గుళ్లో ప్రసాదంగా చికెన్, మటన్ బిర్యాని

సాధారణంగా భక్తులెవరైనా గుడికి ప్రసాదంగా పులిహోర, లడ్డూ, చెక్కర పొంగలి, అటుకులు ఇలా కొన్ని రకాల పదార్ధాలు పెడతారు. కానీ తమిళనాడు రాష్ట్రంలోని ఓ గుడిలో మాత్రం ఏకంగా 5స్టార్ హోటల్లో పెట్టినట్టుగా చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని ప్రసాదంగా ఇస్తారు.  మధురైలోని మునియాండి స్వామి గుడిలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆలయంలో దాదాపుగా 84 సంవత్సరాల నుంచి పాటిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా రెండు రోజుల పాటు ఇలా చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని ప్రసాదాన్ని ఇవ్వడం ఆ గుడి ఆచారం అని చెబుతున్నారు. ప్రతి ఏటా జనవరి 24 నుంచి 26 వరకు ఆలయ వార్షికోత్సవాన్నినిర్వహిస్తారని, ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు బిర్యానిని ప్రసాదంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని వారు తెలిపారు.

ఈ ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే 150 మేకలు, 300 కోళ్లతో బిర్యానిని తయారు చేసి ప్రసాదంగా ఇస్తున్నామని తెలిపారు. అంతే కాదు ఈ ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో భుజించే సౌకర్యం కల్పించడమే కాకుండా భక్తులు ఇంటికి పార్సల్ ని తీసుకెళ్లే అవకాశాన్ని కూడా ఆలయ కమిటీ కల్పిస్తుంది. బిర్యాని ప్రసాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున  ఆలయానికి వస్తారని, విరాళాలు కూడా భారీగానే అందిస్తున్నారని కమిటీ సభ్యులు చెబుతున్నారు.

get-delicious-mutton-biryani-as-prasadam-in-this-tamil-nadu-temple

Latest Updates