కంటోన్మెంట్ జోన్లలో బడులకు పోవాలా వద్దా?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూల్ టీచర్లు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. కరోనా రూల్స్​ మేరకు టీచర్లు, సిబ్బంది రోజు విడిచి రోజు బడులకు పోనున్నారు. అయితే కంటైన్మెంట్ జోన్లలోని స్కూళ్ల పరిస్థితిపై గందరగోళం ఏర్పడింది. అక్కడి బడులకు టీచర్లు పోవాలా? వద్దా? క్లారిటీ లేదు.

మెమోలో ఒకలా.. డీఈవోలు మరోలా..

స్కూల్​ ఎడ్యుకేషన్​ పరిధిలో 26,754 విద్యా సంస్థలుండగా, వాటిలో 1.30 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్​తో మార్చి మూడో వారం నుంచి స్కూళ్లన్నీ మూతపడ్డాయి. ఈ నెల 21 నుంచి 50 శాతం టీచర్ల చొప్పున బడులకు పోవాలని​11వ తేదీన స్పెషల్ సీఎస్ ఉత్తర్వులిచ్చారు. వైద్య శాఖ డేటా ప్రకారం ఆదివారం వరకూ రాష్ట్రంలో 25 జిల్లాల్లో 2,091 గ్రామాలు, ఏరియాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. మొత్తంగా 30–40 శాతం బడులు కంటైన్మెంట్ జోన్ల పరిధిలోనే ఉంటాయని తెలుస్తోంది. సర్కారు మెమో కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న స్కూళ్లకే వర్తించేలా ఉంది. మరోవైపు 21వ తేదీ నుంచి సగం మంది టీచర్లు బడులకు రావాలని డీఈవోలు జిల్లా స్థాయిల్లో కంటైన్మెంట్ అనే పదాన్ని వాడకుండా ఆర్డర్స్​ఇచ్చారు. ఆ ఏరియాల్లో స్కూళ్లకు టీచర్లు, సిబ్బంది పోవాలా లేదా అనే దానిపై టీచర్లు, హెడ్మాస్టర్లు డీఈవోలను అడిగినా.. సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికే వందల మంది టీచర్లు కరోనాబారిన పడటంతో అందరిలో అందోళన మొదలైంది.

9,10 క్లాసుల వాళ్లు ఇప్పుడే వద్దు

గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 9,10 క్లాసుల స్టూడెంట్స్​ 21 నుంచి స్కూళ్లకు వచ్చి డౌట్లు క్లారిఫై చేసుకునే అవకాశం ఉండేది. కానీ వారు ఏ సమయంలో రావాలి? ఎంత సేపు బడిలో ఉండాలి? అనే దానిపై క్లారిటీ లేకపోవడంతో, తాము చెప్పేంత వరకూ పిల్లలను బడులకు రానివొద్దని డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్​డైరెక్టర్ శ్రీదేవసేనా సూచించారు. 9,10 క్లాసుల స్టూడెంట్స్​బడికి వచ్చే టైమ్స్, కంటైన్మెంట్ జోన్ల పరిధిలో టీచర్ల హాజరుపై ‘ఆపరేషన్ గైడ్​లైన్స్’రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ఆ ఉత్తర్వులు వచ్చాకే స్పష్టత వస్తుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జోన్లలో టీచర్లు బడులకు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

హెల్త్ వర్కర్‌‌ను నియమించాకే తెరవాలె

కరోనా తీవ్రంగా ఉన్నందున సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బడులు తెరవొద్దని స్టూడెంట్స్ కోరుతున్నారు. స్కూల్స్ స్టార్ట్ చేయాలనుకుంటే  హెల్త్ వర్కర్ ను నియమించాలని 72 శాతం స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ తెలిపింది. రాష్ట్రంలో ఆన్ లైన్ క్లాసులు, ఇతర వసతులపై ఈ నెల ఫస్ట్​వీక్​లో ఎస్ఎఫ్ఐ చేసిన సర్వే వివరాలను ఆదివారం వెల్లడించింది.  28 శాతం స్టూడెంట్లు కరోనా పూర్తిగా తగ్గే వరకు స్కూల్స్ వద్దని సర్వేలో చెప్పారు. ఆన్ లైన్ పాఠాలు అర్థమైతలేవని 76 శాతం, క్లాస్ వినేందుకు కరెంట్ సమస్య ఉందని 49 శాతం, ఆన్ లైన్ క్లాస్ వినే అవకాశమే లేదని 28 శాతం స్టూడెంట్స్ తెలిపారు. 318 మండలాల్లో 1456 మంది స్టూడెంట్స్ ఓపీనియన్స్ తీసుకున్నారు. వీరిలో 1046 మంది సర్కారీ, 410 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నారు.

Latest Updates