జీఎంఆర్ ఇన్‌‌ఫ్రా నష్టం రూ. 457 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు :జీఎంఆర్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ లిమిటెడ్‌‌ సెప్టెంబర్‌‌ 2019తో ముగిసిన రెండో క్వార్టర్‌‌కు రూ. 457 కోట్ల నష్టం ప్రకటించింది. అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్లో ఈ నష్టం రూ. 334 కోట్లే. ఇక ఈ ఏడాది రెండో క్వార్టర్లో రెవెన్యూ అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లోని రూ. 1,904 కోట్ల నుంచి రూ. 2,018 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్‌‌పోర్ట్స్‌‌ విభాగం నుంచి రూ. 1,494 కోట్లు, విద్యుత్‌‌ విభాగం నుంచి రూ. 167.40 కోట్లు వచ్చాయి. ఢిల్లీ ఎయిర్‌‌పోర్టు ట్రాఫిక్‌‌ గత ఏడాదిలాగే 1.73 కోట్ల వద్ద స్థిరంగా ఉందని, ఐతే ఏప్రిల్‌‌  క్వార్టర్​తో పోలిస్తే మాత్రం 10 శాతం పెరిగింది. జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ప్రభావం తగ్గుముఖం పట్టినట్లేనని జీఎంఆర్‌‌ ఇన్‌‌ఫ్రా వెల్లడించింది. ఈ ఎయిర్‌‌పోర్టు లాభం రూ. 135 కోట్లకు చేరినట్లు పేర్కొంది.

 పెరిగిన హైదరాబాద్‌‌  ఎయిర్​పోర్ట్​ ట్రాఫిక్​

హైదరాబాద్‌‌ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్టు ట్రాఫిక్‌‌ 3 శాతం పెరిగి 54 లక్షలకు చేరిందని, లాభం కూడా రూ. 217 కోట్లకు పెరిగిందని జీఎంఆర్‌‌ తెలిపింది. జీఎంఆర్‌‌ గ్రూప్‌‌ పోర్ట్‌‌ఫోలియోలోని ఎయిర్‌‌పోర్టులకు మొత్తం 15.9 కోట్ల ప్యాసింజర్‌‌ సామర్థ్యం ఉందని, ఇండియాలోనే బిజీ ఎయిర్‌‌పోర్టయిన ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్టు (ఢిల్లీ), రాజీవ్‌‌ గాంధీ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్టు (హైదరాబాద్), మెగావైడ్‌‌ భాగస్వామ్యంతో మక్టన్‌‌ సెబు ఎయిర్‌‌పోర్టు (ఫిలిప్పైన్స్‌‌)లు తమ నిర్వహణలోనే ఉన్నాయని వెల్లడించింది. ఫిలిప్పైన్స్‌‌లోనే మరో ఎయిర్‌‌పోర్టు ప్రాజెక్టును కూడా క్లార్క్‌‌ ఇంటర్నేషనల్‌‌ భాగస్వామ్యంతో చేజిక్కించుకున్నట్లు జీఎంఆర్‌‌ ఇన్‌‌ఫ్రా తెలిపింది. నాగ్‌‌పూర్‌‌ ఎయిర్‌‌పోర్టు డెవలప్‌‌మెంట్‌‌కు ఇటీవలే లెటర్‌‌ ఆఫ్‌‌ ఇంటెంట్‌‌ వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌‌లోని విశాఖపట్నం సమీపంలో తలపెట్టిన భోగాపురం ఎయిర్‌‌పోర్టు ప్రాజెక్టుకు అత్యధిక బిడ్డర్‌‌గానూ అవతరించినట్లు జీఎంఆర్‌‌ ఇన్‌‌ఫ్రా వెల్లడించింది. ఢిల్లీ, హైదరాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులకు పక్కన ఎయిర్‌‌పోర్టు సిటీలనూ డెవలప్‌‌ చేస్తున్నట్లు తెలిపింది.

 

Latest Updates