నేనే…కాదు నేనే.. ప్రెసిడెంట్లుగా ఇద్దరూ ప్రమాణం

  • ఆఫ్గాన్​లో ప్రకటించుకున్న ఇద్దరు నేతలు
  • ఒకేరోజు, ఒకే ప్రాంతంలో, ఒకే టైమ్​లో.. వేర్వేరుగా
  • ప్రమాణం చేసిన ఆష్రఫ్ ఘనీ, అబ్దుల్లా

ఆఫ్గానిస్తాన్.. కొన్నేళ్లుగా అశాంతితో రగిలిపోతున్న దేశం. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు. ఎటు నుంచి తుపాకీ తూటా దూసుకువస్తుందో తెలియదు. ప్రతి క్షణం భయం భయం.. పరిస్థితి ఎప్పుడూ నివురు గప్పిన నిప్పులా ఉంటుందక్కడ. కానీ చిన్న ఆశ చిగురించింది. ఎడారిలో నీటి చెలిమెలా ఈ మధ్యే శాంతి ఒప్పందం కుదురింది. ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఇంతలో.. ఉన్నట్టుండి అలజడి రేగింది.

మొన్నటి వరకు వారిద్దరూ సహచరులు.. ఆఫ్గాన్ ప్రభుత్వంలో కీలకనేతలు. ఒకరు ప్రెసిడెంట్ అయితే.. మరొకరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో).. కానీ ఎన్నికల్లో విడిపోయారు. రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. ఒకరు గెలిచారు.. ఒకరు ఓడారు.. కానీ తన ఓటమిని, ఆయన గెలుపును ఒప్పుకోలేదు ఆ సీఈవో. తనపై వచ్చిన ఆరోపణలను పట్టించుకోలేదు ప్రెసిడెంట్. ఈ క్రమంలో ఇద్దరూ ఒకేరోజు.. ఒకే చోట.. ఒకే సమయంలో ప్రమాణస్వీకారం చేశారు.. ‘నేనే ప్రెసిడెంట్’ అని ఇద్దరూ ఎవరికి వారే ప్రకటించుకున్నారు.

బాంబులు, తుపాకులతో మోతతో తల్లడిల్లే ఆఫ్గనిస్తాన్​లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శాంతి దిశగా సాగుతున్న దేశంలో పొలిటికల్ బ్రేక్ పడింది. సోమవారం ఒకేసారి ఇద్దరు నేతలు ‘ప్రెసిడెంట్’​గా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో సారి ప్రెసిడెంట్​గా ఆష్రఫ్ ఘనీ బాధ్యతలు చేపట్టగా.. మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా అబ్దుల్లా కూడా ప్రెసిడెంట్​గా ప్రమాణం చేశారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. తాలిబన్లతో శాంతి చర్చలకు అడ్డుకట్ట పడినట్లయింది. వీరు ప్రమాణం చేస్తున్న ప్రాంతంలో రెండు బాంబులు పేలాయి. పరిస్థితి ఇలానే ఉంటే హింసకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఒకోచోట వేర్వేరుగా..

రెండు కార్యక్రమాలను ఒకే సమయంలో ఒకేచోట వేర్వేరుగా నిర్వహించారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ పరిధిలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారాలకు భారీగా జనం తరలివచ్చారు.

సెప్టెంబర్​లోనే ఎన్నికలు

గత సెప్టెంబర్​లో ఆఫ్గనిస్తాన్​లో ఎన్నికలు జరిగాయి. ప్రెసిడెంట్ ఆష్రఫ్ ఘనీ విజయం సాధించారని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అయితే ఘనీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి బయటికొచ్చిన మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా మాత్రం.. ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎలక్షన్ కంప్లెయింట్స్ కమిషన్ కూడా ఇదే ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ఇద్దరు నేతలు తామే గెలిచామని ప్రకటించుకున్నారు. మరోవైపు ఈ ఇద్దరికీ ఆఫ్గాన్ కీలకమైన వార్ లార్డ్స్ (సైనిక నాయకులు) సపోర్టు ఉంది. ప్రెసిడెంట్​కు వార్ లార్డ్స్ మద్దతు తప్పనిసరి.

మధ్యలో ఖలీల్​జాద్..

ఘనీ, అబ్దుల్లా మధ్య అమెరికా పీస్ ఎన్వాయ్ జల్మేయ్ ఖలీల్​జాద్ ఇరుక్కుపోయారు. ప్రమాణస్వీకారాలను ఆపేందుకు చివరి నిమిషంలో ‘షటిల్ డిప్లమసీ’ చేసినా.. ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ‘‘ప్రమాణస్వీకారాలను మూడు రోజులపాటు నిలిపేయాలని ఇద్దరు నేతలను ఖలీల్​జాద్ కోరారు. అందుకు అబ్దుల్లా అంగీకారం తెలిపారు. అయితే తనతోపాటు ఘనీ కూడా కార్యక్రమాన్ని వాయిదా వేయాలని, లేకుంటే తమ ప్రోగ్రామ్ కొనసాగుతుందని అబ్దుల్లా తేల్చి చెప్పారు’’ అని అబ్దుల్లా టీమ్​లోని సీనియర్ సభ్యుడు బాసిర్ సలాంగి చెప్పారు.

ఏంటీ శాంతి ఒప్పందం

ఆఫ్గనిస్తాన్​లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా ఆఫ్గాన్​లోని అమెరికన్​ బలగాలను వాపస్​ తీసుకునేందుకు అంగీకరించింది. ఆల్​ఖైదాతో ఎలాంటి సంబంధాలు నెరపొద్దనే కండీషన్​తో డీల్​కు ఒప్పుకుంది. 18 ఏళ్లుగా సాగుతున్న సంక్షోభానికి ముగింపు పలుకుతామని అమెరికా చెప్పింది. శాంతి ఒప్పందంపై తాలిబన్, అమెరికా ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇందులో భాగం గా అఫ్గాన్​లోని తమ బలగాల్లో 8,600 మందిని 135 రోజుల్లో అమెరికా వెనక్కి రప్పిస్తుంది. ఈ క్రమంలో ఆఫ్గాన్ భవిష్యత్​పై రోడ్ మ్యాప్ రూపొందించేందుకు టాప్ నేతలు మంగళవారం ఓస్లోలో చర్చలు జరపాలని నిర్ణయించారు. కానీ తాజా పరిణామాలతో పరిస్థితి చేయిదాటిపోయేలా కనిపిస్తోంది.

రెండు బాంబు పేలుళ్లు

ఘనీ, ఆష్రఫ్ ప్రమాణస్వీకారం సమయంలో రెండు బాంబులు పేలాయి. వందలాది మంది హాజరైన ఈ కార్యక్రమంలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో అందరూ పరుగులు తీశారు. ‘‘నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా వేసుకోలేదు. నా తల తెగి పడుతుందని చెప్పినా సరే.. నేను సిద్ధమే’’ అని ఘనీ అన్నారు. సైరన్ల మధ్యనే ఆయన మాట్లాడారు.

ఆష్రఫ్ ఘనీ ఇలా..

ప్రెసిడెన్షియల్ ప్యాలెస్​లో ఆష్రఫ్ ఘనీ తొలుత ప్రమాణం చేశారు.

‘‘ఇస్లాం మతాన్ని రక్షిస్తాను. రాజ్యాంగ అమలును గౌరవిస్తాను. పర్యవేక్షిస్తాను అని దేవుని మీద ప్రమాణం చేస్తున్నా’’ అని మాజీ ప్రెసిడెంట్‌ అష్రఫ్‌ ఘనీ ప్రతిజ్ఞ చేశారు.

ఘనీకి అంతర్జాతీయ మద్దతు ఉంది. దీంతో ప్రోగ్రామ్​కు అమెరికా పీస్ ఎన్వాయ్ జల్మేయ్ ఖలీల్​ జాద్, ఆఫ్గాన్​లోని యూఎస్ ఫోర్సెస్​ హెడ్ జనరల్ ఆస్టిన్ ఎస్.మిల్లర్, ఇతర విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రభుత్వ టీవీలో ఘనీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమైంది.

అబ్దుల్లా ఇలా..

ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ పక్కనే ఉన్న సాపెదార్ ప్యాలెస్​లో అబ్దుల్లా ప్రమాణం చేశారు.

ఆఫ్గాన్ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమాధికా రాన్ని, టెర్రిటోరియల్ ఇంటెగ్రిటీని కాపాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

అబ్దుల్లా కార్యక్రమానికి వచ్చిన వారిలో ‘జిహాదీ’ కమాండర్లు ఉన్నారు.
2001లో తాలిబాన్లను పడగొట్టడానికి అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలతో వీరు పొత్తు పెట్టుకున్నారు. 1990ల్లో జరిగిన క్రూరమైన సివిల్ వార్​లో కూడా ఈ జిహాదీ కమాండర్లు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ టీవీలో ప్రత్యక్ష ప్రసారమైంది.

దేశానికి మంచిది కాదు

మా ఖైదీలను విడుదల చేయాలని కోరుకుతున్నాం. మేం బందీలుగా చేసుకున్న వారిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో ఆలస్యం జరకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ లేట్ అయినా మేము శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటాం. అయితే ప్రెసిడెంట్లుగా ఇద్దరు ప్రమాణం చేయడం ఆఫ్గాన్ జాతికి మంచిది కాదు.

 – తాలిబన్ స్పోక్స్ పర్సన్ జబీహుల్లా ముజాహిద్

Latest Updates