లాక్డౌన్ పాటిస్తే గిఫ్ట్ గా బంగారం, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్

కరోనావైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో ప్రధాని మోడీ మే3 వరకు లాక్డౌన్ విధించారు. దాంతో ప్రజలు ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. కొంతమంది మాత్రం ఏవో సాకులు రోడ్లు ఎక్కుతున్నారు. అలాంటి వారిని పోలీసులు బతిలాడో, భయపెట్టో బయటకి రావొద్దని చెబుతున్నారు. అయినా సరే కొంతమంది మాత్రం వారి మాట కూడా వినడంలేదు. అందుకే కేరళలోని ఓ గ్రామం వినూత్నంగా ఆలోచించింది.

కేరళలోని మలప్పురం జిల్లాలోని తాజెక్కోడ్ గ్రామ పంచాయతీ ఎలాగైన తమ గ్రామ ప్రజలు లాక్డౌన్ పాటించాలని అనుకుంది. అందుకోసం లాక్డౌన్ నిబంధనలు గత నెలలో అమల్లోకి రాగానే.. ప్రజలు ఇంట్లోనే ఉండాలంటే ఏదైనా చేయాలనుకుంది. గ్రామ ప్రజలు ఎవరైతే లాక్డౌన్ ముగిసేదాకా ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంటారో వారందరికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. అలాగని ఏ చిన్నా చితక బహుమతో కాదండోయ్.. ఏకంగా బంగారం, ఫ్రీడ్జ్, వాషింగ్ మెషిన్ లాంటివి ఇస్తామని ప్రకటించింది. ఇంకేముంది ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా తిని కూర్చొన్నా కూడా బహుమతులు వస్తాయని అనుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అంతే ఇంట్లో నుంచి ఒక్కరు కూడా కాలు బయటపెట్టడంలేదంట.

లాక్డౌన్ నిబంధనలు పాటించిన వారికి మొదటి బహుమతి కింద బంగారం, రెండవ బహుమతి కింద ఒక రిఫ్రిజిరేటర్, మూడవ బహుమతి కింద ఒక వాషింగ్ మెషిన్ తో పాటు మరో 50 కాంప్లిమెంటరీ బహుమతులు ఇస్తామని పంచాయతీకి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చింది.

ఈ పోటీ గురించి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎ.కె. నాసర్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ మార్గదర్శకాలను అనుసరించే వ్యక్తులకు బహుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రణాళిక ఏప్రిల్ 6న నిర్ణయించబడింది. ఆ మరుసటి రోజు నుంచే అది అమలులోకి వచ్చింది. మా పంచాయతీలో సుమారు 10,000 కుటుంబాలు ఉన్నాయి. ప్రజలు సురక్షితంగా ఉండాలంటే.. వారంతా ఇంటి లోపలే ఉండాలి. అందుకే మేం వారికి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. గ్రామ ప్రజలు ఎవరైనా రోడ్ల మీదికి వస్తే వారిని ఈ పోటీ నుంచి అనర్హులుగా ప్రకటిస్తాం. దీనిని పర్యవేక్షించడానికి కొంతమంది వ్యక్తులను గ్రామ పంచాయతీ ఏర్పాటుచేసింది. ఇప్పుడు లాక్డౌన్ అమలులో ఉన్నందువల్ల.. లాక్డౌన్ ముగిసిన తర్వాత బహుమతులు అందజేస్తాం. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఏయే కుటుంబం నుంచి ప్రజలు బయటకు రాలేదో వారందరికి కూపన్లు ఇస్తాం. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తాం’ అని సర్పంచ్ నాజర్ తెలిపారు.

కేరళ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం, మంగళవారం రాత్రి వరకు మలప్పురం జిల్లాలో ఒకరు మాత్రమే కరోనా చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మొత్తం 21 మందికి కరోనా సోకింది. వారిలో 19 మంది ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం కోలుకున్న తర్వాత వేరే ఇతర జబ్బుల వల్ల మరణించినట్లు తెలిసింది. కరోనావైరస్ బారినపడి గత వారం నాలుగు నెలల శిశువు మరణించినట్లు జిల్లా ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇప్పటివరకు కేరళ వ్యాప్తంగా 486 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 359 మంది రికవరీ కాగా.. 123 మంది చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మరణించారు.

For More News..

సీసీటీవీ ఫుటేజ్: సిరియాలో బాంబు దాడి.. 40 మంది మృతి

Latest Updates