లాక్ డౌన్ ఎత్తేయాలంటూ జర్మనీలో రగడ

బెర్లిన్​:  కరోనా వైరస్​ను కంట్రోల్​లో పెట్టేందుకు ప్రపంచమంతా లాక్​డౌన్​ పెట్టింది. కానీ, కొన్ని దేశాల్లో ఆ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికాలో ఇప్పటికే జనాలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. లాక్​డౌన్​ను ఎత్తేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఆ రచ్చ జర్మనీకీ పాకాయి. నిజానికి దేశంలో లాక్​డౌన్​ రూల్స్​ను సర్కార్‌ కొంచెం సడలించింది. దీంతో మళ్లీ కేసులు పెరిగాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్​డౌన్​ను ఎత్తేయబోమంటూ కరాఖండిగా ప్రకటించాయి. ఆ నిర్ణయంతో దేశ రాజధాని బెర్లిన్​లో జనాలు రోడ్లపైకి వచ్చేశారు. 50 మంది కన్నా ఎక్కువ గుమిగూడొద్దన్న రూల్స్​ను పట్టించుకోలేదు. హల్​చల్​ చేశారు. బెర్లిన్​లోని అలెగ్జాండర్​ప్లాజ్​లో ఆందోళనలకు దిగారు. ప్రభుత్వ ఆఫీసులపైకి బాటిళ్లు విసిరారు. ‘‘మేం మనుషులం. మాకు స్వేచ్ఛ కావాలి’’ అంటూ నినాదాలు చేశారు. 86 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బెర్లిన్​లోనే కాదు.. మ్యూనిక్, స్టట్​గార్ట్​లలోనూ వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు.

రష్యాలో రికార్డ్​

రష్యాలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మొత్తం 1,915 మంది చనిపోయారు. కేసుల విషయంలో రష్యా ఐదో స్థానానికి వచ్చింది. టెస్టులు ఎక్కువగా చేస్తుండడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని అధికారులు చెప్పారు. మొత్తం కేసులు, మరణాల్లో సగానికిపైగా రాజధాని మాస్కోలోనే నమోదయ్యాయి. ఫ్రాన్స్​లో ఉన్న 50,500 ప్రీస్కూళ్లు, ఎలిమెంటరీ స్కూళ్లను ఈ నెల 18 నుంచి తెరిచేందుకు గవర్నమెంట్​ పచ్చ జెండా ఊపేసింది. అయితే, ప్రీస్కూల్​కైతే ఒక్కో క్లాసులో 10 మంది, అంతకుపైన క్లాసుల్లో 15 మంది స్టూడెంట్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే, తల్లిదండ్రులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు.

జపాన్​లో కరోనా పేషెంట్లపై వివక్ష

కరోనా బారిన పడిన వారిపై జపాన్​లో వివక్ష, బెదిరింపులు పెరిగిపోయాయి. వాళ్లందరినీ సమాజం నుంచి బహిష్కరిస్తున్నారు. ఒక్క పేషెంట్లే కాదు, వాళ్ల ఫ్యామిలీలు, కరోనా పేషెంట్లను ట్రీట్​ చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్​ సిబ్బందికీ అదే అనుభవం ఎదురవుతోంది. దీనిపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనం మారట్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, కరోనా పేషెంట్లు నేరగాళ్లు అన్నట్టు సోషల్​ మీడియాలో తప్పుడు వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు
వినిపిస్తున్నాయి.

ప్రపంచం కేసులు 41.52 లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతటా 41,52,784 మంది కరోనా బారిన పడ్డారు. 2,82,658 మంది చనిపోయారు. 14,65,262 మంది కోలుకున్నారు. 24,04,864 మంది ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. కేసులు 2 లక్షలు దాటిన దేశాల జాబితాలోకి రష్యా చేరింది.

ఆఫ్రికాలో చాప కింద నీరులా

ఆఫ్రికాలో కరోనా కేసులు చాపకింద నీరులా పాకిపోతున్నాయి. మొన్నటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాని చిన్న దేశం లెసోతోలో ఫస్ట్​ టైం కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా సీడీసీ లెక్కల ప్రకారం ఆఫ్రికాలోని 54 దేశాలకు వైరస్​ పాకింది. లిస్టులో 9,400 కేసులతో సౌత్​ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది. ఆఫ్రికా మొత్తం 60 వేలకుపైనే కేసులు నమోదయ్యాయి. టెస్ట్​ కిట్ల షార్టేజీ వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, టెస్టులు చేస్తే మరిన్ని కేసులు పెరిగే చాన్స్​ ఉందని అధికారులు చెబుతున్నారు.

Latest Updates