150 కి.మీ. నడిచి.. గంటలో ఇంటికి చేరుతుందనగా మృతి

  • వీక్‌నెస్‌తో నడవడంతో చనిపోయిన 12ఏళ్ల బాలిక
  • తెలంగాణ నుంచి చత్తీస్‌గఢ్‌కు వచ్చేందుకు
  •  మూడు రోజులు నడిచిన వలస కూలీలు
    బీజాపూర్‌‌: ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన కంటికి కనిపించని మహమ్మారి పేదోళ్ల కడుపు కొడుతోంది. వలస కూలీలను ఆకలి చావులకు బలిచేస్తోంది. పనులు లేక, అద్దె కట్టేందుకు డబ్బులు లేక వేలాది మంది ప్రాణాలకు తెగించి వందల కిలోమీటర్లు నడిచేలా చేస్తోంది. కరోనాను అరికట్టేందుకు ఏప్రిల్‌ 14 వరకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించడంతో చాలా మంది కూలీలు చేసేదేమీ లేక ఊరి బాట పట్టారు. ట్రాన్స్‌పోర్ట్‌ లేకపోవడంతో కాలినడకన వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే చత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌‌కు చెందిన 12 ఏళ్ల అమ్మాయి మూడు రోజుల పాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచి.. మరో 11 కిలోమీటర్లు నడిస్తే ఇంటికి చేరుకుంటుందనగా ప్రాణాలు విడిచింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన జమ్లో మకడం అనే 12 ఏళ్ల బాలిక కుటుంబసభ్యులతో కలిసి రెండు నెలల క్రితం పొలం పనుల కోసం తెలంగాణలోని ఓ గ్రామానికి వచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగించడంతో చేసేదేమీ లేక వాళ్లంతా కాలినడకన సొంత వూరికి వెళ్లేందుకు ఈ నెల 15న నడవడం మొదలుపెట్టారు. హైవే నుంచి కాకుండా అడవుల ద్వారా మూడు రోజుల పాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచారు. మరో 11 కిలోమీటర్లు నడిస్తే ఇంటికి చేరుకుంటారనగా బాలిక అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకుని, కడుపునొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయింది. బాలిక పోషకాహార లోపంతో ఉందని, దాని వల్ల ఎక్కువ దూరం నడవడంతో డిహైడ్రేట్‌ అయి చనిపోయిందని డాక్టర్‌‌ బీఆర్‌‌ పుజారీ చెప్పారు. పాపకు కరోనా నెగటివ్‌ వచ్చిందని, మృతదేహాన్ని అంబులెన్స్‌లో సొంత ఊరికి తరలించామని అన్నారు. “ మూడు రోజుల పాటు మాతోనే నడిచింది. ఒక్కసారిగా వాంతులు చేసుకుని కడుపునొప్పి అని మెలికలు తిరిగిపోయింది” అని బాలిక తండ్రి చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం ప్రకటించింది.

Latest Updates