పెట్స్​తో ఫొటోలు మంచిదికాదంట!

సోషల్ స్టేటస్‌‌తో సంబంధం లేకుండా జంతువుల్ని పెంచుతున్న రోజులివి.  కొందరు వాటిని అల్లారు ముద్దుగా చూసుకుంటారు.  అవి చూపించే ప్రేమ, విశ్వాసం.. మనసుకి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి.   అయితే ‘పెట్‌‌’ ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాని తాకింది. వాటితో సెల్ఫీలు దిగడం,  ఫన్నీ ఫొటోలు.. వీడియోలు తీసి ఇంటర్నెట్‌‌లో అప్‌‌లోడ్ చేయడం చేస్తున్నారు చాలామంది. కమర్షియల్‌‌గా కొందరికి ఇదొక క్రేజీ  ఇన్‌‌కమ్‌‌సోర్స్‌‌గా మారింది . కానీ, ఇది ఎంతమాత్రం సరదా వ్యవహారం కాదని రీసెర్చర్లు చెప్తున్నారు.

ఏదో ఒక స్టేజీలో లోన్లీనెస్‌‌ మనిషిని వెంటాడుతుంది. ఆ టైంలో పెట్స్‌‌ మనిషికి నేస్తాలు.  రోజులో కొంచెంసేపైనా వాటితో  గడిపితే ఒత్తిడి, ఆందోళనలు తగ్గి హేపీగా ఉండొచ్చు. మరోవైపు బీపీ, కొలెస్టరాల్‌‌ తగ్గుతాయని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. అలాంటప్పుడు ఫొటోలు, వీడియోలతో యానిమల్స్‌‌ని సోషలైజ్‌‌ చేయడం మంచిది కాదని ప్రిమటాలజిస్ట్‌‌ జేన్‌‌ గుడ్‌‌ఆల్‌‌ చెబుతోంది.  దీనివల్ల వాటి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు రావడం ప్రాక్టికల్‌‌గా రుజువైందని ఆమె అంటోంది.  ఇందుకు ఉదాహరణగా సెలబ్రిటీ చింపాంజీ ‘లింబాని’ని ఉదాహరణగా చూపెడుతోంది జేన్‌‌.  లింబాని చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది. సందర్శకులతో సరదాగా ఫొటోలకు ఫోజులిస్తుంది. గిటార్ వాయిస్తుంది.  బనానా కాస్టూమ్స్‌‌తో ఎంటర్‌‌టైన్‌‌ చేస్తుంది. అందుకే ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో లింబానికి ఆరున్నర లక్షల మంది ఫాలోయర్స్‌‌ ఉన్నారు. కానీ, ఆ చింపాజీ చిరునవ్వుల వెనుక ఎంతో నరకం ఉందంటోంది జేన్‌‌.

ట్రైనింగ్‌‌ కాదు.. టార్చర్‌‌!

మియామిలోని జూలాజికల్‌‌ వైల్డ్‌‌లైఫ్ ఫౌండేషన్‌‌ నిర్వాహకులు లింబానిని చూసుకుంటున్నారు. దాని చురుకుదనం  గమనించిన నిర్వాహకులు ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్ ఓపెన్‌‌చేసి రోజూ వీడియోలు అప్‌‌లోడ్ చేస్తున్నారు.  అలా అది పాపులర్‌‌ అయ్యింది. జూకి వచ్చే సందర్శకులు లింబానితో పదినిమిషాలు గడపాలంటే ఏడువందల డాలర్లు చెల్లించాలి.  కానీ, దాని వీడియోలు..  ఈ ఫాలోయింగ్‌‌ మాటేమోగానీ ఇప్పుడది ఒంటరయ్యింది. అప్పుడప్పుడు కంట్రోల్‌‌ తప్పి పిచ్చిగా బిహేవ్‌‌ చేస్తోందని జూ నిర్వాహకులే చెప్తున్నారు. లింబాని విషయంలోనే కాదు.. పెట్స్‌‌తో సహా ప్రతీ జంతువు విషయంలోనూ అంతే.  వాటిని అనుకోకుండా క్యాప్చర్ చేయడం ఫర్వాలేదు. కానీ, కావాలని ఆ పని చేస్తే అవి అగ్రెసివ్‌‌గా తయారవుతాయి. ఈ విషయాన్నే జేన్‌‌ ప్రస్తావిస్తోంది.  ‘జంతువులు వాటి తల్లుల నుంచి డిసిప్లీన్‌‌ నేర్చుకుంటాయి. కానీ, ట్రైనింగ్‌‌ ఇచ్చి వాటి సహజ గుణాన్ని మార్చాలని ప్రయత్నించడం కరెక్ట్‌‌ కాదు.  ఉదాహరణకు కుక్కకి మనుషుల బట్టలు తొడిగి రకరకాల ఫీట్స్‌‌ చేయిస్తుంటారు కొందరు. ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్‌‌ ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు.  అలాంటి టైంలో అవి ఎగిరి గంతులేసేది సంతోషంతో కాదు.. కొడతారనే భయంతో.  ఈ పని వాటి మానసిక  స్థితిపై ప్రభావం చూపెడుతుంది. ఒకానొక స్టేజీలో వాటి సహనం నశిస్తుంది.  అప్పుడు జరగరాని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంద’ని జేన్‌‌ హెచ్చరిస్తోంది.

వాటికే ఎక్కువ డ్యామేజ్‌‌

ఫేస్‌‌బుక్‌‌, ట్విట్టర్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌.. ఇలా సోషల్‌‌ మీడియాలో ఏ ప్లాట్‌‌ఫామ్ చూసుకున్నా పెట్స్‌‌  కోసం సెపరేట్‌‌ పేజీలు కనిపిస్తుంటాయి. ఏ పేజీ తిరగేసిన ప్రతీ అప్‌‌డేట్‌‌కి వేల నుంచి లక్షల్లో వ్యూస్‌‌ ఉంటాయి.  యూట్యూబ్‌‌లో ఫుడ్‌‌, మ్యూజిక్‌‌ తర్వాత యానిమల్‌‌ సంబంధిత వీడియోలకే ఎక్కువ వ్యూయర్‌‌షిప్‌‌ ఉంటోంది. బ్లూపర్స్‌‌, ఫన్నీ వీడియోస్‌‌ రకరకాల కేటగిరీలో అవి వైరల్ అవుతుంటాయి. ఆఖరికి పెట్స్‌‌తో టిక్‌‌టాక్‌‌ వీడియోలు చేసే రేంజ్‌‌కి చేరుకుంది పరిస్థితి.  వీటికి తోడు కొందరు ‘యానిమల్ అబ్యూజింగ్‌‌’ వీడియోల్ని సెపరేట్‌‌గా స్ప్రెడ్‌‌ చేస్తుంటారు. వీటి వల్ల వాటికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా మనుషులకు మల్లే అవి కూడా ఒత్తిళ్లకు లోనవుతున్నాయంటోంది జేన్‌‌.  అదే టైంలో వైల్డ్‌‌ లైఫ్‌‌కి ఇదొక ప్రమాదంగా మారుతోందని ఆమె చెబుతోంది.  యూట్యూబర్స్‌‌, వ్లోగర్స్‌‌, టూరిస్టులు, వైల్డ్‌‌ లైఫ్‌‌ డాక్యుమెంటరీ మేకర్స్‌‌ తమకు తెలియకుండానే తప్పులు చేస్తున్నారు. వాళ్లు తీసే ఫొటోలు, వీడియోల ద్వారా వాటి ఉనికి అందరికీ తెలిసిపోతోంది.  లొకేషన్‌‌ ట్యాగ్ ద్వారా జంతువుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అదే టైంలో కొన్ని వన్యప్రాణుల్ని పెంపుడు జంతువులుగా మార్చేస్తున్నారు. దీంతో సహజవనరుల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని.. ఈ పరిస్థితి మారాలని కోరుకుంటోంది జేన్‌‌. అదే టైంలో యానిమల్ లవర్స్ కూడా ఫొటోలు, వీడియోల పేరుతో వాటిని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తోంది.

తగ్గించే పనిలో..

ఒకపక్క ఆన్‌‌లైన్‌‌లో జంతువుల అమ్మకంతో పాటు వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్​అమ్మడంపై  అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. విమర్శల నేపథ్యంలో సోషల్‌‌ మీడియా కంపెనీలు ‘వైల్డ్‌‌లైఫ్‌‌ కంటెంట్‌‌’ని మెల్లిగా తగ్గిస్తూ వస్తున్నాయి. ఫేస్‌‌బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లు తమ ప్లాట్‌‌ఫామ్‌‌ల్లో జంతువుల అమ్మకాల్ని ఇప్పటికే నిషేధించాయి. ‘సెల్ఫీ’ పేరుతో మొక్కలకి, జంతువులకి హాని చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాయి.
మరోపక్క ‘యానిమల్‌‌ క్రూయల్టీ’ కంటెంట్‌‌ని పోస్ట్ చేయొద్దని యూజర్లను ఎప్పటికప్పుడు కోరుతున్నాయి.  కానీ, ఇది సరిపోవడం లేదన్నది డిజిటల్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ అభిప్రాయం. ఆర్టిఫియల్‌‌ ఇంటెలిజెన్సీ ద్వారా యానిమల్ రిలేటెడ్ కంటెంట్‌‌ను సోషల్ మీడియాకు దూరం చేయాలన్న వాళ్ల డిమాండ్‌‌కి స్ట్రాంగ్ సపోర్ట్ లభిస్తోంది.

 

Latest Updates