సలహాదారుల పేరిట ప్రజలను మోసం చేయడం ప్రారంభించారు.  గతంలో వీరిని గుజరాత్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

స్కీమ్​లను  నమ్మకండి..

తమ కంపెనీలో బంగారం, ఇతర స్కీమ్​లపై పెట్టుబడి పెట్టండి మీరు పెట్టిన డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇస్తాం అంటూ ఫోన్​లు చేస్తే వెంటనే నమ్మి మోసపోవద్దని సైబర్​ క్రైమ్​ పోలీసులు  తెలిపారు. ఇలా ఫోన్​ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కేసు దర్యాప్తులో సీఐలు రామయ్య, కె. శ్రీనివాస్​,  ఎస్​ఐ విజయ్​వర్ధన్​, సిబ్బంది కీలకంగా వ్యవహరించారు.