మ్యాట్రిమోనీలో అమ్మాయిలకు వల.. ఫోటోలు మార్ఫింగ్ చేస్తానంటూ బెదిరించి..

ఎల్ బీ నగర్,వెలుగు: మ్యాట్రి మోనీ సైట్లలో వరుడి కోసం ప్రొఫైల్ పెట్టిన అమ్మాయిలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్ బీనగర్ లోని రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్ లో ఏసీపీ హరినాథ్ గురువారం కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన బానొత్ సాయినాథ్(20) ఖమ్మంలోని ఓ కాలేజీలో ఫిజియోథెరపీ కోర్సు చేస్తున్నాడు. రాయల్టీ లైఫ్ కి అలవాటుపడిన సాయినాథ్ మాట్రిమోనీలో అమ్మాయిల ప్రొఫైల్స్ ని టార్గెట్ చేసి వారితో పరిచయం పెంచుకుని డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేశాడు. మాట్రిమోనిలో అమ్మాయిల ప్రొఫైల్స్ ను సెలక్ట్ చేసుకుని వారి వివరాలు, ఫోన్ నంబర్ సేకరించేవాడు.

ఇలా మలేసియాలో జాబ్ చేస్తున్న సిటీకి చెందిన ఓ యువతి ప్రొఫైల్ ను సాయినాథ్ మాట్రిమోనిలో చూశాడు. ఆ అమ్మాయి ఫోన్ నంబర్ సేకరించి చాటింగ్ చేశాడు. తన పేరు డా.అవినాశ్ రెడ్డి అని..తాను కరీంనగర్ లో డాక్టర్ గా పనిచేస్తున్నానని సాయినాథ్ ఆ యువతిని నమ్మించాడు. ఇద్దరికి పరిచయం పెరిగాక ఒకరి ఫొటోలను ఒకరు షేర్ చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత తన ఫ్రెండ్ ఇబ్బందుల్లో ఉన్నాడని..కొంత డబ్బు కావాలని..తన డెబిట్ కార్డ్ డ్యామేజ్ అయిందని సాయినాథ్ ఆ యువతికి చెప్పాడు. ఆ యువతి దగ్గరి నుంచి సాయినాథ్ ఆన్ లైన్ లో మనీ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఇలా ఆ యువతిని మాటలతో మభ్యపెట్టిన సాయినాథ్ విడతల వారీగా రూ.2.80లక్షలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ యువతి తన డబ్బులను తిరిగి అడగటం ప్రారంభించింది.

అప్పటి నుంచి సాయినాథ్ ఆ యువతితో మాట్లాడటం మానేశాడు. ఆమె తరచూ డబ్బులు అడుగుతుండటంతో తన వద్ద ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో,ఆమె బంధువులకు షేర్ చేస్తానని అప్ లోడ్ చేస్తానని సాయినాథ్ ఆ యువతిని బెదిరించాడు. ఆ తర్వాత మరికొంత డబ్బులు కావాలని సాయినాథ్ ఆ యువతిని డిమాండ్ చేశాడు. సాయినాథ్ వేధింపులు భరించలేక ఆ యువతి మలేసియా నుంచి సిటీకి వచ్చి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సాయినాథ్ గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. గతంలో ఖమ్మంలో ఇలాంటి పనులు చేస్తుండటంతో సాయినాథ్ ని అతడి తండ్రి ఇంట్లో నుంచి బయటికి పంపించినట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత సాయినాథ్ వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లోని బాయ్స్ హాస్టల్స్ లో ఉంటూ మోసాలకు పాల్పడేవాడు.

మాట్రిమోనీ సైట్లలో అమ్మాయిలకు వల వేసి వారు పంపించే డబ్బును తన హాస్టల్ రూమ్ మేట్స్ కి అకౌంట్లకు వేయించుకునేవాడు. తన ఫ్రెండ్స్ డబ్బులు పంపిస్తున్నారని హాస్టల్ లోని రూమ్ మేట్స్ ని సాయినాథ్ నమ్మించి వారి అకౌంట్ నంబర్లు, ఇ– వాలెట్ ను వాడుకునేవాడు. మలేసియా నుండి వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించినట్లు అనుమానం వచ్చిన సాయినాథ్ వివిధ ప్రాంతాలు తిరుగుతూ గుంటూర్ లోని బాయ్స్ హాస్టల్ కు వెళ్ళాడు. దర్యాప్తు చేపట్టిన ఇన్ స్పెక్టర్ ఆశిష్ రెడ్డి తన టీంతో గుంటూరుకి వెళ్లి అక్కడి ఓ బాయ్స్ హాస్టల్ లో ఉన్న సాయినాథ్ ను అరెస్ట్ చేశారు. బైక్ స్వాధీనం చేసుకున్నారు. సాయినాథ్ గత మోసాలకి సంబంధించిన వివరాలను విచారణలో రాబడతున్నట్టు పోలీసులు తెలిపారు.

Latest Updates