మీరే కొత్త చీఫ్‌ను కనుగొనండి: సోనియా గాంధీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో నాయకత్వాన్ని మార్చాలని కోరుతూ అధినేత్రి సోనియా గాంధీకి పార్టీ సీనియర్ నేతలు లేఖ పంపిన సంగతి తెలిసిందే. ఈ లేఖలోని అంశాలపై ఆదివారం నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించారు. ఈ లెటర్‌‌పై సోనియా స్పందించారు. లేఖ రాసిన నేతలు కలసి సమష్టిగా పార్టీ కొత్త చీఫ్‌ను కనుగొనాలని సోనియా చెప్పినట్లు తెలుస్తోంది. ఇకముందు పార్టీ బాధ్యతలను మోయడానికి తాను సిద్ధంగా లేనందున కొత్త నేతను కనుగొనాలని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.

కొత్త చీఫ్‌ను త్వరలోనే ఎంచుకుంటామనే షరతుపైనే తాత్కాలికంగా తాను బాధ్యతలు చేపట్టిన విషయాన్ని ఆయా నేతలకు ఆమె గుర్తు చేసినట్లు తెలిసింది. పార్టీకి కొత్త చీఫ్‌ గాంధీయేతర వ్యక్తి అయి ఉండాలని కాంగ్రెస్ మాజీ చీఫ్‌ రాహుల్ గాంధీ చెప్పిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యకు ప్రియాంక కూడా మద్దతు తెలిపారు. సీనియర్‌‌ నేతలు, ఎంపీలు పార్టీ లీడర్‌‌షిప్‌ను మార్చాలని సోనియాకు లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ చీఫ్‌ పదవికి సోనియా రాజీనామా చేస్తే కొత్త చీఫ్​ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Latest Updates