హిమాచల్ ప్రదేశ్ హైవేపై మంచు గోడ

పది అడుగుల ఎత్తున రోడ్డుకు అడ్డంగా మంచు గోడ కట్టేస్తే ఎట్లుంటది? బండ్లు ముందుకెళ్లకుండా అదే మన మీదకు దూసుకొస్తే ఎట్లుంటది? ఇదిగో.. ఇట్లుంటది! మనం బతికేందుకు ఎన్నో వనరులిస్తది ప్రకృతి. వాటిని వాడుకునే తీరులో వాడుకుంటే ఓకే. కానీ, అతిగా వాడేస్తే మాత్రం తనేంటో చూపిస్తది. భయమంటే ఎట్లుంటదో చూపించి వెన్నులో వణుకు పుట్టిస్తది. హిమాచల్​ ప్రదేశ్​లోని కినౌర్​ జిల్లాలోని టింకూ నల్లాకు సమీపంలోని పూహ్​ వద్ద నేషనల్​ హైవే 5పై ఇట్ల హిమనీ నదం (గ్లేసియర్​) పై నుంచి కిందకు దూసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా నిలబడిపోయింది. రోడ్డుపై వెళ్లే వాహనాలను వెళ్లకుండా బ్లాక్​ చేసేసింది. ప్రయాణికులను భయం గుప్పిట్లో బంధించేసింది. కార్లు వెనక్కు వెళ్లేలా చేసింది. అయినా ఓ వెహికిల్​ అలాగే ముందుకెళ్లిపోవడంతో మంచు గోడ, రోడ్డు అంచుకు మధ్య ఇరుక్కుపోయింది. మంచు దూసుకొస్తోందన్న భయం లేకుండా కొందరు వ్యక్తులు మాత్రం తమ ఫోన్లకు పని చెప్పారు. వీడియోలు, ఫొటోలు తీశారు. అవి కాస్తా సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. ఐఆర్​ఎస్​ అధికారి నవీద్​ ట్రంబూ మంచు కొండ రోడ్డు మీదకు దూసుకొస్తున్న వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ‘‘ఎప్పుడైనా కిందకు దూసుకొస్తున్న గ్లేసియర్​ను చూశారా? వాతావరణ మార్పులన్నది ఎంతో దూరంలో లేదు’’ అంటూ వీడియోకు కామెంట్​ పెట్టారు. ఈ వీడియో చూసి కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం మనమేనని, ప్రకృతిని దోచుకుంటున్నందుకు ప్రకృతి తీర్చుకుంటున్న పగ అని, మనకు కావాల్సిందేనని కామెంట్లు పెట్టారు. ప్రమాదమని తెలిసీ ఫొటోలు తీస్తున్న జనంపై మరికొందరు నెటిజన్లు మండిపడ్డారు. కొంచెమైనా బుద్ధి ఉందా అంటూ తిట్టారు.

 

Latest Updates