జీతాల్లో కోత విధించాలనే హక్కు మల్హోత్రాకు లేదు: గవాస్కర్

క్రికెటర్లు తమ జీతాల్లో కోత విధించుకుంటే బాగుంటుందని ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) ప్రెసిడెంట్ అశోక్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలపై లెజెండ్ బ్యాట్స్ ‌మన్‌ ‌సునీల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అలా చెప్పే అధికారం నీకు ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నించాడు. ‘మల్హోత్రా బీసీసీఐకి మంచి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. కానీ ప్లేయర్స్ జీతాల్లో కోత విధించాలని అడిగే హక్కు అతనికి ఎవరు ఇచ్చారు? ప్రస్తుత టీమిండియా, ఫస్ట్‌‌ క్లాస్‌‌ క్రికెటర్లు.. ఈ ఐసీఏలో సభ్యులుగా లేరు. అలాంటప్పుడు క్రికెటర్ల గురించి ఆయన మాట్లాడకూడదు. అతని జేబుకు చిల్లు పడనంతవరకు ఇతరుల జీతాల్లో కోత గురించి మాట్లాడటం చాలా తేలిక. పరిస్థితి తనదాకా వస్తే కానీ అసలు కథ తెలియదు. ఈ విషయంలో ఎవరు.. ఎవర్నీ అడగాల్సిన పనిలేదు. నచ్చిన వాళ్లు కచ్చితంగా ఏదో రకంగా సాయం చేస్తూనే ఉంటారు’ అని సన్నీ వ్యాఖ్యానించాడు. మరోవైపు కరోనా క్రైసిస్ పెరుగుతున్నా.. ఇప్పటి వరకు ఆటగాళ్ల జీతంలో కత్తిరింపుల విషయంపై చర్చించలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించాడు. ‘కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజలందర్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటాం . పరిస్థితులు చక్కబడిన తర్వాతే ప్లేయర జీతాల కోత విషయంపై చర్చిస్తాం. ప్రస్తుతానికైతే బీసీసీఐకి పెద్దగా ఇబ్బంది లేకపోయినా. .. లాక్‌‌డౌన్‌‌ కొనసాగితే ఏంటనే దానిపై దృష్టిపెట్టాల్సి ఉంది’ అని ధుమాల్ వ్యాఖ్యానించాడు.

Latest Updates