GHMCలో దొంగలు పడ్డారు : ఫోన్లు, చార్జర్లు, జర్కిన్లు మాయం

హైదరాబాద్ : GHMC ప్రధాన కార్యాలయంలో రోజూ ఏదో ఓ వస్తువు మాయం అవుతోందంటున్నారు ఉద్యోగులు.  బల్ధియాలో ఏడు ఫ్లోర్లు ఉన్నాయి. వివిధ సెక్షన్లలో పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్లు, చార్జర్లు, ఇయర్ ఫోన్లు, హెల్మెట్లు, కంప్యూటర్ కీ బోర్డులు, మౌస్ లు మాయం అవుతున్నాయి. ఆఖరికి చలికాలం వేసుకునే జర్కిన్లు, స్వెటర్లు కూడా మాయం అవుతున్నాయి.

బల్దియాలో సీసీ కెమెరాలు ఉన్న పనిచేయడం లేదు. GHMC మేయర్, కమిషనర్ల గేట్ల ముందు పెద్ద పెద్ద సీసీ కెమెరాలున్నాయి. ఇవే కాకుండా.. ఆఫీస్ చుట్టూ.. మరో 15కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ.. అవి చాలా రోజులుగా పనిచేయకపోవడంతో దొంగలకు మరింత అవకాశంగా మారింది. అంతేకాదు బల్ధియాలో వందకు పైగా సెక్యూరిటీ సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. అయినా దొంగతనాలు మాత్రం తగ్గడం లేదు.

రెగ్యులర్ గా దొంగతనాలు.. సెక్షన్లలోనే జరుగుతున్నాయి. పనిచేసేవారితో పాటు ఇతర వ్యక్తులు కూడా అన్ని సెక్షన్లలో తిరుగుతుంటారు. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియదు. వస్తువులు మాయం అవుతున్నాయి. అయితే ఎక్కువ ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు చోరీ అవుతున్నాయి. అసలే చాలీ చాలని జీతంతో ఇబ్బందిపడుతున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వస్తువుల దొంగతనాలు మరింత ఇబ్బందిగా మారాయి.

ఇవే కాదు గతంలో విజిలెన్స్ విభాగంలో రూ.పదివేలు మాయం చేశారు. విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ ఎంక్వైరీ చేసి దొంగతనం చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. దొంగతనాలు జరుగుతున్నది వాస్తవమేంటున్నారు అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ. త్వరలోనే హెడ్ ఆఫీసుతో పాటు సర్కిల్, జోనల్ ఆఫీసుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకి ప్లాన్ చేస్తున్నామన్నారు. మొత్తం వెయ్యి సీసీ కెమెరాలు పెట్టి.. హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తామని చెబుతున్నారు.

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు.. మరి బల్దియాలో జరుగుతున్న దొంగతనాల వెనుక ఉన్నది ఇంటిదొంగలా.. బయటి దొంగలా తేలాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates