కాకినాడ సెజ్ నుంచి తప్పుకున్న జీఎంఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్

ఆంధ్రప్రదేశ్ లో ని కాకినాడ సెజ్ లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను అరబిందో రియాల్టీ కి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు జీఎంఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ శుక్రవారం ప్రకటించింది. కాకినాడ సెజ్ లిమిటెడ్(కేసెజ్)లో తన సబ్సిడరీ జీఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్(జీఎస్ పీహెచ్ఎల్)కున్న మొత్తం 51 శాతం వాటాను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు అమ్మేస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ లో జీఎంఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తెలిపిం ది. ఈక్విటీ స్టేక్ సేల్, కేసెజ్ సబ్ డెట్ మొత్తం కలుపుకుని ఈ డీల్ రూ.2,610 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ఈ మొత్తంలో రూ.1,600 కోట్లు డీల్ క్లోజింగ్ డేట్ రోజున వస్తుందని, మిగిలిన రూ.1,010 కోట్లు వచ్చే రెండు లేదా మూడేళ్లలో పొందుతామని జీఎంఆర్ ఇన్ ఫ్రా చెప్పింది. ఈ ట్రాన్సాక్షన్ తో జీఎంఆర్ గ్రూప్ కు ఉన్న మొత్తం అప్పుల్లో చాలా వరకు తగ్గించుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ వాటాల అమ్మకంతో కేసెజ్ ను నిర్వహించే కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్(కేజీపీఎల్ ) 100 శాతం ఈక్విటీ స్టేక్ ను అరబిందో రియాల్టీకి ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించిం ది. పోర్ట్ ఆధారిత మల్టీ ప్రొడక్ట్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ప్రాజెక్ట్ ను కేసెజ్ చేపడుతోంది. ఇది కాకినాడలో ఉంది. రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ కమర్షియల్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి పలు మినహాయింపులను కూడా కేజీపీఎల్ పొందింది. ఈ సేల్ ప్రాసెస్ అంతా రెగ్యులేటరీ, స్టాట్యుటరీ అప్రూవల్ మేరకే ఉందని కంపెనీ వెల్లడించింది. డీల్ వార్తలతో జీఎంఆర్ ఇన్ ఫ్రా షేరు లాభాల్లో నడిచింది.

Latest Updates