
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల క్రమంలో నగరంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. రాంనగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఇరువురు కార్యకర్తలు చొక్కాలు పట్టుకొని కొట్టుకొన్నారు. మాదాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఇలాగే దాదాపు 10 ప్రదేశాల్లో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. రామచంద్రాపురంలో దొంగ ఓట్లు వేయిస్తూ, ఓటర్లను భయపెడతున్నారని టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాచారం ఆరో డివిజన్ లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.