వామ్మో నత్తలొస్తున్నాయ్!

  • వానాకాలంలో కేరళ వాసులకు కొత్త కష్టాలు
  • మందలుగా వేల సంఖ్యలో రాక్షస నత్తలు
  • ఇంటాబయటా అవే..
  • కొన్ని చోట్ల వలస పోతున్న ప్రజలు
  • నిర్మూలించేందుకు ఐదేళ్లుగా రీసెర్చ్

వర్షాకాలం వచ్చిందంటే ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది.. ఎటుచూసినా పచ్చదనం కనువిందు చేస్తుంది. ప్రకృతి అందాలకు పుట్టిల్లులాంటి కేరళ సంగతి చెప్పనక్కర్లేదు. అయితే, కేరళలోని కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం ఎందుకొచ్చిన వర్షాకాలంరా బాబూ అనుకుంటున్నారు. వాళ్లేమీ వరద బాధితులు కాదు కానీ తొలకరి పలకరించాక ఓ కొత్త అతిథి ఎవరూ ఆహ్వానించకుండానే వచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నాడట. ఆ ఇబ్బందులు భరించలేక కొన్నిచోట్ల ఇళ్లు, వాకిలి వదిలేసి ప్రజలు వలస వెళుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇంతకీ ఆ అతిథి ఎవరో చెప్పలేదు కదా.. ఓ నత్త. నత్తే కదా అని తేలిగ్గా తీసిపడేయడానికి లేదు. ఆఫ్రికాలోని కెన్యాలో కనిపించే రాక్షస నత్తలు. పొలాల్లో పంటలను, ఇంట్లో వంటకాలను, పెరట్లో మొక్కలను.. ఇలా ఒకటేమిటి అన్నింటినీ స్వాహా చేస్తున్నాయట. వీటివల్ల అనారోగ్యాలు వచ్చే ముప్పు కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

పరిశోధన కోసం..

ఎక్కడో కెన్యాలో ఉండే నత్తలు కేరళకు ఎలా వచ్చాయంటే… పాతికేళ్ల క్రితం పరిశోధన కోసం ఓ పెద్దమనిషి సింగపూర్​నుంచి ఈ నత్తలను తెప్పించుకున్నారు. తీసుకొచ్చిన కొంతకాలానికే ఆ పరిశోధన కాస్తా అటకెక్కింది.. వీటిని ఏంచేయాలో తెలియక బయట పారేశాడాయన. అలా బయటపడ్డ నత్తల సంతతి వేగంగా పెరిగిపోయింది. ప్రస్తుతం కేరళలోని 14 జిల్లాల్లో 12 జిల్లాలకు ఈ రాక్షస నత్తలు విస్తరించాయి. కలప రవాణ, ఇతరత్రా మార్గాల ద్వారా తమిళనాడు, కర్నాటకకూ చేరుకున్నాయని కేరళ ఫారెస్ట్​రీసెర్చ్​ఇనిస్టిట్యూట్(కేఎఫ్ఆర్ఐ) సైంటిస్టు టీవీ సంజయ్​చెప్పారు. ఈ నత్తలను నిర్మూలించేందుకు పరిశోధన చేస్తున్న బృందంలో సంజయ్ కూడా ఒకరు. తొలకరి తర్వాత కనిపించే ఈ నత్తలు వర్షాకాలం సీజన్​అయిపోయిందంటే మళ్లీ నేలలో ఏర్పాటుచేసుకున్న షెల్టర్​లోకి చేరి దీర్ఘ నిద్రలోకి చేరుకుంటాయి. మళ్లీ వర్షాకాలం వచ్చిందంటే పైకొస్తాయని సంజీవ్​చెప్పారు.

నత్తకో రూపాయి..

తొలినాళ్లలో ఈ నత్తల బెడదను తప్పించేందుకు నత్తలను పట్టి తెచ్చిన వారికి నత్తకో రూపాయి చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇంకేం.. జనాలు సంచులతో నత్తలను పట్టుకెళ్లి జేబునిండా డబ్బులు తెచ్చుకున్నారు. దాంతో కొంతకాలానికే ఫండ్స్​సరిపోక అధికారులు ఈ స్కీంను ఎత్తేశారు. తర్వాత నత్తలను చంపేందుకు మెటాల్డిహైడ్​అనే కెమికల్​ను వాడారు. అయితే, చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటల్లోని నీరు ఈ కెమికల్ వల్ల కలుషితమై, జలచరాలు చనిపోవటంతో దీనికి స్వస్తి పలికారు. దీని స్థానంలో కాపర్​సల్ఫేట్, టొబాకో డికాక్టన్​మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ నత్తల దెబ్బకు కేరళలో ఓ ప్రత్యేక విభాగమే ఏర్పడింది. ఇలా వేగంగా, ప్రమాదకరంగా విస్తరించే జాతులను నియంత్రించేందుకు పరిశోధనలు నిర్వహిస్తోంది

Latest Updates