GHMCలో మాయమైన 351 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

GHMCలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాయమయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా 351 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది కనిపించకుండా పోయారు. అయినా వారికి మాత్రం ప్రతి నెల జీతాలు చెల్లిస్తున్నారు అధికారులు. ఇంతకీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారా..ఉంటే ఎప్పుడు మిస్సయ్యారు. సిబ్బంది లేకుండానే ఏళ్లుగా జీతాలు ఇలాగే కపడకుండా పోయారా అనేది అనుమానంగా ఉంది.

బల్దియాలో ఇప్పుడిప్పుడే మరో అవినీతి బాగోతం బయటకొస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీం బలోపేతం చేసి..నగరంలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలని సర్కార్ భావించింది. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారి విశ్వజిత్ ను డైరెక్టర్ గా నియమించింది. ఆయన కింద పనిచేసే అధికారులతో పాటు అక్కడక్కడా ఖాళీగా ఉన్న 681 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని డైరెక్టర్ విశ్వజిత్ కు అటాచ్ చేసింది బల్దియా.

ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ కు కేటాయించిన 681 సిబ్బందిలో ప్రస్తుతం 330 మంది మాత్రమే విధుల్లో చేరారు.  విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆధ్వర్యంలో..ఇందిరా పార్క్ లో వీరికి పోలీస్ తరహాలోనే శిక్షణ ఇస్తున్నారు. యువకులకు డిజాస్టర్ మేనేజ్ మెంట్, విజిలెన్స్ విభాగాల్లో ట్రైనింగ్ నడుస్తోంది.. వయసు మీద పడినవారిని లేక్ ప్రొటెక్షన్, డ్రైవింగ్ విభాగాలకు కేటాయించారు.

అయితే మరో 351 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రం ఇప్పటి వరకు రిపోర్ట్ చేయలేదు. ఇప్పటికే నెల రోజుల దాటిపోయినా.. కేటాయించిన సిబ్బంది కనిపించకపోవడంపై డైరెక్టర్ విశ్వజిత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 351 మంది సిబ్బంది రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే ఇప్పటి వరకు రిపోర్ట్ చేయని వారికి రెండుసార్లు నోటీసులు కూడా ఇచ్చామనీ..అయినా స్పందించకపోతే విధుల నుంచి పూర్తిగా తొలగిస్తామంటున్నారు.

ఇటీవలే జీహెచ్ఎంసీలో 200 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే..50 వేల అప్లికేషన్లు వచ్చాయి. మరి 3 వందలకు పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు రాకుండా ఎలా ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. అసలు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇన్నాళ్లుగా ఉన్నారా.. లేక లేనివారి పేర్లతో జీహెచ్ఎంసీ ఖజానా కొల్ల గొట్టారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.

Posted in Uncategorized

Latest Updates