టెన్షన్..టెన్షన్..మరోసారి గ్యాస్ లీక్ తో రోడ్లపైకి జనం

విశాఖపట్నం, వెలుగువైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ గ్యాస్ లీకేజీ పరిసర ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గురువారం రాత్రి మరోసారి గ్యాస్ లీకవడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీ  పేలిపోతుందనే ప్రచారంతో సిటీ వైపు పరుగులు తీశారు. ఎప్పుడేం జరుగుతోందనే  టెన్షన్ నెలకొంది. బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్ ఇతర ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చారు. సింహాచలం మీదుగా పైనాపిల్ కాలనీ, సెంట్రల్ జైల్ రోడ్డు, హనుమంతవాక రోడ్లు, కంచరపాలెం హైవే జనంతో నిండిపోయాయి.  గ్యాస్ లీకేజీ ప్రభావం 2 కి.మీ. కంటే తక్కువ పరిధిలో మాత్రమే ఉంటుందని, ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తరలించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. అయినా ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబసభ్యులతో కలిసి ఆర్కే బీచ్ కు చేరుకున్నారు. దీంతో బీచ్ రోడ్లు రద్దీగా మారాయి.  రాత్రంతా  బీచ్ పేవ్ మెంట్లపైనే భయాందోళనతో గడిపారు.

లీక్ కట్టడి చేసిన ఎక్స్ పర్ట్స్

ఎల్జీ పాలిమర్స్ లో లీకైన స్టైరిన్ కెమికల్ అదుపులోకి వచ్చింది. ముంబై, పుణె నుంచి వచ్చిన ఎక్స్ పర్ట్స్..  తమ వెంట తెచ్చిన కెమికల్ ను ఉపయోగించి లీక్ ను అరికట్టారు. మరో 48 గంటలపాటు గ్యాస్ లీకేజీ ప్రభావం ఉంటుందని, అప్పటివరకు గ్రామాల్లోకి ప్రజలను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం కేజీహెచ్ లో మరో వ్యక్తి చనిపోవడంతో మృతుల సంఖ్య 12కు చేరింది. 454 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలు, బాధితులకు ఏపీ సర్కారు రూ.30 కోట్ల ఎక్స్ గ్రేషియా రిలీజ్ చేసింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్ పై ఉన్నవారికి 10 లక్షలు, 2, 3 రోజులు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నవారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స తర్వాత వెళ్లిన వారికి 25 వేలు పరిహారం ఇస్తామని జీవోలో పేర్కొంది.

ఎన్జీటీ నోటీసులు

గ్యాస్ లీకేజీ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రాణ నష్టంపై ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వెంటనే రూ.50 కోట్లు జమ చేయాలని ఎల్జీ పాలిమర్స్ ను ఆదేశించింది. ఈ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ఎల్జీ పాలిమర్స్, సెంట్రల్, స్టేట్  పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు నోటీసులు ఇచ్చింది. ఘటనపై విచారణకు జస్టిస్ బి.శేషశయనారెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ నెల 18 లోపు రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.

హైపవర్ కమిటీ

కెమికల్ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ సర్కారు హైపవర్ కమిటీ వేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌‌కుమార్ ప్రసాద్ చైర్మన్ గా, ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌‌లతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నెలరోజుల్లో నివేదిక ఇవ్వనుంది.

జగన్ రివ్యూ

దుర్ఘటనపై సీఎం జగన్ శుక్రవారం రివ్యూ చేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా కంట్రోల్ లో ఉందని అధికారులు వివరించారు. ట్యాంకర్‌‌లోని  60శాతం కెమికల్ పాలిమరైజ్‌‌ అయ్యిందని, మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్‌‌ అవుతుందన్నారు.  దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పినట్లు తెలిపారు. జనావాసాల మధ్య ఉన్న ఫ్యాక్టరీలను గుర్తించి,  మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.

మానవ తప్పిదం వల్లే ప్రమాదం: కన్నా

వైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ ను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం సందర్శించారు. మానవ తప్పిదం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  మృతుల కుటుంబాలకు సీఎం జగన్ రూ.కోటి పరిహారం ప్రకటించడాన్ని స్వాగతించారు.

Latest Updates