GHMCకి కేటీఆర్ ఆదేశం : వర్షాకాలంలో రోడ్లన్నీ బాగుండేలా చర్యలు తీసుకోవాలి

KTRసిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల జాప్యంపై GHMC అధికారులపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. సిటీరోడ్ల మరమతులు, నాలాల పూడికతీత పనుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మంగళవారం (జూన్-12) GHMC ఆఫీసులో కేటీఆర్ రివ్యూ చేశారు. నాలాల పూడికతీత పనుల డెడ్ లైన్ మార్చి నాటికే విధించినా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో అధికారులపై మంత్రి మండిపడ్డారు.

సిటీలో వర్షాకాలం ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాకాలం చేయాల్సిన పనులను ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంపై మంత్రి కేటీఆర్… జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డారు. నాలాల పూడికతీత పనులు పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మార్చి కల్లా కావాల్సిన పనులు ఇంకా పెండింగ్ లోనే ఉండటంపై మండిపడ్డారు. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగింపులో ఎలాంటి వారినైనా వదిలేది లేదని మంత్రి హెచ్చరించడం జీహెచ్ఎంసీలో చర్చనీయాంశమైంది.

వర్షాకాలం ప్రారంభమైనా రోడ్ల తవ్వకాలు ఎందుకు జరుగుతున్నాయంటూ అధికారులను నిలదీశారు కేటీఆర్. రోడ్ల తవ్వకాలపై వస్తున్న ఫిర్యాదులకు సమాధానం చెప్పాలంటే ఇబ్బందిగా ఉందన్నారు. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా రోడ్లపై గుంతలు ఎందుకున్నాయని అధికారులను నిలదీశారు. వర్షాకాలంలో రోడ్లన్నీ బాగుండేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. వర్షాకాలంలో పురాతన నిర్మాణాల విషయంలో జాగ్రత్త వహించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ప్రమాదకరంగా ఉన్న పురాతన భవనాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. సిటీలో ప్లాస్టిక్ వాడకంపై కూడా కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

2022 నాటికి సిటీలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించినా..జీహెచ్ఎంసీ ఆఫీసులో ఖాళీ వాటర్ బాటిల్స్ కనిపించడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. మరోవైపు నగరవాసులకు మరింత మెరుగైన పౌరసేవలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్ల ను 50గా, ఆరు జోన్లను 10కి పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని బల్దియా కమిషనర్ ను ఆదేశించారు. గతేడాది వరదలతో వచ్చిన ఇబ్బందులను ఇప్పటికీ పరిష్కరించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.. ఇష్టంలేని అధికారులు, సిబ్బంది సెలవులపై వెళ్ళాలని హెచ్చరిస్తూ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారు.

Posted in Uncategorized

Latest Updates