GHMC రూల్ : బహిరంగ మూత్ర విసర్జన చేస్తే.. ఫైన్ కట్టాల్సిందే

హైద‌రాబాద్‌: పరిసరాల పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది GHMC. ఇకనుంచి సిటీలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తే జరిమాన తప్పదని చెబుతున్నారు అధికారులు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేసినా ఫైన్ వేస్తామంటున్నారు.

GHMC రూల్స్ ప్రకారం బహిరంగ మూత్ర విసర్జన చేస్తే.. రూ. 100, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ. 100, డ్రైన్లలో చెత్త వేస్తే రూ. 1000, రోడ్లపై పెద్ద మొత్తంలో చెత్తవేస్తే రూ. 2000, డస్ట్ బిన్ లో కాకుండా కుండీ పక్కకు చెత్తవేస్తే రూ. 100, నిర్మాణ వ్యర్థాలు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో వేస్తే రూ. 10000, నాలాల్లో చెత్తను, వ్యర్థాలను వేస్తే రూ. 10వేలు ఫైన్ విధించే అవకాశముంది. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా ఫైన్ విధించాలని అధికారులు నిర్ణయించారు.

హైదరాబాద్ ను క్లీన్ సిటీగా ఉంచడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే..బహిరంగ మూత్ర విసర్జన నివారణకోసం ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. పెట్రోలు బంకులు, హోటళ్లలోని టాయిలెట్లను అందుబాటులోకి తేవడంతోపాటు.. బహిరంగ మూత్ర విసర్జన చేసే ప్రాంతాల్లో.. ముగ్గులు వేయడం, పెయింటింగ్ వేయడం, వలంటీర్లను నియమించడం లాంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

సిటీలో 28ప్రాంతాల్లో ఎక్కువగా బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమేకాకుండా ..స్వచ్ఛ కార్యకర్తలను ఏర్పాటుచేసి మూత్ర విసర్జన జరగకుండా చూడాలని నిర్ణ‌యించారు. సీసీ కెమేరాలను ఏర్పాటు చేయడంతోపాటు.. ప్రాంతాల్లో యూరినల్స్‌ ను ఏర్పాటుచేయాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు GHMC కమిషనర్ దానకిశోర్.

Posted in Uncategorized

Latest Updates